సాహసోపేత నిర్ణయాల సత్తా ఉంది

India Has Capacity To Implement Bold Decisions - Sakshi

అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలం

అమెరికా ఇన్వెస్టర్లతో ఆర్థికమంత్రి జైట్లీ

వాషింగ్టన్‌: సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని సమర్థంగా అమలు చేసే సత్తా కూడా భారత్‌కుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. తద్వారా వర్ధమాన దేశాల్లోనే అత్యంత స్వచ్ఛమైన, అతి భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్ధ్యం భారత్‌కి ఉందని అమెరికన్‌ ఇన్వెస్టర్లకు తెలిపారు. అమెరికా–భారత్‌ బిజినెస్‌ కౌన్సిల్, భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం మొదలైన కీలక సంస్కరణల అమలు తర్వాత అమెరికన్‌ ఇన్వెస్టర్లతో జైట్లీ సమావేశమవడం ఇదే తొలిసారి. ‘అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు నుంచి ప్రత్యక్ష పన్నులపరమైన ప్రోత్సాహకాలు మొదలైన చర్యలు అనేకం తీసుకున్నాం. అసంఘటిత ఎకానమీని సంఘటిత ఆర్థిక వ్యవస్థలోకి చేర్చే క్రమంలో ఒక్కో ఇటుక పేర్చి కట్టినట్లుగా.. లక్ష్యాల సాధనకు ఇవన్నీ కూడా తోడ్పడేవే’ అని జైట్లీ పేర్కొన్నారు.

మిగతా దేశాలన్నీ రక్షణాత్మక ధోరణులకు మళ్లుతుండగా.. భారత్‌ అత్యంత స్వేచ్ఛా విపణుల్లో ఒకటిగా, ప్రపంచదేశాలకు అనుసంధానమైన ఆర్థిక వ్యవస్థగా మారిందని జైట్లీ చెప్పారు. రక్షణాత్మక ధోరణులపై చర్చ జరగని దేశమంటూ ఏదైనా ఉంటే అది భారత్‌ మాత్రమేనని ఆయన తెలిపారు.

ప్రతిపక్షాలు అడ్డుకున్నా సాఫీగా జీఎస్టీ
భారతదేశంలో జీఎస్టీ అమలును అడ్డుకునేకుందుకు ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా ఆ ప్రక్రియ సాఫీగా సాగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పన్ను ఎగవేతదారుల్ని పన్ను వ్యవస్థలోకి తెచ్చేందుకు జీఎస్టీలో పలు ఆకర్షణీయ పథకాల్ని ప్రవేశపెట్టామని చెప్పారు.

‘భారతీయ మార్కెట్‌ సంస్కరణల్లో ముందడుగు’ అనే అంశంపై సీఐఐ, అమెరికన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌లు న్యూయార్క్‌లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సులో మంగళవారం ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల కోసం జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top