దేశీ మొబైల్‌ కంపెనీలకు విదేశీ బ్రాండ్స్‌ షాక్‌

దేశీ మొబైల్‌ కంపెనీలకు విదేశీ బ్రాండ్స్‌ షాక్‌


చైనా కంపెనీలకు దేశీ హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌లో 49% వాటా

న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీలు దేశీ బ్రాండ్స్‌కు గట్టి పోటీనివ్వడమే కాదు.. ఏకంగా వాటిని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాయి. చైనా బ్రాండ్స్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (2017, జనవరి–మార్చి) ఇండియన్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌లో 49 శాతం వాటాను దక్కించుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే వీటి ఆదాయంలో 180 శాతం వృద్ధి నమోదయ్యింది.


ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ సైబర్‌మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) రూపొందించిన ‘ఇండియా క్వార్టర్లీ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌ రివ్యూ’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశంలో మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ మార్కెట్‌ రూ.3,46,295 మిలియన్ల రాబడిని అర్జించింది. త్రైమాసికం పరంగా చేస్తే ఇందులో 8 శాతం క్షీణత నమోదయ్యింది. విక్రయాల పరంగా చూస్తే శాంసంగ్, ఐటెల్, షావోమి కంపెనీల మార్కెట్‌ వాటా వరుసగా 27 శాతం, 9 శాతం, 6 శాతంగా ఉంది.


ఇక స్మార్ట్‌ఫోన్స్‌ విభాగంలో చైనా కంపెనీలు ఇప్పటికే దేశీ బ్రాండ్స్‌కు టాప్‌–5లో చోటులేకుండా చేశాయి. రానున్న రోజుల్లో మన బ్రాండ్స్‌కు మొత్తం మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకానుంది. ఇక యాపిల్‌ కంపెనీ తన ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ని దేశీయంగా ఉత్పత్తి చేస్తుండటంతో వివో, ఒప్పొ బ్రాండ్స్‌కి రూ.15,000–రూ.25,000 విభాగంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది.

Back to Top