గత వారం 5 షేర్లు హవా

Last week Markets up- 5 Stocks zoom - Sakshi

6 శాతం పెరిగిన మార్కెట్లు

జాబితాలో ఈఐడీ ప్యారీ

బిర్లా కార్ప్‌, ఫ్యూచర్‌ రిటైల్‌

వొడాఫోన్‌ ఐడియా, ఐషర్‌ 

ప్రధానంగా అమెరికా మార్కెట్ల బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం గత వారం ర్యాలీ చేశాయి. సెన్సెక్స్‌ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. ఏప్రిల్‌ 6 తదుపరి ఇది అత్యధిక లాభంకాగా.. నిఫ్టీ సైతం మూడు వారాల నష్టాలకు చెక్‌ పెడుతూ 6 శాతం ఎగసింది. వీక్లీ చార్టుల ప్రకారం బుల్లిష్‌ కేండిల్‌ స్టిక్‌ ఏర్పడినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. నాలుగు రోజులపాటు సాగిన ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ బలపడుతూనే వచ్చింది. దీంతో దాదాపు 12 శాతం పురోగమించింది. దీంతో బ్యాంక్‌ నిఫ్టీలోనూ వీక్లీ చార్టుల ప్రకారం బుల్లిష్‌ కేండిల్‌ స్టిక్‌ ఏర్పడినట్లు సాంకేతిక నిపుణులు తెలియజేశారు. కాగా గత వారం ఐదు షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. వివరాలు చూద్దాం..

ఈఐడీ ప్యారీ
గ్రూప్‌ కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌లో 2 శాతం వాటా విక్రయించాలని ఈఐడీ ప్యారీ చూస్తోంది. తద్వారా రుణ చెల్లింపులను చేపట్టి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈఐడీ ప్యారీ షేరు గత వారం 25 శాతం దూసుకెళ్లింది. కోరమాండల్‌లో 60.47 శాతం వాటాను ఈఐడీ ప్యారీ కలిగి ఉంది. ప్రస్తుతం కోరమాండల్‌ మార్కెట్‌ విలువ(కేపిటలైజేషన్‌) రూ. 20,000 కోట్లుగా నమోదైంది. దీంతో 2 శాతం వాటా ద్వారా రూ. 400 కోట్లవరకూ సమకూర్చుకునే వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు.

బిర్లా కార్పొరేషన్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో గత వారం బిర్లా కార్ప్‌ షేరు 25 శాతం జంప్‌చేసింది. సిమెంట్‌కు మంచి ధరలు లభించడంతో ఇబిటా మార్జిన్లు 17.2 శాతం నుంచి 20.4 శాతానికి ఎగశాయి. అయితే సిమెంట్‌ అమ్మకాలు తగ్గడంతో ఆదాయం 10 శాతం క్షీణించి రూ. 1690 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. రూ. 610 టార్గెట్‌ ధరను సైతం ప్రకటించింది.

ఫ్యూచర్‌ రిటైల్‌
మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 650 కోట్లను సమీకరిస్తున్నట్లు వెల్లడించిన ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌ గత వారం జోరందుకుంది. 21 శాతం లాభపడింది. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా దశల వారీగా ఎన్‌సీడీలను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు బోర్డు అనుమతి లభించినట్లు వెల్లడించింది.

వొడాఫోన్‌ ఐడియా
ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయనున్న వార్తలతో మొబైల్‌ టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా కౌంటర్‌ గత వారం పుంజుకుంది. గూగుల్‌ 5 శాతం వాటా కొనుగోలు యోచనలో ఉన్నట్లు వెలువడిన వార్తలు వొడాఫోన్‌ ఐడియా స్టాక్‌కు డిమాండ్‌ పెంచాయి. దీంతో 18 శాతం పరుగు తీసింది. అయితే గూగుల్‌ పెట్టుబడి వార్తలను తోసిపుచ్చడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు తొలుత ఆర్జించిన భారీ లాభాలను కొంతమేర పోగొట్టుకుంది.

ఐషర్‌ మోటార్స్‌ 
రూ. 10 ముఖ విలువగల షేరుని విభజించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించడంతో ఆటో రంగ దిగ్గజం ఐషర్‌ మోటార్స్‌ షేరు 17 శాతం జంప్‌చేసింది. ఈ ప్రతిపాదనను జూన్‌ 12న నిర్వహించనున్న సమావేశంలో బోర్డు నిర్ణయించనున్నట్లు తెలియజేసింది. షేర్ల విభజన ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లకు అందుబాటుతోపాటు, లిక్విడిటీ పెంపునకు వీలు కలగనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top