హెచ్‌డీఎఫ్‌సీ లాభం 17శాతం వృద్ధి

HDFC profit up 17 per cent

క్యూ2లో రూ.2,869 కోట్లు...

మెరుగుపడిన మార్జిన్‌లు; రుణ వృద్ధి

ముంబై: దిగ్గజ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ క్వార్టర్‌లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.2,869 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత క్యూ2లో సాధించిన నికర లాభంతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

మార్జిన్‌లు మెరుగుపడటం, రుణ వృద్ధి అధికంగా ఉండడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ  వైస్‌ చైర్మన్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కేకి మిస్త్రీ చెప్పారు. స్టాండెలోన్‌ ప్రాతిపదికన గత క్యూ2లో రూ. 1,827 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ2లో 15% వృద్ధితో రూ.2,101 కోట్లకు పెరిగిందన్నారు.

నికర వడ్డీ ఆదాయం 14 శాతం అప్‌..
నికర వడ్డీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.2,612 కోట్లకు పెరిగిందని, నికర వడ్డీ మార్జిన్‌ 3.85 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగిందని మిస్త్రీ వివరించారు. మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపారు. మార్జిన్‌లు వ్యక్తిగత రుణాలపై 1.9 శాతంగా, ఇతర రుణాలపై 3.1 శాతంగా ఉన్నాయని తెలిపారు.

మొత్తం మీద ఈ ఏడాది మార్జిన్‌లు 2.2 శాతం నుంచి 2.35 శాతం రేంజ్‌లో ఉండొచ్చని, దీంతో నికర వడ్డీ మార్జిన్‌ 3.9 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, కేటాయింపులు రూ.2,500 కోట్లుగా ఉండాలని, కానీ తాము రూ.3,235 కోట్ల కేటాయింపులు జరిపామని తెలియజేశారు.

18 శాతం రుణ వృద్ధి...
వ్యక్తిగత రుణాలు 16 శాతం, ఇతర రుణాలు 24 శాతం చొప్పున వృద్ధి చెందాయని, మొత్తం మీద రుణాలు 18 శాతం చొప్పున వృద్ధి చెందాయని మిస్త్రీ వివరించారు. ఈ క్యూ2లో మొండి బకాయిలు రూ.3,701 కోట్లు(1.14 శాతం)గా ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ 0.4శాతం లాభంతో రూ.1,705 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top