ఇక్కడ మాత్రమే 7 శాతం వృద్ధి

India is the fastest growing big economy - Sakshi

ఇన్వెస్టర్లకు భారత్‌ అవకాశాల కేంద్రం

త్వరలోనే జీడీపీ 5 లక్షల కోట్ల డాలర్లకు

ప్రపంచబ్యాంకు సూచీలో 77వ స్థానంలోకి

వచ్చే ఏడాది టాప్‌–50లోకి వస్తామనే ధీమా ఉంది

సియోల్‌ సదస్సులో ప్రధాని మోదీ స్పష్టీకరణ 

సియోల్‌: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, జీడీపీ త్వరలోనే రెట్టింపై 5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.360 లక్షల కోట్లకు) చేరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇన్వెస్టర్లకిది అవకాశాల క్షేత్రంగా మారుతోందని దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన భారత్‌– ఆర్‌వోకే వ్యాపార సదస్సులో ఆయన ప్రకటించారు. ‘‘ప్రపంచంలో మరే ఇతర ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధిని సాధించడం లేదనేది వాస్తవం. హ్యుందాయ్, శామ్‌సంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ వంటి 600కు పైగా కంపెనీలు భారత్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేశాయి.

మరిన్ని కంపెనీలు రావాలని కోరుకుంటున్నాం. వ్యాపార పర్యటనలను సులభం చేసేందుకు గతేడాది అక్టోబర్‌ నుంచి కొరియా జాతీయులకు వీసా ఆన్‌ అరైవల్‌ ఇస్తున్నాం. జీఎస్టీ అమలు వంటి కఠిన విధాన పరమైన నిర్ణయాలకు తోడు మరిన్ని రంగాల్లోకి పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల ప్రపంచ బ్యాంకు వ్యాపార సులభతర సూచీలో భారత్‌ 65 స్థానాలు మెరుగుపరుచుకుని 77వ స్థానానికి చేరుకుంది. వచ్చే ఏడాది టాప్‌ 50లోకి చేరుకుంటామనే నమ్మకం నాకుంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. 

విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచాం 
‘‘విదేశీ పెట్టుబడులకు తలుపులు పూర్తిగా తెరిచిన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. 90 శాతానికి పైగా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ఆటోమేటిక్‌ విధానంలో అనుమతులిస్తున్నాం. అందుకే భారత్‌ మార్కెట్‌ పట్ల విశ్వాసంతో గత నాలుగేళ్లలో 250 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. భారత్‌ 2.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక, సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతోంది’’ అని ప్రధాని వివరించారు. దక్షిణ కొరియా ఉత్పత్తులకు భారత్‌ ఆరో అతిపెద్ద వినియోగ దేశంగా ఉండగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2018లో 21.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2030కి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లేందుకు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని బలోపేతం చేస్తామని, దీనిపై చర్చలు వేగవంతం అయ్యాయని ప్రధాని తెలిపారు. భారత్‌లో దక్షిణ కొరియా పెట్టుబడులు 6 బిలియన్‌ డాలర్లకు చేరాయన్నారు. 

700 బిలియన్‌ డాలర్ల అవకాశాలు  
‘‘ఆర్థిక ప్రగతి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ముడిపడి ఉంటుంది. రవాణా, విద్యుత్, పోర్టులు, షిప్‌ నిర్మాణం, ఇళ్లు, పట్టణ మౌలిక సదుపాయాలకు భారత్‌లో భారీ డిమాండ్‌ ఉంది. కొరియాలో బలమైన టెక్నాలజీ శక్తి, సామర్థ్యాలున్నాయి. మౌలిక రంగంలో 2022 నాటికి 700 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమని మా అంచనా’’ అని మోదీ పేర్కొన్నారు. సాగరమాల ప్రాజెక్టు కోసమే ఐదేళ్లలో 10 బిలియన్‌ డాలర్ల అవసరం ఉందన్నారు. కొరియా ఆర్థికాభివృద్ధి సహకార నిధి కింద ఎగుమతులకు 10 బిలియన్‌ డాలర్ల నిధుల సాయం అవసరం ఉంటుందని భారత్, దక్షిణ కొరియా గుర్తించినట్టు చెప్పారు. మద్దతునిచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ప్రభుత్వ పాత్రగా పేర్కొంటూ, స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆరంభించి నాలుగేళ్లలో 1.4 బిలియన్‌ డాలర్ల నిధులు ఇచ్చినట్టు తెలిపారు.

ప్రభుత్వ సంస్కరణల వల్లే వేగవంతమైన వృద్ధినీతి ఆయోగ్‌ నివేదిక  
ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అలాగే స్థూల ఆర్థిక స్థిరత్వం కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఉందని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. గడిచిన ఐదేళ్ల కాలంలో దేశ వృద్ధి రేటు కచ్చితంగా పెరిగిందని, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల సగటు వృద్ధితో పోలిస్తే ఎక్కువగా ఉందని తెలిపింది. ‘‘భారత ఆర్థిక పనితీరు 2010–13 మధ్య చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గింది.

గత ఐదు సంవత్సరాల్లో (2014–18) ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే కాకుండా ఇప్పటి వరకూ లేని విధంగా మెరుగైన వృద్ధి రేటుతోపాటు ఆర్థిక స్థిరత్వంతో ముందుకు వెళుతోంది’’ అని నీతిఆయోగ్‌ నివేదిక పేర్కొంది. 2018–19లో దేశ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగాను, ప్రపంచ జీడీపీ వృద్ధి 3.7 శాతంగాను ఉంటుందని అంచనా వేసింది. ఏడు వర్ధమాన దేశాల (బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ) సగటు వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. చైనా వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top