లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

GST collections cross Rs 1 lakh crore milestone in April - Sakshi

ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఆదాయం

మార్చిలో జీఎస్టీ వసూళ్లు (రూ. కోట్లలో) - 89,264

ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు (రూ. కోట్లలో) - 1,03,458

గత ఆర్థిక సంవత్సరం మొత్తం వసూళ్లు (జూలై–మార్చి) - 7.41 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) వసూళ్లు ఏప్రిల్‌లో రూ.లక్ష కోట్ల స్థాయిని దాటాయి. గతేడాది జులైలో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఈ స్థాయి దాటడం ఇదే ప్రథమం. జీఎస్‌టీ వసూళ్లలో ఇదే సానుకూల ధోరణి ఇకపైనా కొనసాగగలదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.89,264 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.7.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

‘ఈ ఏడాది ఏప్రిల్‌లో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.1,03,458 కోట్లుగా ఉన్నాయి. ఇందులో సెంట్రల్‌ జీఎస్‌టీ భాగం రూ. 18,652 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్‌టీ రూ.25,704 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.50,548 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ. 21,246 కోట్లు సహా), సెస్సు రూ. 8,554 కోట్లు‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, ఈ–వే బిల్లు ప్రవేశపెట్టడం, జీఎస్‌టీ నిబంధనలు పాటించడం పెరగడంతో జీఎస్‌టీ వసూళ్లు సానుకూల ధోరణిలోనే ఉండగలవని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్వీటర్‌లో జైట్లీ ట్వీట్‌ చేశారు. అయితే, సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నెలలో అంతక్రితం మిగిలిన బకాయిలేమైనా ఉంటే కట్టేయడం జరుగుతుంటుంది కాబట్టి ఏప్రిల్‌ ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదని, ఇదే ధోరణి ఇకపైనా కొనసాగుతుందని భావించడానికీ లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top