ఎస్సార్‌ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ

ఎస్సార్‌ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ

మొండిబకాయిల విషయంలో ఎస్సార్‌ గ్రూపుకు చెందిన ఎస్సార్‌ స్టీల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వు బ్యాంకుకు వ్యతిరేకంగా ఎస్సార్‌ స్టీల్‌ నమోదుచేసిన ఫిర్యాదును గుజరాత్‌ హైకోర్టు తోసిపుచ్చింది. జూలై 14న తన ఆదేశాలను రిజర్వులో పెట్టిన కోర్టు, సోమవారం రోజు ఫిర్యాదును తోసిపుచ్చుతున్నట్టు పేర్కొని, బ్యాంకులకు ఊరటనిచ్చింది. దివాలా చట్టం కింద ఈ స్టీల్ దిగ్గజంతో పాటు మరో 11 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై బ్యాంకులు సైతం చర్యలకు దిగాయి. దీంతో ఆర్‌బీఐ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎస్సార్‌ స్టీల్‌ జూలై 4న కోర్టుకు ఎక్కింది. అయితే హైకోర్టులో ఈ కంపెనీకి ఎలాంటి ఊరట లభించలేదు. 

 

రూ.5 వేల కోట్ల కంటే అధికంగా రుణాన్ని తీసుకొని చెల్లించకుండా నాన్చుతున్న మాల్యా కంటే ఘనులు 12 మంది ఉన్నట్టు ఆర్బీఐ గుర్తించింది. వీరిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మొండి బకాయిల్లో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్బీఐ సర్క్యూలర్‌కు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కిన ఎస్సార్‌ స్టీల్‌, తమ రుణాల పునరుద్ధరణ అడ్వాన్స్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ చర్యలు చేపట్టడం సమ్మతం కాదని తెలిపింది. తమతో పాటు రుణాలు చెల్లించకుండా ఉన్న మరో 11 సంస్థలతో సమానంగా తమల్ని చూడటం లేదని ఎస్సార్‌ స్టీల్‌ కోర్టులో పేర్కొంది. అంతేకాక తమ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తుందని, వార్షిక టర్నోవర్‌ కూడా రూ.20వేల కోట్లగా ఉందని పేర్కొంది.

 

అయితే ఈ వాదలనకు సమ్మతించని కోర్టు, ఎస్సార్‌ స్టీల్‌ ఫిర్యాదును కొట్టిపారేసింది. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ రుణం సుమారు రూ.42వేల కోట్ల మేర ఉన్నాయి. ఆర్బీఐ తరుఫున వాదనలు వినిపించిన సెంట్రల్‌ బ్యాంకు కౌన్సిల్‌ డారియస్‌ కంబత్‌, 2016 మార్చి 31న రూ.31,671 కోట్లగా ఉన్న ఎస్సార్‌ స్టీల్‌ నిరర్థక ఆస్తులు, ఈ ఏడాది మార్చి వరకు రూ.32,864 కోట్లకు పెరిగినట్టు కోర్టులో తెలిపారు. 2016 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణాలు లక్ష కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రైవేట్‌ బ్యాంకులు, ఇతర లెండర్లను తీసుకుంటే, ఇవి 10 లక్షల కోట్ల వరకు ఉంటాయి. ఈ మొండిబకాయిలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో బ్యాంకులు త్వరగా మేలుకుని, దివాలా చట్టం కింద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. 

 
Back to Top