హెచ్‌డీఎఫ్‌సీ లాభం 3,961 కోట్లు

HDFC Bank has a net profit of Rs 3,961 crore - Sakshi

అంచనాలను మించిన నికర లాభం  

ఒక్కో షేర్‌కు రూ.16.50 తుది డివిడెండ్‌  

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,961 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.3,079 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. నికర లాభంలో విశ్లేషకుల అంచనాలను హెచ్‌డీఎఫ్‌సీ అధిగమించింది. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.2,464 కోట్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.

పన్ను వ్యయాలు తక్కువగా ఉండడం, రెండు అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ ఈ స్థాయి నికర లాభం సాధించింది. పన్ను వ్యయాలు 25 శాతం తగ్గి రూ.671 కోట్లకు చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ రియల్టీ, హెచ్‌డీఎఫ్‌సీ డెవలపర్స్‌ల్లో పూర్తి వాటాను క్వికర్‌ ఇండియాకు విక్రయించడంతో నికర లాభం పెరిగింది. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.16.50 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని హెచ్‌డీఎఫ్‌సీ  పేర్కొంది.  

మొత్తం ఆదాయం 18 శాతం అప్‌..
మొత్తం ఆదాయం రూ.18,041 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.21,249 కోట్లకు పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ  పేర్కొంది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.2,044 కోట్ల నుంచి 39% వృద్ధితో రూ.2,846 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.8,516 కోట్ల నుంచి 13% వృద్ధితో రూ.9,634 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.2,852 కోట్ల నుంచి రూ.3,211 కోట్లకు ఎగసిందని వివరించింది.  

నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతం...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.11,051 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో  47 శాతం వృద్ధితో రూ.16,255 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.61,088 కోట్ల నుంచి రూ.69,142 కోట్లకు పెరిగిందని తెలిపింది. మార్చి 31, 2018తో ముగిసిన ఏడాదికి నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతంగా ఉందని పేర్కొంది.

2018, మార్చితో ముగిసిన ఏడాదికి వ్యక్తిగత రుణ మంజూరీ 29 శాతం వృద్ధి చెందిందని, సగటు వ్యక్తిగత రుణం విలువ రూ.26.4 లక్షలుగా ఉందని వివరించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి స్థూల మొండి బకాయిలు రూ.4,019 కోట్లుగా ఉన్నాయని, ఇది మొత్తం రుణాల్లో 1.1 శాతానికి సమానమని పేర్కొంది.  మొత్తం మీద రుణ వృద్ధి 18 శాతంగా ఉందని వివరించింది.  మొత్తం రుణాలు ఈ ఏడాది మార్చినాటికి రూ.3,59,442 కోట్లకు పెరిగాయని పేర్కొంది.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ 1.4 శాతం లాభంతో రూ.1,885 వద్ద ముగిసింది.

ఎండీగా మళ్లీ కేకి మిస్త్రీ
రిడీమబుల్‌ ఎన్‌సీడీ (నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు)లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.85,000 కోట్ల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. కేకి మిస్త్రీని మళ్లీ ఎండీగా నియమించడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని వెల్లడించింది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, వైస్‌ చైర్మన్‌గా ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top