భారత్, అమెరికా వాణిజ్య లక్ష్యం 500 బిలియన్‌ డాలర్లు

India and US trade target of $ 500 billion - Sakshi

ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022 నాటికి 500 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోగలదని ఇండో అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐఏసీసీ) పేర్కొంది. ప్రస్తుతమిది 115 బిలియన్‌ డాలర్లుగా ఉందని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ డిప్యూటీ కౌన్సిల్‌ జనరల్‌ డొనాల్డ్‌ ఎఫ్‌ ముల్లింగన్‌ తెలిపారు. మంగళవారమిక్కడ ఐఏసీసీ 50వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా దేశాల మధ్య సహకారం కేవలం వ్యాపారానికి పరిమితం కాలేదని, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్య, వైద్యం వంటి అన్ని రంగాల్లోనూ ఉందన్నారు.  అనంతరం రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ.. గత పదిహేనేళ్లుగా భారత్, అమెరికాల మధ్య వ్యాపార అవకాశాలు బలపడుతున్నాయని, అన్ని రంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతివ్వటంతో రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే వీలు కలిగిందని అన్నారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) ఒలింపిక్స్‌ లాంటివని సంబోధించారు. అమెరికాతో తెలంగాణ సంబంధాలను మరింత పటిష్టపరచడం, స్థానిక వ్యాపార, పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవటం కోసం నెలకొకసారి ఐఏసీసీతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. అనంతరం ఐఏసీసీ మాజీ చైర్మన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఏసీసీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాప్టర్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ బడిగ, తదితరులు పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top