ఆదాయంలో ‘జియో’ అగ్రస్థానం

Jio retains lead over older telcos in AGR for March quarter - Sakshi

మార్చి త్రైమాసికంలో రూ.9,839 కోట్లు ఏజీఆర్‌

న్యూఢిల్లీ: ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) పరంగా టాప్‌ స్థానంలో నిలిచినట్లు ట్రాయ్‌ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోన్న ఈ సంస్థ.. ఏజీఆర్‌ విషయంలోనూ ఇతర కంపెనీలను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరింది. సంస్థకు మొబైల్‌ ఫోన్‌ సేవల నుంచి అందే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 3.76 శాతం వృద్ధి చెంది రూ.9,839 కోట్లుగా నమోదైంది. అయితే, ఏడాది ప్రాతిపదికన ఈ స్థాయి వృద్ధి నమోదుకాగా, త్రైమాసికం పరంగా మాత్రం వృద్ధిలో వేగం నెమ్మదించింది.

డిసెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా 14.6 శాతం వృద్ధిని సాధించిన సంస్థ.. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ పరంగా ఆశించినస్థాయి వేగాన్ని అందుకోలేకపోయింది. ఇక చందాదారుల సంఖ్య పరంగా దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌ వోడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ త్రైమాసికం పరంగా 1.25 శాతం తగ్గి రూ.7,133.4 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఏజీఆర్‌ ఎనిమిది శాతం తగ్గి రూ.5,920.2 కోట్లుగా నిలిచింది.ప్రభుత్వానికి చెందాల్సిన లైసెన్స్, ఇతర రుసుముల వాటా ఏజీఆర్‌ ఆధారంగానే నిర్ణయంకానుండగా.. మొత్తం టెలికం సర్వీసెస్‌ ఏజీఆర్‌లో యాక్సిస్‌ సేవల వాటా 72 శాతంగా ఉంది. మార్చి క్వార్టర్‌లో లైసెన్స్‌ ఫీజు రూ.2,888 కోట్లు కాగా, అంతక్రితం త్రైమాసికంలో రూ.2,890 కోట్లుగా ఉంది.

పెరిగిన ఏఆర్‌పీయూ
మార్చి త్రైమాసికంలో ఈ రంగ పనితీరును లెక్కకట్టడంలో భాగంగా ట్రాయ్‌ ‘భారత టెలికం సర్వీసెస్‌ పనితీరు సూచిక’ పేరిట నివేదికను విడుదలచేసింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం.. మార్చి చివరినాటికి 118.35 కోట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయింది. డిసెంబర్‌ త్రైమాసికంతో పోల్చితే 1.20 శాతం, ఏడాది ప్రాతిపదికన 1.88 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్‌లో 91.45 వద్ద ఉన్న మొత్తం టెలీడెన్సిటీ గతేడాది డిసెంబర్‌ నాటికి 90.11 వద్దకు పడిపోయింది. ఒక్కో చందాదారు సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ).. వైర్‌లెస్‌ సేవల పరంగా మార్చి త్రైమాసికానికి 1.80 శాతం పెరిగి రూ.71.39 వద్దకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ.70.13 వద్ద ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top