హమ్మయ్య రూపాయి పుంజుకుంది!

global investors view the Indian stock market

వారం గరిష్ట స్థాయి 65.01కి చేరిక

ఆర్థిక వ్యవస్థపై ఆశాభావంతో ర్యాలీ  

ముంబై: రూపాయి ఉన్నట్టుండి బలాన్ని పుంజుకుంది. బుధవారం ఒక్కరోజే డాలర్‌తో 49 పైసలు బలపడి 65.01 వద్ద స్థిరపడింది. ఈ ఏడాదిలో ఒకరోజులో ఈ స్థాయిలో లాభపడటం ఇది రెండోసారి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి మంగళవారం 65.50 వద్ద ముగియగా, బుధవారం ఉదయం 65.37 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. రోజంతా రూపాయికి కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం తర్వాత కీలకమైన 65 స్థాయిని దాటుకుని 64.95 వరకు బలపడింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 49 పైసలు లాభంతో 65.01వద్ద క్లోజయింది. ఆర్థిక వ్యవస్థపై ఆశాభావానికి తోడు ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పులు చేయకపోవడం రూపాయి ర్యాలీకి కారణమైంది.

బ్యాంకులు, కార్పొరేట్లు డాలర్‌ నిల్వలు తగ్గించుకునేందుకు మొగ్గు చూపాయి, అదే సమయంలో ఆసియా వ్యాప్తంగా డాలర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురవడం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ప్రధాన రంగాలు ఆగస్ట్‌లో 4.9% వృద్ధి చెందడంతో రూపాయి పట్ల సెంటిమెంట్‌ మెరుగైంది. గత వారం డాలర్‌తో రూపాయి ఆరున్నర నెలల కనిష్ట స్థాయి 65.89 వరకు క్షీణించిన విషయం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయంగానూ డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీలతో పోల్చి చూసినప్పుడు కాస్త బలహీనపడి 93.23కు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top