సెన్సెక్స్‌ 690 క్రాష్‌..

IT shares are falling as the rupee is strengthening - Sakshi

అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన అమెరికా పాక్షిక షట్‌డౌన్‌ భయాలు 

పతన బాటలో ప్రపంచ మార్కెట్లు దీనికి మన దగ్గర తోడైన లాభాల స్వీకరణ 

పడిపోయిన రూపాయి భారీగా నష్టపోయిన స్టాక్‌ సూచీలు

 36,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ 690 పాయింట్లు పతనమై 35,742 వద్ద ముగింపు 

10,800 పాయింట్ల దిగువకు నిఫ్టీ 198 పాయింట్ల నష్టంతో 10,754 వద్ద ముగింపు  

అంతర్జాతీయ వృద్ధి ఆశించిన దానికన్నా తక్కువ స్థాయిలో ఉంటుందేమోనన్న భయాలతో ప్రపంచ మార్కెట్లన్నీ పతనం కాగా... దానికి మన మార్కెట్లూ తోడయ్యాయి. దీనికి తోడు కొన్ని రోజులుగా రివ్వున పెరుగుతూ వస్తున్న పలు ఇండెక్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ జరగటంతో మన మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల దిగువకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 దిగువకు క్షీణించాయి. మెక్సికో సరిహద్దుల్లో ట్రంప్‌ నిర్మిస్తానన్న గోడకు నిధులిచ్చే బిల్లును అమెరికా సెనేట్‌ తిరస్కరించవచ్చన్న అంచనాలుండటంతో అది అమెరికా ప్రభుత్వం పాక్షికంగా పనిచేయలేని స్థితికి (పాక్షిక షట్‌డౌన్‌) దారితీస్తుందనే భయాలు నెలకొన్నాయి. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశాలుండటం... ఇటీవల బలపడుతూ వచ్చిన రూపాయి పతనం కావడం... ఇవన్నీ కలిసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 690 పాయింట్లు నష్టపోయి 35,742 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 198 పాయింట్లు పతనమై 10,754 వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 1.89 శాతం, నిఫ్టీ 1.81 శాతం చొప్పున క్షీణించాయి. మొత్తం అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే ఈ వారంలో సెన్సెక్స్‌ 221 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.ఆసియా మార్కెట్ల బలహీనతతో శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్‌ నష్టాలు చవిచూసింది. రోజు గడుస్తున్న కొద్దీ ఈ నష్టాలు పెరిగాయే కానీ తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 737 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల వరకూ నష్టపోయాయి. చివరకు ముగింపులోనూ ఇండెక్స్‌లు దాదాపుగా అదే స్థాయిని చూశాయి. ఒకరకంగా కనిష్ఠ స్థాయిలోనే ముగియటం గమనార్హం. 

పతన బాటలో ఐటీ షేర్లు.... 
గత కొన్ని రోజులుగా రూపాయి బలపడుతుండటంతో ఐటీ షేర్లు డీలా పడుతున్నాయి. తాజాగా అమెరికాలో పాక్షిక షట్‌డౌన్‌ చోటు చేసుకోవచ్చన్న భయాలు ఐటీ షేర్లపై బాగా ప్రభావం చూపించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 2–3 శాతం రేంజ్‌లో పడిపోయాయి. టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టాటా ఎలెక్సి తదితర ఐటీ షేర్లు కూడా నష్టపోయాయి.  
 31 సెన్సెక్స్‌ షేర్లలో రెండు షేర్లు– ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా లాభపడ్డాయి. మిగిలిన 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీలో ఐదు షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, హిందాల్కో మాత్రమే పెరగ్గా, మిగిలిన 45 షేర్లు నష్టపోయాయి.  అంతర్జాతీయ కంటెంట్‌ ప్రొవైడర్‌ తబూల సంస్థతో ఐదేళ్ల పాటు అమల్లో ఉండే రూ.300 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో న్యూఢిల్లీ టెలివిజన్‌ షేర్‌ 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి,  రూ.39.25 వద్ద ముగిసింది. ఈ కౌంటర్లో కొనుగోలు దారులే తప్ప అమ్మకం దారులు కనిపించలేదు.

  దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా, బాటా ఇండియా షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, 1,135 ని తాకింది. చివరకు 1 శాతం లాభంతో రూ.1,116 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఈ షేర్‌ 52 శాతం ఎగసింది.   మార్కెట్‌ పతన బాటలో ఉన్నా అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ 15 శాతం ఎగసి రూ.292 వద్ద ముగిసింది. ఈ కంపెనీ స్నాక్స్‌ విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటుచేయనున్నదని, మరోవైపు ప్రధాన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి బడా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఒకటి ముందుకు వచ్చిందని వార్తలు వచ్చాయి.  విలీనానికి తుది ఆమోదం లభించడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లు 1–2 శాతం లాభపడ్డాయి.  వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. బీఎస్‌ఈ, థమ్‌పూర్‌ స్పెషాల్టీ షుగర్స్, గాయత్రి షుగర్స్, ఖదీమ్‌ ఇండియా, శిల్పి కేబుల్‌ టెక్నాలజీస్, రోల్టా ఇండియా, వెప్‌ సొల్యూషన్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, హిందుస్తాన్‌ కాంపొజిట్స్‌  ఈ పడిపోయిన జాబితాలో ఉన్నాయి. 

నష్టాలు ఎందుకంటే..

అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన 
అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) 3.9 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో జీడీపీ వృద్ధి మందగిస్తుందని ఓఈసీడీతో పాటు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) కూడా హెచ్చరించింది. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది.
 
అమెరికా పాక్షిక షట్‌డౌన్‌? 
మెక్సికో నుంచి అక్రమ వలసదారులు రాకుండా అడ్డంగా సరిహద్దుల్లో గోడ కడతామని ఎన్నికల సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ వాగ్దానం చేశారు. దానికి సంబంధించిన నిధుల విడుదల కోసం ట్రంప్‌ ప్రభుత్వం పెట్టిన బిల్లు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ సెనేట్‌లో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్లకు మెజారిటీ లేదు. 5 బిలియన్‌ డాలర్ల విడుదలకు సంబంధించిన ఈ బిల్లు శుక్రవారం సెనేట్‌ ముందుకు రానుంది. దీన్ని సెనేట్‌ ఖచ్చితంగా తిరస్కరిస్తుందనే అంచనాలున్నాయి. నిధుల బిల్లును గనక సెనేట్‌ తిరస్కరిస్తే అంతర్గత భద్రతతో సహా వివిధ విభాగాలకు రావాల్సిన నిధులు ఆగిపోతాయి. అందుకే ఈ బిల్లులో ఒక్క మెక్సికో గోడకు సంబంధించిన నిధుల్ని పక్కనబెట్టి మిగతా నిధుల్ని ఉంచాల్సిందిగా బుధవారం రిపబ్లికన్లు– డెమొక్రాట్ల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ గురువారం ట్రంప్‌ దీన్ని తోసిపుచ్చారు. మొత్తం బిల్లును సెనేట్‌కు పంపించాల్సిందేనని, ఒకవేళ అది తిరస్కరించి అమెరికాలో పనులు నిలిచిపోతే ఆ అపఖ్యాతి డెమొక్రాట్లకే వస్తుందని ఆయన చెప్పారు. ఇదే జరిగితే అమెరికాలో పలు విభాగాల సేవలు నిలిచిపోయి గందరగోళానికి తావు తీస్తుందన్న భయాలు మార్కెట్లను కూలదోశాయి.
 
ఫెడ్‌ రేట్ల పెంపు... 
వృద్ధి భయాలున్నప్పటికీ, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపునకు మొగ్గు చూపడం మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల విషయంలో దూకుడుగా కాకుండా ఉదారంగా ఉండగలదన్న అంచనాలు తప్పడం ప్రపంచ మార్కెట్లను పతన బాట పట్టించింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచితే అమెరికాలో రుణాలు ప్రియమవుతాయి. దీంతో అది కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపిస్తుంది. ఇక అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే వర్ధమాన మార్కెట్లలోని నిధులన్నీ తిరిగి అమెరికాకు వెళ్లిపోతాయన్న భయాలు... వర్ధమాన మార్కెట్లలోనూ షేర్ల అమ్మకాలకు దారితీస్తాయి.  ... పై మూడూ ప్రధాన కారణాలుగా గురువారం అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో శుక్రవారం ఆసియా, యూరప్‌ మార్కెట్లు కూడా తగ్గాయి. ఆసియా మార్కెట్లు 1–2 శాతం రేంజ్‌లో పడిపోయాయి. కొరియా కోస్పి 0.06%, హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.51%, జపాన్‌ నికాయ్‌ 1.1%, షాంగై సూచీ 0.7% చొప్పున పతనం కాగా, యూరప్‌ మార్కెట్లు 0.5 శాతం నుంచి 1% లోపు నష్టాలు చవిచూశాయి.
 
లాభాల స్వీకరణ 
గడిచిన ఏడు రోజుల్లో ఒకవంక అమెరికా మార్కెట్లు పడుతున్నా మన మార్కెట్లు మాత్రం పెరుగుతూనే వచ్చాయి. ఈ ఏడు సెషన్లలో ఏకంగా 1,500 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌ ఎగబాకటంతో బాగా పెరిగిన రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇండెక్స్‌ హెవీ వెయిట్స్‌– రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు 1–3% రేంజ్‌లో పడిపోయాయి. సెన్సెక్స్‌ పతనంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  వాటా 93 పాయింట్లు, ఇన్ఫోసిస్‌ 80 పాయింట్లు, టీసీఎస్‌ 63 పాయింట్లు చొప్పున ఉన్నాయి. పటిష్ట ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ సాధారణమేనని, ర్యాలీలో భాగమని నిపుణులు పేర్కొన్నారు.  

రూపాయి డీలా...
ముడిచమురు ధరలు పడిపోతుండటంతో గత 4 రోజులుగా రూపాయి బలపడుతూ వస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనతో ప్రపంచ మార్కెట్ల పతనం, నెలాఖరు కారణంగా దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో శుక్రవారం రూపాయి బలహీనపడింది. 48 పైసలు నష్టంతో 70.18 వద్ద ముగిసింది. 

రూ. 2.26 లక్షల కోట్ల  సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్లో భారీ నష్టాల కారణంగా శుక్రవారం ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.26 లక్షల కోట్లు తగ్గి
రూ.143 లక్షల కోట్లకు పడిపోయింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top