ఐపీవో సరే... లాభాలేవీ?

Khadim India IPO subscribed 1.88 times on last day - Sakshi

లిస్టింగ్‌ తర్వాత చతికిలబడుతున్న కంపెనీలు

మూడో వంతు ఐపీవోలు ఆఫర్‌ ధర కంటే తక్కువకే

బ్లాక్‌ బస్టర్‌ లిస్టింగ్‌తో లాభాలిస్తున్నవి కొన్ని మాత్రమే

ఇష్యూలోనే అధిక ధర పెట్టడం ప్రధాన కారణం

న్యూఢిల్లీ: మార్కెట్లు మంచి పరుగు మీద ఉండటంతో ఇప్పటిదాకా కాచుక్కూర్చున్న కంపెనీలన్నీ పబ్లిక్‌ ఇష్యూలతో ముందుకు వస్తున్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ ఐపీవోల పట్ల విపరీతమైన సానుకూలంగా స్పందిస్తున్నారు. కొన్ని ఐపీవోలకైతే ఊహించని స్పందన వస్తోంది. కానీ లిస్టింగ్‌ తర్వాతో..? లిస్టింగ్‌ తర్వాత ఆ షేర్లు ఎవరికీ నచ్చడం లేదేమో! కొన్ని మాత్రమే టాప్‌గేర్‌లో దూసుకెళుతుండగా... చాలా షేర్లు చతికిలబడి చూస్తున్నాయి.

ఈ ఏడాది ఐపీవోలకు వచ్చిన వాటిలో మూడింట ఒక వంతు లిస్టింగ్‌ తర్వాత ఆఫర్‌ ధర కంటే తక్కువలోనే ట్రేడవుతుండటం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీవోల ద్వారా 31 కంపెనీలు రూ.56,870 కోట్ల నిధుల్ని సమీకరించాయి. వీటిలో సుమారు పది కంపెనీల షేర్ల ధరలు ఐపీవోలో జారీ ధర కంటే తక్కువకే లభిస్తున్నాయి. వీటిలో సీఎల్‌ ఎడ్యుకేట్, ఎస్‌ చాంద్‌ అండ్‌ కంపెనీ, జీటీపీఎల్‌ హాత్‌వే, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్, మ్యాట్రిమోనీ డాట్‌ కామ్, ఎస్‌బీఐ లైఫ్, జనరల్‌ ఇన్సూరెన్స్, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సే ్చంజ్, సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నాయి.

అలాగని అన్ని కంపెనీలూ చతికిలబడ్డాయనుకుంటే పొరపాటే!! ఈ ఏడాది ఐపీవోకు వచ్చిన అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీమార్ట్‌), శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్, సలాసర్‌ టెక్నో ఇంజనీరింగ్, సీడీఎస్‌ఎల్, అపెక్స్‌ ఫ్రోజన్‌ ఫుడ్స్, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ మాత్రం ఇన్వెస్టర్ల సంపదను దాదాపు రెట్టింపు చేశాయి. వీటిలో కొన్ని ఒకటి కంటే ఎక్కువ రెట్లు పెరిగిపోవడం గమనార్హం.

ఐపీవో ధరలు బుల్‌ మార్కెట్‌కు తగ్గట్టు అధిక స్థాయిలో ఉంటున్నాయని, ప్రైమరీ మార్కెట్‌ వ్యవహారం పాల పొంగు మాదిరిగా ఉందనేది బ్యాంకర్లు, మార్కెట్‌ నిపుణుల అభిప్రాయం. ‘‘ఐపీవో విజయం సాధించడం అన్నది ఆ ఇష్యూకు వచ్చిన స్పందన, లిస్టింగ్‌ రోజున ఏ ధర ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. లిస్టింగ్‌ రోజున మార్కెట్‌లో ఉన్న పరిణామాల ప్రభావం కూడా ఉంటుంది’’ అని ప్రైమ్‌ డేటాబేస్‌ చైర్మన్‌ పృధ్వి హాల్దియా అన్నారు.

దండిగా నిధులు...
నిధుల లభ్యత పుష్కలంగా ఉండడంతో ఐపీవోలు ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవతంగా ఇష్యూలను పూర్తి చేసుకుంటున్నాయి. అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐ) రుణాలు తీసుకుని మరీ ఐపీవోల్లో పాల్గొంటుండడంతో కొన్ని ఇష్యూలకు అధిక బిడ్లు దాఖలవుతున్నాయి. బంపర్‌ లిస్టింగ్‌ అవకాశాలు, ఐపీవో ప్రారంభం నుంచి లిస్టింగ్‌కు మధ్య స్వల్ప విరామమే ఉండడం ఇందుకు అవకాశం కల్పిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

‘‘మొత్తం ఐపీవోలను కలిపి చూస్తే 10–15 శాతం వార్షిక రాబడులను ఆశించొచ్చు. స్వల్ప కాలం కంటే దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించే విధానం కలిగి ఉండాలి’’ అని యాక్సిస్‌ క్యాపిటల్‌ ఎండీ ధర్మేష్‌ మెహతా సూచించారు. ప్రతీ ఐపీవో గొప్ప పనితీరు చూపించదని, అయినప్పటికీ ఇన్వెస్టర్లు ఐపీవోల్లో చురుగ్గా పెట్టుబడులు పెడుతున్నారని మెహతా అన్నారు. స్టాక్‌ మార్కెట్‌ అంతటా వ్యాల్యూషన్లు అధిక స్థాయికి చేరడం, ఐపీవోల్లో అధిక ధరల నిర్ణయం వంటి పరిణామాల నేపథ్యంలో 40–50 శాతం లిస్టింగ్‌ లాభాలను ఆశించకూడదన్నారు.

ఐపీవోకు వచ్చిన కంపెనీలు                         31
లిస్టింగ్‌ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నవి    10
0– 20 శాతం లాభంతో ఉన్నవి                      3
20– 100 శాతం లాభంతో ట్రేడవుతున్నవి      10
100 శాతానికిపైగా లాభపడినవి                    6
ఖాదిమ్‌ ఇండియా, మహీంద్రా లాజిస్టిక్స్‌ లిస్ట్‌ కావాల్సి ఉంది.
 అద్భుత పనితీరు చూపించినది డీమార్ట్‌. ఇది ఇప్పటికే 283%  లాభాల్ని పంచింది.
 ప్రతికూల పనితీరు చూపించిన వాటిలో సీఎల్‌ ఎడ్యుకేట్‌ ముందుంది. ఆఫర్‌ ధర కంటే 35% తక్కువలో ట్రేడవుతోంది.

నష్టాల్లో టాప్‌ – 10
కంపెనీ             ఇష్యూ             లిస్టింగ్‌           ప్రస్తుత
                      ధర(రూ.)         ధర(రూ.)       ధర(రూ.)
సీఎల్‌ ఎడ్యుకేట్‌    500                398              327
ఎస్‌బీఐ లైఫ్‌        700                735             657
ఎస్‌ చాంద్‌          670                 676             487
ఎరిస్‌ లైఫ్‌           603                612             571
భారత్‌ రోడ్‌          205                 205            174
మ్యాట్రిమోనీ        985                 985            868
ఎస్‌ఐఎస్‌           815                 875            813
జీటీపీఎల్‌ హాత్‌వే  170                170             153
జనరల్‌ ఇన్సూరెన్స్‌  912              858            819
ఐఈఎక్స్‌            1650             1500          1603 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top