యాపిల్‌ సీఈవోకు భారతీయ విద్యార్థి కొంటె ప్రశ్న

Indian Student Asks Apple CEO How Are You Tim Apple - Sakshi

వాషింగ్టన్‌ : జీవితంలో మనం కలవాలనుకున్న ముఖ్యమైన వ్యక్తిని నిజంగా కలిసినప్పుడు ఆనందంతో మాటలు రావు. ఒక వేళ మాట్లాడిన ఆ ఉద్వేగంలో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. ఇదే పరిస్థితి ఢిల్లీకి చెందిన పలాశ్‌ తనేజా అనే కుర్రాడికి ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ఏం చేశాడో ఆ వివరాలు.. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ను కలవాలనేది పలాశ్‌ చిరకాల కోరిక. కొన్ని రోజుల క్రితం ఆ కల నిజమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఓ 13 మంది విద్యార్థులను టిమ్‌ కుక్‌ ఆహ్వానించారు. వీరిలో పలాశ్‌ కూడా ఉన్నాడు. ఈ విద్యార్థులతో పాటు యాపిల్‌ సిబ్బంది కుక్‌ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కుక్‌ రానే వచ్చారు. అప్పుడు పలాశ్‌ యాపిల్‌ సీఈవోను ఉద్దేశిస్తూ.. ‘టిమ్‌ యాపిల్‌.. ఎలా ఉన్నారు’ అని ప్రశ్నించాడు. పలాశ్‌ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కంటే ముందు టిమ్‌ కుక్‌తో సహా అక్కడున్న సభ్యులంతా ఒక్క సారిగా నవ్వారు.

ఆ తర్వాత కుక్‌ ‘నేను బాగున్నాను. నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నేను అర్థం చేసుకోగలను’ అంటూ చిరునవ్వుతో ముందుకు సాగారు. ఇంతకు ఇక్కడ విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఏడాది మార్చిలో టిమ్‌ కుక్‌తో సమావేశమయ్యారు. ట్రంప్‌ది అసలే హాఫ్‌ మైండ్‌ కదా. దాంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ను కాస్తా టిమ్‌ యాపిల్‌గా సంభోందించారు. టిమ్‌ ఇంటి పేరును.. కంపెనీ లోగోను కలిపి ఇలా పిల్చారన్నమాట. ఈ ప్రయోగం ఏదో బాగుందని భావించిన కుక్‌ ఆ రోజు నుంచి తన ట్విటర్‌ పేరును కాస్తా టిమ్‌ యాపిల్‌గా మార్చుకున్నారు. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పలాశ్‌ టిమ్‌ కుక్‌ను.. టిమ్‌ యాపిల్‌గా సంభోదించడం.. దానికి కుక్‌ నవ్వడం జరిగాయి.

ఇక పలాశ్‌ విషయానికోస్తే.. ఎనిమిదో తరగతి నుంచే అతను కోడింగ్‌ మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ ఆసక్తే అతనికి టిమ్‌తో సమావేశమయ్యే అవకాశం కల్పించింది. భారత్‌ను నుంచి కేవలం పలాశ్‌కు మాత్రమే ఈ  అవకాశం దక్కింది. ఈ సమావేశంలో అతను అతడు కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్ ఆధారిత ప్రాజెక్టులను తయారు చేసి టిమ్‌కు చూపించారు.  ప్రస్తుతం పాఠశాల విద్య పూర్తి చేసిన పలాశ్(18) యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో చేరనున్నాడు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top