‘అప్పు’డే అప్రమత్తం

Grant a loan within minutes - Sakshi

ఓకే అంటే నిమిషాల్లోనే రుణం మంజూరు

సామర్థ్యాన్ని బట్టే రుణం, కాల వ్యవధి, ఈఎంఐ

ఆపదలో ఆదుకోవటానికి రుణానికి బీమా

వడ్డీ ఎక్కువైతే బదలాయింపులపై దృష్టి

గతంలో పోలిస్తే ఇప్పుడు రుణం కొంత ఈజీగానే లభిస్తోంది. కావాలనుకున్న వెంటనే లభించే పరిస్థితులు కూడా వచ్చేశాయి. రుణానికి దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు వేగంగా ప్రాసెస్‌ చేసేస్తున్నాయి. రుణం తీసుకోవాలంటూ వెంటపడే బ్యాంకులూ ఉన్నాయి. ఉచిత క్రెడిట్‌ రిపోర్టులు, తక్కువ టీజర్‌ రేట్లు, దరఖాస్తు రుసుములు లేకపోవడం, వేగంగా ఆమోదించడం ఇవన్నీ రుణదాతలు రుణంతోపాటు ఆఫర్‌ చేస్తున్న సేవలు.

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ తరహా తాయిలాలెన్నో అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకోవడం ఆలస్యం... నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ అయిపోయేలా రుణ ప్రక్రియ మారిపోయింది. అయితే, రుణం తీసుకునే ముందు దాన్ని తగిన కారణంతోనే తీసుకుంటున్నామా? అన్నది ఓ సారి పరిశీలించుకోవాలి. వడ్డీ రేటు ఆకర్షణీయంగా ఉందనో, పన్ను ప్రయోజనాల కోసమో అయితే రుణం తీసుకోవటం సరికాదు. రుణం తీసుకునే ముందు పాటించాల్సిన వ్యక్తిగత నిబంధనలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం...

ఈఎంఐ గీత దాటకూడదు...
అవసరానికంటే ఎక్కువ రుణాన్ని తీసుకుంటే ఆ తర్వాత సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణ ఈఎంఐ మీ బడ్జెట్‌ను తలకిందులు చేసేలా ఉండకూడదు. కారు కోసం రుణం తీసుకున్నారనుకోండి. దాని ఈఎంఐ మీ నెలవారీ నికర వేతనంలో 15 శాతాన్ని మించకూడదు. వ్యక్తిగత రుణ ఈఎంఐ అయితే నికర వేతనంలో 10 శాతానికే పరిమితం కావాలి. నెల వేతనంలో అన్ని రుణాల ఈఎంఐలు కలిసి 50 శాతం మించకుండా చూసుకోవాలి.

రుణ–ఆదాయ నిష్పత్తి అన్నది ఆమోదించతగ్గ పరిమితుల్లోనే ఉండాలి. లేదంటే ఇతర కీలక ఆర్థిక లక్ష్యాలైన రిటైర్మెంట్‌ ఫండ్, పిల్లల విద్య వంటివి త్యాగం చేయాల్సి రావచ్చు. పైగా ఈఎంఐ నిర్ణయించేటప్పుడు మీ చెల్లించే సామర్థ్యంలో కచ్చితత్వం చాలా అవసరం. భవిష్యత్తు ఆదాయాన్ని ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవద్దు. ప్రస్తుతం మీ ఆర్జనపైనే లెక్కలన్నీ ఆధారపడి ఉండాలి. వచ్చే ఏడాది 10 శాతం ఇంక్రిమెంట్‌ అంచనా వేసుకుని ఆ ప్రకారం ఈఎంఐ నిర్ణయించుకోకూడదు. ఎందుకంటే పరిస్థితులు ఆశాజనకంగా లేకపోతే ఈ 10 శాతం 6 శాతమే కావచ్చు. లేదా అసలు పెంపు సున్నాగానే ఉండిపోవచ్చు. పైగా ఈఎంఐ భారంగా మారి దాన్ని సకాలంలో చెల్లించలేకపోతే అది మీ క్రెడిట్‌ స్కోరును దెబ్బతీస్తుంది. అందుకనే భరించగలిగే స్థాయిలోనే ఈఎంఐ ఉండాలి.

స్వల్ప కాల వ్యవధి మంచిది...
పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలం పాటు కొనసాగించడం వల్ల కాంపౌండింగ్‌ ప్రయోజనంతో అధిక రాబడులు పొందొచ్చని వినే ఉంటారు. అయితే, రుణాల విషయంలో దీన్ని వ్యతిరేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రుణ కాల వ్యవధి దీర్ఘకాలం పాటు ఉంటే వడ్డీ రూపేణా అధికంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు 9.75 శాతం వడ్డీ రేటుతో 10 ఏళ్ల కాల వ్యవధి కోసం రుణం తీసుకుంటే అసలు మొత్తంలో చెల్లించే వడ్డీ 57 శాతమే అవుతుంది. ఇదే కాల వ్యవధి 15 ఏళ్లుగా ఉంటే అసలులో చెల్లించే వడ్డీ శాతం ఏకంగా 91 శాతానికి పెరిగిపోతుంది. 20 ఏళ్లకు రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ శాతం 128 గాను, 25 ఏళ్లకు అయితే 167 శాతం మేర అసలు కంటే వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది. రుణగ్రహీతలు దీర్ఘకాల వ్యవధిపై రుణాలు తీసుకునేందుకే మొగ్గు చూపుతుంటారు. ఈఎంఐ తక్కువగా ఉండటంతోపాటు పన్ను ప్రయోజనాల కోణంలో వారు ఈ పనిచేస్తుంటారు.

కానీ, ఇది తప్పుడు విధానమే అవుతుంది. ఎందుకంటే రుణంపై చెల్లించాల్సిన వడ్డీ భారం పెరిగిపోతుంది. కొన్ని కేసుల్లో దీర్ఘకాలానికి రుణం తీసుకోవడం తప్పనిసరి కావచ్చు. యువతీ, యువకులై తక్కువ ఆదాయం కలిగిన వారు స్వల్ప కాలానికి రుణం తీసుకుని అధిక ఈఎంఐ చెల్లించలేరు. కనుక వీరు దీర్ఘకాలానికి రుణం తీసుకుని వీలైనంత ముందుగా దాన్ని ముగించేయడం మంచిది. ఏటేటా ఎంతోకొంత ఆదాయం పెరుగుతూ వెళుతుంది. కనుక ఈఎంఐ కూడా ఏటేటా పెంచుకుంటూ వెళ్లాలి. దాంతో కాల వ్యవధికంటే ముందే రుణం తీరిపోతుంది. 25 ఏళ్ల కాలానికి ఉద్దేశించిన రుణాన్ని ఏటేటా 10 శాతం పెంచుకుంటూ వెళితే పదేళ్లలోనే దాన్ని తీర్చివేయవచ్చు. లేదంటే ఏటా ఒక్క ఈఎంఐ అదనంగా చెల్లిస్తూ వెళ్లినా గానీ కాల వ్యవధికంటే ఆరేళ్లు ముందుగానే అది తీరిపోతుంది. వార్షికంగా వచ్చే బోనస్‌ను ఇందుకు వినియోగించుకోవచ్చు.

ఇతర లక్ష్యాలూ ముఖ్యమే...
చాలా మందికి వారి పిల్లల విద్య, వివాహాలు చాలా ముఖ్యమైన లక్ష్యాలు. మరీ ముఖ్యంగా పిల్లల విద్య అనేది అత్యంత ముఖ్యమైన బాధ్యత. అంతేకానీ, పిల్లల విద్య కోసం రిటైర్మెంట్‌ ఫండ్‌ను త్యాగం చేస్తే... రేపు విశ్రాంత జీవనం కోసం రుణమిచ్చేవారూ ఎవరూ ఉండరన్న విషయాన్ని గ్రహించాలి. విద్యా రుణాల వల్ల పిల్లలకూ బాధ్యత తెలిసివస్తుంది. పన్ను ప్రయోజనాలూ ఉన్నాయి.

భారీ రుణాలకు బీమా తప్పనిసరి
రుణం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే అప్పటికి రుణం ఇంకా చెల్లించాల్సి ఉంటే, సంబంధిత వ్యక్తి ఆస్తులను రుణదాత స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అందుకే భారీ రుణాలు తీసుకునేవారు అంతే మొత్తానికి బీమాను కూడా తీసుకోవాలని నిపుణుల సూచన. బ్యాంకులు అయితే రెడ్యూసింగ్‌ టర్మ్‌ ప్లాన్లను ఆఫర్‌ చేస్తుంటాయి.

ఏటేటా చెల్లించగా మిగిలిన రుణ బకాయి మొత్తానికే బీమా కవరేజీ అమలవుతుంది. దీనివల్ల ప్రీమియం తగ్గుతుంది. అయినప్పటికీ పూర్తి స్థాయి టర్మ్‌ప్లాన్‌ను తీసుకోవడమే మంచిదన్నది నిపుణుల అభిప్రాయం. రుణం తీర్చివేసిన తర్వాత కూడా కవరేజీ అమలవడం, రుణాన్ని వేరే సంస్థకు మార్చుకున్నా కవరేజీ కొనసాగడం ఇందులోని ప్రయోజనాలు. సింగిల్‌ ప్రీమియం కంటే రెగ్యులర్‌గా చెల్లించే పాలసీలే ప్రయోజనం. వీటిలో ఏదన్నది కస్టమర్‌ ఇష్టమే. బ్యాంకులు ఒత్తిడి చేస్తే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే హక్కు ఉంది.

అవసరమైతే రుణదాతను మార్చేయడమే...
బ్యాంకులు సాధారణంగా కొత్త కస్టమర్లకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్‌ చేస్తుంటాయి. అదే సమయంలో ప్రస్తుత కస్టమర్లకు అధిక రేట్లు అమలు చేస్తుంటాయి. అందుకే తరచుగా వడ్డీ రేట్లను పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ మీరు తీసుకున్న రుణంపై వడ్డీ రేటు కంటే మరో బ్యాంకు తక్కువకే రుణాన్ని ఆఫర్‌ చేస్తుంటే అప్పుడు రుణాన్ని బదలాయించుకోవడమే ఉత్తమ ఆప్షన్‌. కాకపోతే ఇలా మార్చుకునే ముందు కొత్తగా రుణాన్ని ఆఫర్‌ చేస్తున్న రుణంపై 2 శాతం తక్కువ వడ్డీ రేటు ఉండేలా చూసుకోవాలి.

అప్పుడే బదలాయింపు లాభదాయకం అవుతుంది. 2 శాతం కంటే తక్కువ తేడా ఉంటే ఆ కొద్ది ప్రయోజనం ఖర్చుల రూపంలో కరిగిపోవడం ఖాయం. అలాగే, రుణం తీసుకున్న మొదట్లోనే బదలాయించుకోవడం ప్రయోజనం. అప్పటికే సగానికిపైగా కాల వ్యవధి ముగిసి ఉంటే మార్చుకోవడం వల్ల దక్కే ప్రయోజనం పెద్దగా ఉండదు. ఇలా మార్చుకునే ముందు నియమ, నిబంధనలు పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. కానీ, దీనికోసం మీ విశ్రాంత జీవన అవసరాలను త్యాగం చేయడం సరికాదు. కావాలంటే విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌ రూపంలో వెసులుబాట్లు సైతం ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top