‘వృద్ధి’ మళ్లీ పట్టాలపైకి..!

GDP growth rate is 6.3% - Sakshi

క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం

ఐదు క్వార్టర్ల మందగమనానికి అడ్డుకట్ట

ఊతమిచ్చిన తయారీ రంగం జోరు

పేలవంగానే వ్యవసాయ రంగ వృద్ధి... 1.7 శాతం

న్యూఢిల్లీ: గాడితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌), వస్తు–సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రతికూల ప్రభావాలు తొలగిపోతున్నాయన్న ధోరణికి అద్దంపడుతూ సానుకూల జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2017–18 జూలై–సెప్టెంబర్, క్యూ2) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంది. అయితే, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్టానికి పడిపోయిన వృద్ధి రేటు 5.7 శాతంతో పోలిస్తే క్యూ2లో ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును సాధించడం గమనార్హం. అంతేకాదు!! గడిచిన ఐదు త్రైమాసికాలుగా దిగజారుతూ వస్తున్న వృద్ధి రేటు.. మళ్లీ జోరందుకోవడం చూస్తే, రికవరీకి ఢోకా లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు కొత్త పన్ను వ్యవస్థ జీఎస్‌టీకి వ్యాపారాలన్నీ అలవాటుపడుతున్నాయన్న అంచనాలు కూడా బలపడుతున్నాయి. ప్రధానంగా తయారీ రంగం పటిష్ట వృద్ధి క్యూ2 జీడీపీ పుంజుకోవడానికి దోహదం చేసింది. కేంద్రీయ గణాంకాల విభాగం(సీఎస్‌ఓ) గురువారం ఈ వివరాలు వెల్లడించింది.

ముఖ్యాంశాలివీ...
∙తయారీ రంగం క్యూ2లో అత్యంత పటిష్టంగా 7 శాతం వృద్ధి చెందింది. సేవల రంగం వృద్ధి కూడా 7.1 శాతానికి ఎగబాకింది.
∙మైనింగ్‌ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతంగా నమోదైంది.
∙నిర్మాణ రంగం 2.6 శాతం; ఫైనాన్షియల్, బీమా, రియల్‌ ఎస్టేట్‌ ఇతర ప్రొఫెషనల్‌ సేవల రంగానికి సంబంధించి 5.7 శాతం వృద్ధి నమోదైంది.
∙పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, రక్షణ ఇతరత్రా విభాగాల వృద్ధి రేటు 6 శాతంగా ఉంది.
∙వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల రంగం క్యూ2లో అత్యంత పేలవంగా 1.7 శాతం మాత్రమే వృద్ధి రేటును నమోదు చేసింది.
∙స్థూల విలువ ఆధారిత(గ్రాస్‌ వేల్యూ యాడెడ్‌–జీవీఏ) వృద్ధి రేటు జూలై–సెప్టెంబర్‌ కాలంలో 6.1 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 6.8% కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 5.6 శాతంగా ఉంది. తొలి ఆరు నెలలకు గాను జీవీఏ 5.8 శాతంగా లెక్కతేలింది. క్రితం ఏడాది ఇదే వ్యవధికి 7.2 శాతం నమోదైంది.

మూడీస్‌ రేటింగ్‌ తర్వాత కేంద్రానికి మరో బూస్ట్‌...
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తర్వాత ఆర్థిక మందగమనంపై ఎడాపెడా విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు ఇటీవలి మూడీస్‌ సార్వభౌమ రేటింగ్‌ పెంపుతో కాస్త ఊపరి పీల్చుకుంది. ఇప్పుడు వృద్ధిరేటు మళ్లీ జోరందుకుంటున్నట్లు జీడీపీ గణాంకాలు వెలువడటం ప్రభుత్వానికి మరింత జోష్‌నిచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది (2017–18) భారత్‌ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాది వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు క్యూ2లో 6.3–6.4 శాతం మేర వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే గణంకాలున్నాయి.

మరింత మెరుగుపడుతుంది: పరిశ్రమ
దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ బాటలో పయనిస్తోందని.. తాజా జీడీపీ గణాంకాలతో నిర్ధారణ అయిందని పారిశ్రామికవేత్తలు పేర్కొన్నారు. జీఎస్‌టీ వ్యవస్థకు వ్యాపారాలన్నీ నెమ్మదిగా సర్దుబాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (అక్టోబర్‌–మార్చి)లో వృద్ధి మరింత పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరేమన్నారంటే...

జీడీపీ వృద్ధి 6.3 శాతానికి పుంజుకోవడం శుభ పరిణామం. వ్యాపార వర్గాల్లో ఇది విశ్వాసం పెంపొందిస్తుంది. జీఎస్‌టీ, నోట్ల రద్దు అడ్డంకులను అధిగమించి మళ్లీ వృద్ధి బలమైన రికవరీ దిశగా కొనసాగుతోందనేందుకు తాజా గణాంకాలే నిదర్శనం. డిమాండ్‌ మెరుగుదల నేపథ్యంలో కంపెనీలు మళ్లీ ప్రాజెక్టుల వేగవంతానికి సిద్ధమవుతున్నాయి. దీంతో రానున్న క్వార్టర్లలో వృద్ధి మరింత పరుగులు పెడుతుంది.         – చంద్రజిత్‌ బెనర్జీ, (సీఐఐ) డైరెక్టర్‌ జనరల్‌

ఇది భారతీయ కార్పొరేట్లకు అత్యంత ఊరటనిచ్చే విషయం. అయితే, ఆర్థిక కార్యకలాపాలు మరింత బలోపేతం కావాల్సి ఉంది. తయారీ రంగం మెరుగుపడింది. మరోపక్క, వ్యవసాయం వెనుకబడటం ఆందోళనకలిగిస్తోంది. దీనివల్ల ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం నెలకొంటుంది.
– డీఎస్‌ రావత్, అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌

అంచనాలకు అనుగుణంగానే వృద్ధి రేటు గణంకాలు సానుకూలంగా వెలువడ్డాయి. బలమైన రికవరీకి ఇది సంకేతం. రానున్న నెలల్లో జీఎస్‌టీ ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయని భావిస్తున్నాం. వ్యాపార విశ్వాసం పుంజుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక ఈ నెలలోనే చేపట్టనున్న పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించడం ద్వారా సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఆర్‌బీఐ దీన్ని మంచి అవకాశంగా మలచుకుంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా సంస్కరణలను ముందుకుతీసుకెళ్లడం, రానున్న బడ్జెట్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగేలా తగు నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం.                                 – పంకజ్‌ పటేల్, ఫిక్కీ ప్రెసిడెంట్‌

జీఎస్‌టీ, నోట్ల రద్దు ప్రభావాలు తొలగినట్టే...
డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రభావాలు ఇక తొలగిపోయినట్టేనని జీడీపీ గణాంకాలను చూస్తే స్పష్టమవుతోంది. ఐదు త్రైమాసికాలుగా నెలకొన్న దిగజారుడు ధోరణి నుంచి వృద్ధి మళ్లీ పట్టాలెక్కింది. రానున్న త్రైమాసికాల్లో వృద్ధి రేటు మరింత పుంజుకుంటుందని భావిస్తున్నా. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితమే ఇది. తయారీ, సేవల రంగాల పటిష్ట పనితీరు దీనికి అద్దం పడుతోంది.
– అరుణ్‌ జైట్లీ, ఆర్థిక మంత్రి

ప్రోత్సాహకరం...
క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతానికి ఎగబాకడం ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరమైన అంశం. అయితే, వ్యవసాయ రంగం పేలవ పనితీరు కాస్త నిరుత్సాహపరుస్తోంది. జీఎస్‌టీ ప్రభావాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటే తాజా వృద్ధి రేటు గణాంకాలను ఎగువముఖంగా సవరించే అవకాశాలు లేకపోలేదు. – టీసీఏ అనంత్, చీఫ్‌ స్టాటస్టీషియన్‌

మందగమన ధోరణికి చెక్‌...
దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవడం స్వాగతించదగిన పరిణామం. మందగమణన ధోరణికి అడ్డుకట్టపడింది. అయితే, వచ్చే మూడు–నాలుగు త్రైమాసికాల గణాంకాలను చూస్తే తప్ప వృద్ధి మళ్లీ జోరందుకుంటోందని నిర్ధిష్టంగా చెప్పలేం. 6.3 శాతం వృద్ధి రేటు అనేది మోదీ సర్కారు ఇచ్చిన హామీకి ఆమడ దూరంలోనే ఉన్నట్లు లెక్క. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యానికి దీన్ని చాలా తక్కువ స్థాయి వృద్ధిగానే పరిగణించాలి. – పి. చిదంబరం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top