వేచి చూడటం తప్ప చేసేదేం లేదు..

Investor's comment on the collapse of shares - Sakshi

మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్ల పతనంపై ఇన్వెస్టరు పొరింజు వ్యాఖ్య  

న్యూఢిల్లీ: ఒడిదుడుకుల మార్కెట్లో ఒకవైపు సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్‌లు పెరిగినట్లు కనిపిస్తున్నా... పలు షేర్లు కనిష్ట స్థాయిలకు పడిపోతుండటం బడా ఇన్వెస్టర్లనూ కలవరపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో మార్కెట్లు మళ్లీ మెరుగుపడి, కోలుకునేదాకా వేచి చూడటం తప్ప ఇప్పట్లో చేయగలిగిందేమీ లేదని వారు చెబుతున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్‌గా పేరుండటంతో పాటు ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ద్వారా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు అందిస్తున్న పొరింజు వెలియాత్‌ సైతం ఇదే విషయం చెబుతూ తమ ఇన్వెస్టర్లకు లేఖ రాశారు. తగు సమయంలో పోర్ట్‌ఫోలియోను మారుస్తామని భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ‘మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అసాధారణ అమ్మకాలు జరుగుతున్నాయి.

దీంతో మన పోర్ట్‌ఫోలియోలోని పలు స్టాక్స్‌ ధరలు అసంబద్ధ స్థాయికి పడిపోయాయి. నిజం చెప్పాలంటే ఇంత స్వల్ప వ్యవధిలో పోర్ట్‌ఫోలియో విలువ ఇంత భారీగా పడిపోవడం నాకూ కొంత గందరగోళంగానే ఉంది. అయితే, ధరలపరంగా కన్నా విలువపరంగా మన స్టాక్స్‌ మెరుగైనవి. మార్కెట్‌ చక్కబడ్డాక, తగు సమయంలో పోర్ట్‌ఫోలియోనూ రీస్ట్రక్చర్‌ చేస్తాం. మనదగ్గరున్న స్టాక్స్‌ మళ్లీ గణనీయంగా పెరుగుతాయనేది నా అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి చేయగలిగిందేమీ లేదు. ఓపిగ్గా వేచిచూడటం తప్ప‘ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇన్వెస్ట్‌ చేసిన పలు స్టాక్స్‌ ధరలు 24–44% పడిపోవటంతో పొరింజు లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా నిఫ్టీ, సెన్సెక్స్‌ 3–5 శాతం పెరగ్గా, మిడ్‌క్యాప్‌ సూచీలు 8–10% క్షీణించాయి. గతేడాది సెన్సెక్స్, నిఫ్టీలు 29% పెరిగితే.. మిడ్‌క్యాప్‌ సూచీలు ఏకంగా 51 శాతం ఎగిశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top