పండగలొస్తున్నాయి... బంగారం కొంటున్నారా?

Gold Prices Drop In Rupee Terms: Should You Buy? - Sakshi

అంతర్జాతీయంగా పడిన ధర

డాలర్‌ బలోపేతమే కారణం

రూపాయి పతనంతో దేశంలో భారీగా తగ్గని ధర

అయినా.. కొనుగోళ్లకు తగిన సమయమే!

రూ.29,000 దిగువకు రాకపోవచ్చు!

బంగారం ధర బాగా తగ్గింది. ఇప్పుడే కొందామా? లేక మరింత తగ్గుతుందా? అన్నది సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రశ్న. అయితే తాజా గరిష్ట స్థాయి నుంచి చూస్తే, ఇప్పటికి తగ్గింది ఎక్కువే. నిజానికి డాలర్‌ మారకంలో రూపాయి విలువ జారి ఉండకపోతే, పసిడి ధర దేశంలో మరింతగా తగ్గి ఉండేది. అయితే ఇలా జరగలేదు. ఒకవైపు గరిష్ట స్థాయి నుంచి పసిడి కిందికి జారుతూ ఉంటే... దేశంలో మాత్రం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోతూ వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే, అంతర్జాతీయంగా పసిడి ధర మరింత తగ్గినా, అది మన దేశంలో అంతగా ప్రభావం చూపని పరిస్థితి ఉంటుంది.  

దేశంలో భారీగా తగ్గే అవకాశాల్లేవ్‌!
పసిడి డిమాండ్‌ను ఎదుర్కొనడానికి భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంటే డాలర్లను వెచ్చించి మనం పసిడిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రూపాయి మారకంలో డాలర్‌ విలువ 68 ఉందనుకుందాం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,300 డాలర్లు ఉందనుకుందాం. మనం ఈ పరిమాణం దిగుమతికి రూ. 88,400 వెచ్చించాల్సి ఉంటుంది. అదే రూపాయి విలువ 70కి చేరిందనుకుందాం. ఇదే మొత్తం దిగుమతికి దేశం రూ.91,000 వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పుడదే జరిగింది.

అంతర్జాతీయంగా పసిడి ధర 1,300 డాలర్లు ఉన్నప్పుడు దేశం దిగుమతికి ఎంత వెచ్చించిందో... 1,200 డాలర్ల స్థాయికి పడిపోయినా దాదాపు అంతే మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. పైగా దేశంలో  పసిడి దిగుమతులపై 10% సుంకాలు ఉండనే ఉన్నాయి. వెరసి సమీప భవిష్యత్తులో ధర తగ్గే అవకాశాలేమీ కనిపించడం లేదు. ప్రస్తుతం 70 స్థాయి ఉన్న రూపాయి 72 స్థాయికి వెళితే పసిడి ధర దేశీయంగా మరింత పెరిగినా పెరగవచ్చు. సగటున 1,200 డాలర్ల ప్రాతిపదికన, పసిడి ధర డాలర్లలో  5 శాతం తగ్గితే, భారత్‌ పసిడి ధర 8 శాతం పెరిగింది. రూపాయి బలహీనతే దీనికి కారణం.   

ప్రస్తుతం ‘‘స్వీట్‌ స్పాట్‌’’..?
నిజానికి ఇక్కడ నుంచి పసిడి మరింత పెరుగుతుందా? మరింత తగ్గుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్న. రూపాయి మారకం విలువ పతనం అంచున నిలుచున్న తరుణంలో పసిడి ఇంకా పెరిగితే, భారతీయుల కొనుగోళ్లపై మరింత భారం ఖాయం.  విశ్లేషకుల అంచనాల ప్రకారం – 1,200 డాలర్ల  ధర పసిడి ఉత్పత్తిదారులకు కొంత లాభదాయకమైనదే.

అయితే ఈ స్థాయికన్నా కిందకు పడితే, ఉత్పత్తి... అందుకు అనుగుణంగా సరఫరాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడికి డిమాండ్‌ కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుత శ్రేణిలో మరో ఐదారు నెలలు 40 డాలర్లకు అటు – ఇటుగా పసిడి కదలికలు జరిగే అవకాశం ఉంది. టెక్నికల్‌గా చూసినా, ఫండమెంటల్‌గా చూసినా, పసిడి ప్రస్తుతం ‘‘స్వీట్‌ స్టాప్‌’’అన్నది వాదన  గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో చైనా పెట్టుబడిదారులు గత వారం 68 డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది మూడు నెలల గరిష్ట స్థాయి.

అంతర్జాతీయంగా ధర ఎందుకు తగ్గుతోంది?
గడచిన ఏడాదిలో జూన్‌ వరకూ చూస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి 1,300 డాలర్ల దిగువకు ఎన్నడూ పడిపోలేదు. గరిష్ట స్థాయి 1,365.4 డాలర్ల స్థాయిని చూసింది. అయితే జూన్‌ తరువాత పసిడి దారుణ పతనం ప్రారంభమైంది. 1,161 డాలర్ల స్థాయిని తాకి, తిరిగి రికవరీ అయ్యింది. ప్రస్తుతం దాదాపు 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తంమీద 19 నెలల కనిష్టాన్ని పసిడి చూస్తే, 2018 ఏప్రిల్‌ గరిష్టం నుంచి పసిడి 14% పతనం అయ్యింది. అయితే పసిడి పతనానికి విభిన్న విశ్లేషణలు ఉన్నాయి.  

ఇందులో ఒకటి.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధంసహా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వృద్ధిపై అనుమానాలు దీనికి కారణమని అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయంతో విభేదించేవారే అధికం. కారణం ఏమిటంటే, వృద్ధికి విఘాతం కలుగుతుంటే, లాభపడాల్సింది పసిడే. అయితే అలా జరగలేదు. పెట్టుబడులకు సురక్షి తమైనదిగా పసిడిని ఎంచుకోవడం జరగలేదు.
మరోవైపు కొన్ని వర్ధమాన దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలోకి డబ్బు చేరుతోంది. డాలర్‌ బలోపేతం అవుతోంది. ఆరు ప్రధాన దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ గడచిన మూడు నెలల్లో 95 వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొని, చివరకు దానిని అధిగమించి 96ను తాకింది. దీనితో పసిడి పతనం మరింత ఊపందుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు (2%) పెంపు, వృద్ధిపై ఆశావహ ధోరణులు,  అమెరికా బాండ్లలో పెరుగుతున్న పెట్టుబడులతో డాలర్‌ మరింత పెరిగే అవకాశాలు పసిడి దూకుడుకు కళ్లెం వేసిన, వేస్తున్న అంశాలన్న విశ్లేషణకు మెజారిటీ మద్దతు ఉంది.  

పసిడి వెలుగులే..!
పసిడికి సంబంధించి రెండు వేర్వేరు అంచనాలను అనుసరించాల్సిదే. ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు స్వల్పకాలంలో పసిడిపై తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి. ఇక దీర్ఘకాలంగా చూస్తే, మార్కెట్‌ ఫండమెంటల్స్‌ పసిడి ధరను నిర్ణయిస్తాయి. ఫండమెంటల్స్‌ అంటే పెట్టుబడులకు, ఆభరణాలకు ఉద్దేశించి పసిడి డిమాండ్‌ ఎలా ఉందన్నది ఇక్కడ ప్రశ్న.

నా అభిప్రాయం ప్రకారం – డాలర్‌ బలోపేతం అవుతున్న ప్రస్తుత ధోరణి అర్ధంతరంగా ఆగిపోతుంది. ఇది పసిడికి బలాన్ని ఇస్తుంది. అమెరికా వడ్డీరేట్లు, డాలర్‌ బలోపేతం రెండూ స్వల్ప కాలికంగా పసిడిపై ప్రభావం చూపుతాయి. నెలలే తప్ప, సంవత్సరాల కాలం పసిడి దిగువస్థాయిలో ఉండదు. – జాన్‌ రీడే, వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ విశ్లేషకులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top