చివర్లో భారీగా అమ్మకాలు

Friday Sensex Close With Loss - Sakshi

మూడో రోజూ నష్టాలే...

ప్రతికూలంగా అంతర్జాతీయ సంకేతాలు  

289 పాయింట్లు పతనమై 39,452కు సెన్సెక్స్‌

91 పాయింట్ల నష్టంతో 11,823కు నిఫ్టీ  

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా మన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నష్టపోయింది. వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 289 పాయింట్లు పతనమై 39,452 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 91  పాయింట్లు నష్టపోయి 11,823 పాయింట్ల వద్ద ముగిశాయి. క్యాపిటల్‌ గూడ్స్‌ మినహా మిగిలిన అన్ని బీఎస్‌ఈ రంగ సూచీలు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 164 పాయింట్లు, నిఫ్టీ 47 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 

అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన...
చైనాలో పారిశ్రామికోత్పత్తి 17 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన మరింత పెరిగింది. చైనా–అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి కొనసాగుతోంది. ఇక తాజాగా ఒమన్‌ సింధుశాఖలో  రెండు ఆయిల్‌ ట్యాంకర్లపై దాడి నేపథ్యంలో అమెరికా–ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ప్రజ్వరిల్లాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లందరూ సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి ఇతర సాధనాల వైపునకు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలకు తోడు, మన ఆర్థిక వ్యవస్థ మందగమనం, మన మార్కెట్లో వేల్యూయేషన్లు అధికంగా ఉండటం కూడా జత కావడంతో మన మార్కెట్‌ నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 34 పైసలు నష్టపోవడం కూడా ప్రతికూల  ప్రభావం చూపించింది. జపాన్‌ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. 

437 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారింది. చివరి అరగంట వరకూ పరిమిత శ్రేణిలో నష్టాలు కొనసాగాయి. చివరి అరగంటలో భారీగా నష్టపోయింది. ఒక దశలో 59 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 378 పాయింట్ల మేర నష్టపోయింది. రోజంతా   437 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  31 సెన్సెక్స్‌ షేర్లలో ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.  జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం కొనసాగుతోంది. ఇంట్రాడేలో 13 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.80 వరకూ పతనమైన   ఈ షేర్‌ చివరకు 11 శాతం నష్టపోయి రూ.82 వద్ద ముగిసింది.

గృహ్‌ ఫైనాన్స్‌లో 4.22% వాటా విక్రయం
హెచ్‌డీఎఫ్‌సీ తన అనుబంధ కంపెనీ, గృహ్‌ ఫైనాన్స్‌లో 4.22% వాటాను రూ.899 కోట్లకు విక్రయించింది.  4.22% వాటాకు సమానమైన 3.1 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత మార్కెట్‌ ధర ఆధారంగా ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. ఒక్కో షేర్‌ సగటు విక్రయ ధర రూ.290. దీనితో ఇక  గృహ్‌ ఫైనాన్స్‌ కంపెనీ తమ అనుబంధ కంపెనీ కాదని హెచ్‌డీఎఫ్‌సీ వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top