పసిడి అప్‌ట్రెండ్‌ బలహీనం

The gold uptrade weakens - Sakshi

వారంలో 13 డాలర్లు పతనం

రూపాయి బలహీనతతో దేశంలో లేని ఎఫెక్ట్‌

ఏడు వారాల అప్‌ట్రెండ్‌లో దాదాపు 1,240 డాలర్ల నుంచి 1,360 డాలర్ల స్థాయిని తాకిన పసిడి ధర కొంత స్థిరత్వ దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీతో ముగిసిన వారంలో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) అంతర్జాతీయ న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో 13 డాలర్లు బలహీనపడి 1,335 డాలర్లకు పడిపోయింది. ఇదే వారంలో డాలర్‌ ఇండెక్స్‌ 88.87 నుంచి 89.04 బలపడింది. రెండు వారాల క్రితం డాలర్‌ ఇండెక్స్‌ మూడేళ్ల కనిష్టస్థాయి 88.30ని తాకిన సంగతి తెలిసిందే. 

1,310 డాలర్ల వద్ద పసిడికి తక్షణ మద్దతన్న విశ్లేషణ వెలువడుతోంది. అమెరికా ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, పసిడి 1,400 డాలర్ల వరకూ దూసుకుపోయే వీలుంది. అయితే ఈ దశలో కొంత ఒడిదుడుకులు ఉంటాయన్నది వారి వాదన.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనాయంత్రాంగం కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులను సృష్టిస్తోందని, దీంతో డాలర్‌ ఇండెక్స్‌ ఒడిదుడుకులకు గురవుతుందనీ, ఇదే ధోరణి పసిడిలోనూ కనిపిస్తుందన్నది విశ్లేషణ.  

దేశీయంగా ‘రూపాయి’ ఎఫెక్ట్‌!
అంతర్జాతీయంగా పసిడి బలహీనపడితే, దేశంలో బంగారం ధర పటిష్టంగానే ఉంది. దీనికి కారణం రూపాయి బలహీనత ప్రధాన కారణం. రూపాయి వారంలో 63 పైసలు బలహీనపడింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 63.60 నుంచి 64.23కు బలహీనపడింది. ఈ ఎఫెక్ట్‌ దేశీయ మార్కెట్‌పై పడింది. 

మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌) లో పసిడి వారంలో 10 గ్రాములకు స్వల్పంగా రూ. 6 పెరిగి రూ.30,367కి చేరింది. ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత ధర రూ.40 లాభంతో రూ.30,635కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ. 30,485కు ఎగిసింది. వెండి కేజీ ధర మాత్రం రూ.495 తగ్గి, రూ. 39,270కు చేరింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top