దిగ్గజాల రూటు సెపరేటు!

Flipkart, amazon different strategies - Sakshi

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ భిన్న వ్యూహాలు

కొత్త సంవత్సరంలో కొత్తగా పయనం

ఈ–కామర్స్‌ మార్కెట్‌పై సొంత ముద్ర

చిన్న పట్టణాలు, సొంత ఉత్పాదనలపై ఫ్లిప్‌కార్ట్‌

కస్టమర్‌ కోరినవన్నీ అందించడమే అమెజాన్‌ వ్యూహం

న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్‌ మార్కెట్లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ తమ వాటా పెంచుకునేందుకు 2018లో భిన్న వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు ఈ–కామర్స్‌ మార్కెట్లో పై చేయి సాధించేందుకు గాను తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. అగ్ర స్థానం కోసం మార్కెటింగ్‌ వ్యూహాల పరంగా ఒకదాన్ని ఇంకొకటి అనుకరించేవి. కొత్త ఏడాదిలో మాత్రం ఇవి రెండూ భిన్న మార్గాల్లో అడుగులు వేయనున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా అలీబాబా వెన్నుదన్నుతో పేటీఎం మాల్‌ సైతం మూడో పక్షంగా అవతరించనున్నదనేది వారి మాట.  

చిన్న పట్టణాలపై ఫ్లిప్‌కార్ట్‌ గురి
ఈ–కామర్స్‌ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్‌... చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించనుంది. తన సొంత బ్రాండ్‌ ఉత్పత్తులతో వినియోగదారులకు చేరువ కావాలన్న వ్యూహంతో ఉంది.

అమెజాన్‌ మాత్రం ప్రీమియం కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులను అందించడంపై దృష్టి పెట్టనుంది. మొత్తమ్మీద ఇరు కంపెనీలూ ప్రస్తుతం తామున్న స్థానాలను పటిష్టంగా కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే విధానాలను అమలు చేయబోతున్నాయి. ‘‘మొదటి సారి ఈ–కామర్స్‌ మార్కెట్‌ లీడర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ రెండు భిన్న మార్గాలను అనుసరించడాన్ని చూడబోతున్నాం’’అని హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ (ఇండియా) అనలిస్ట్‌ రాజీవ్‌ శర్మ చెప్పారు.

కేవలం సరుకుల అమ్మకాల విలువపైనే (జీఎంవీ) ఈ మార్కెట్‌ ఎంతో కాలం కొనసాగకపోవచ్చని, ఆన్‌లైన్‌ కొనుగోలుదారుల్ని పెంచుకోవడం, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు చేయించడం, కొత్త విభాగాలలో వృద్ధి వంటివి మార్కెట్‌ను శాసించవచ్చని ‘ఇండియా ఇంటర్నెట్‌: ఆన్‌ ద వే టు ఇండియా ఈ కామర్స్‌ 2.0’ పేరుతో విడుదల చేసిన నివేదికలో రాజీవ్‌ శర్మ వివరించారు. స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు లభించేలా, కస్ట మర్లు ఆశించేవన్నీ అందుబాటులో ఉండేలా చూడటమే తమ లక్ష్యమని అమెజాన్‌ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

మెట్రోలకు వెలుపల విస్తరించి ఉన్న పట్టణాల్లోని కస్టమర్లకు చేరువ కావాలన్నది ఫ్లిప్‌కార్ట్‌ యోచన. ప్రైవేటు లేబుల్స్‌ ఉత్పత్తుల ద్వారా వారికి చేరువ కావాలనుకుంటోంది.
ఫ్లిప్‌కార్ట్‌ మొత్తం విక్రయాల్లో దాని సొంత లేబుల్స్‌ ఉన్న ఉత్పత్తుల విలువ 15 నుంచి 20 శాతం వరకు ఉంది.  
వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుత అమ్మకాల్లో 45 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తోంది.
అమెజాన్‌ కూడా చిన్న పట్టణాల మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది.
ప్రస్తుతం అమెజాన్‌ విక్రయాల్లో 65 శాతం వాటా మెట్రో నగరాల నుంచే ఉంది. ఇందులోనూ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ పాత్ర కీలకం.
అమెజాన్‌ ఫ్యాషన్, కిరాణా ఉత్పత్తులపైనా ప్రత్యేక దృష్టి సారించనుంది.   

ఆన్‌లైన్‌ ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ తేదీ తప్పనిసరి!
♦ ధరతో పాటు, కస్టమర్‌ కేర్‌ వివరాలూ ఉండాలి
♦ 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధన 

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేవారి ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో విక్రయించే ఉత్పత్తులపై ఈ–కామర్స్‌ కంపెనీలు గరిష్ట చిల్లర ధరతో (ఎంఆర్‌పీ) పాటు ఎక్స్‌పైరీ తేది, కస్టమర్‌ కేర్‌ వివరాలు మొదలైనవి కూడా తప్పనిసరిగా డిస్‌ప్లే చేసేలా రూపొందించిన నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ‘వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా లీగల్‌ మెట్రాలజీ (ప్యాకేజ్డ్‌ కమోడిటీస్‌) నిబంధన 2011లో చేసిన సవరణలు 2018 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి’ అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

సవరించిన నిబంధనల ప్రకారం ఈ–కామర్స్‌ సైట్లలో విక్రేతలు ఆయా ఉత్పత్తుల ఎంఆర్‌పీ, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ, నికర పరిమాణం, ఏ దేశ ఉత్పత్తి, కస్టమర్‌ కేర్‌ మొదలైనవి లేబుల్‌పై డిస్‌ప్లే చేయాలి. కొనుగోలుదారు చదవగలిగేలా అక్షరాలు, అంకెల పరిమాణం ఉండాలి. ఒకే ఉత్పత్తికి రెండు రకాల ధరలు (డ్యుయల్‌ ఎంఆర్‌పీ) ఉండకూడదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే ఉత్పత్తులపై ఎంఆర్‌పీ మాత్రమే ముద్రించి ఉంటోంది. అయితే, ఆయా ఉత్పత్తుల వివరాలు సమగ్రంగా లేకపోవడం వల్ల మోసపోయామంటూ అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ.. సంబంధిత చట్టానికి 2017 జూన్‌లో సవరణలు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top