ఐసీఐసీఐ బ్యాంక్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారు

Government explanation on transfer of IAS officer - Sakshi

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బదిలీపై ప్రభుత్వం వివరణ

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి లోక్‌రంజన్‌కు శాఖ వారీగా స్థానచలనం కలిగింది. ఆయన ఇప్పటి వరకు ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్‌ సెక్రటరీగా ఉన్నారు. తాజాగా ఆయన్ను సిబ్బంది, శిక్షణ శాఖలో జాయింట్‌ సెక్రటరీగా కేంద్రం నియమించింది.

ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్‌ గ్రూపునకు పెద్ద మొత్తంలో రుణం జారీ చేయడం వెనుక బ్యాంకు సీఈవో, ఎండీ చందాకొచర్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అనంతరం ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంకులో నామినీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలతో లోక్‌రంజన్‌ను ఏప్రిల్‌ 5న నియమించింది.

గత సోమ, మంగళవారాల్లో జరిగిన ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశాలకు ఆయన హాజరుకాలేదు. అటుతర్వాత ఆయన్ను బదిలీ చేయడంతో (శాఖ మార్చడంతో) ఐసీఐసీఐ బ్యాంకు డైరెక్టర్‌గా ఇక కొనసాగరన్న పుకార్లు వచ్చాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ స్పందిస్తూ... ‘‘బదిలీ చేసినప్పటికీ ఐసీఐసీఐ బ్యాంకులో లోక్‌రంజన్‌ ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా ఉంటారు’’ అని స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top