ఆర్థిక మంత్రికి సవాళ్ల స్వాగతం

Financial Task to Nirmala Sitharaman - Sakshi

ఐదేళ్ల కనిష్టానికి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు... 6.8 శాతం

క్యూ4లో 5.8 శాతం 

ఏప్రిల్‌లో మందగించిన మౌలికం

2017–18లో 45 ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగ రేటు

కొత్తగా ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌కి ప్రారంభంలోనే పలు సవాళ్లు స్వాగతం చెప్పాయి. నూతన సర్కారు ఏర్పాటైనతరుణంలో శుక్రవారం నిరుత్సాహకరమైన కీలక గణాంకాలు వెలువడ్డాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ఏకంగా అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. మరోవైపు, ఏప్రిల్‌లో కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి మందగించింది. ఇక, 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగిత రేటు 6.1 శాతంగా నమోదైంది. ఇది 45 ఏళ్ల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇటు వినియోగం, అటు పెట్టుబడులుమందగించిన నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దడం కొత్త ఆర్థిక మంత్రికి పెనుసవాలుగానే ఉండగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

నాల్గవ త్రైమాసికం నత్తనడక...
వ్యవసాయం, తయారీ రంగాల పేలవ పనితీరు నేపథ్యంలో 2018–19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.8 శాతానికి పరిమితమైంది. ఇది అయిదేళ్ల కనిష్ట స్థాయి. అంతే గాకుండా క్యూ4లో చైనా నమోదు చేసిన 6.4 శాతం జీడీపీ వృద్ధి రేటు కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కేంద్రీయ గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) విడుదల చేసిన డేటా ప్రకారం 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.2 శాతం కన్నా ఇది మరింత తగ్గింది. 2013–14లో 6.4 శాతం జీడీపీ వృద్ధి రేటు తర్వాత ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం కాగా, రెండో క్వార్టర్‌లో 7.1 శాతంగాను, మూడో త్రైమాసికంలో 6.6 శాతంగాను నమోదైంది. దేశీయంగా వినియోగం బలహీనంగా ఉండటం, ప్రపంచ వృద్ధి మందగించడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధాలపరమైన ఉద్రిక్తతలు పెరుగుతుండటం ఇటు దేశీ జీడీపీపైనా ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

మౌలికం మందగమనం...
ముడిచమురు, సహజ వాయువు, ఎరువుల ఉత్పత్తి మొదలైనవి ప్రతికూలంగా ఉండటంతో ఏప్రిల్‌లో ఎనిమిది కీలక రంగాలతో కూడుకున్న మౌలిక రంగాల గ్రూప్‌ వృద్ధి మందగించింది. 2.6 శాతానికి పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఇది 4.7 శాతం. బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ రంగాలు మౌలిక గ్రూప్‌లో భాగంగా ఉంటాయి. శుక్రవారం విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో బొగ్గు ఉత్పత్తి వృద్ధి దాదాపు గతేడాది ఏప్రిల్‌ స్థాయిలోనే 2.8 శాతంగా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి 5.8 శాతంగా, రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి 4.3 శాతంగా నమోదయ్యాయి. క్రూడాయిల్, సహజ వాయువు, ఎరువుల రంగాల ఉత్పత్తి గత ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి లేకపోగా.. మరింత పడిపోయింది. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తికి సంబంధించి 41 శాతం దాకా వాటా ఉండే ఈ మౌలిక రంగాల వృద్ధి రేటు అటు కీలకమైన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పైనా ప్రభావం చూపనుంది.

ద్రవ్య లోటు 3.39 శాతం...
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ద్రవ్య లోటు 3.39 శాతానికి పరిమితమైంది. బడ్జెట్‌లో 3.4 శాతంగా అంచనాలు సవరించగా.. దానికన్నా కొంత తక్కువే నమోదైంది. ప్రధానంగా పన్నేతర ఆదాయం పెరగడం, వ్యయాలు కొంత తగ్గడం ఇందుకు కారణం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 మార్చి ఆఖరు నాటికి ద్రవ్య లోటు రూ. 6.45 లక్షల కోట్లుగా ఉంది. విలువపరంగా చూస్తే ద్రవ్య లోటు పెరిగినప్పటికీ.. జీడీపీలో శాతంపరంగా చూస్తే స్వల్పంగా తగ్గినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి.  

45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగ రేటు...
దేశంలో నిరుద్యోగ రేటు 2017–18 సంవత్సరంలో 6.1 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. ఇది 45 ఏళ్లలోనే అత్యధిక రేటు కావడం గమనార్హం. ఎన్నికల ముందు నిరుద్యోగ గణాంకాలు ప్రభుత్వం విడుదల చేయకపోయినప్పటికీ లీక్‌ అవగా, ఆ గణంకాలకు అనుగుణంగానే ప్రభుత్వం విడుదల చేసిన రేటు కూడా ఉండడం పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ సామర్థ్యాలుండీ 7.8 శాతం మంది ఉపాధి లేకుండా ఉన్నట్టు కార్మిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 5.3 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉపాధి లేకుండా ఉన్న వారిలో పురుషుల రేటు 6.2 శాతం కాగా, మహిళలలో 5.7 శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పట్టణాల్లో పురుషుల్లో నిరుద్యోగ రేటు 7.1 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 5.8 శాతం ఉంది. మహిళల విషయంలో పట్టణాల్లో ఈ రేటు 10.8 శాతంగా కాగా, గ్రామీణ ప్రాంతంలో అతి తక్కువగా 3.8 శాతమే ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.  ‘‘ఇదొక కొత్త డిజైన్‌. కొత్త మాతృక. గతంతో దీన్ని పోల్చడం సహేతుకం కాదు. ఇది 45 ఏళ్ల గరిష్ట స్థాయి అన్నది మీ అన్వయం మాత్రమే. కానీ, 45 ఏళ్ల గరిష్టం లేదా కనిష్టం అని నేను వ్యాఖ్యానించను. 2017–18 నుంచి భిన్నమైన మాతృక అన్నది కీలకం. ఇక్కడి నుంచి క్రమం తప్పకుండా వచ్చే గణాంకాలకు దీన్ని బేస్‌గా చూడొచ్చు’’ అని స్టాటిస్టిక్స్‌ సెక్రటరీ ప్రవీణ్‌ శ్రీవాస్తవ సందేహాలు తీర్చే ప్రయత్నం చేశారు.

పెరిగిన తలసరి ఆదాయం...
2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం నెలవారీగా చూస్తే సుమారు 10 శాతం పెరిగింది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్‌పీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నెలకు రూ. 10,534 స్థాయిలో నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం 2018–19లో తలసరి    ఆదాయం రూ. 1,26,406గా (నెలవారీగా రూ. 10,533.83) ఉన్నట్లు గణాంకాల శాఖ తెలిపింది. 2017–18లో    నమోదైన రూ. 1,14,958 (నెలవారీగా రూ. 9,579.83)తో పోలిస్తే దాదాపు రూ. 10 శాతం పెరిగినట్లు పేర్కొంది. దేశ ప్రజల అభ్యున్నతికి తలసరి ఆదాయాన్ని కొలమానంగా పరిగణిస్తారు. తాజా గణాంకాల ప్రకారం.. స్థూల దేశీయ సంపద 2018–19లో సుమారు 11.3 శాతం వృద్ధితో రూ. 188.17 లక్షల కోట్లుగా ఉంది. 2017–18లో     ఇది రూ. 169.10 లక్షల కోట్లు.  
తాత్కాలిక అంశాలే కారణం: సుభాష్‌ చంద్ర గర్గ్‌  

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో నెలకొన్న సంక్షోభాలు మొదలైన తాత్కాలిక అంశాలు నాలుగో త్రైమాసికంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గర్గ్‌ పేర్కొన్నారు. ‘2018–19 నాలుగో త్రైమాసికంలో జీడీపీ మందగించడానికి ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నెలకొన్న సంక్షోభం వంటి తాత్కాలిక ఒత్తిళ్లు కారణం. ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) తొలి త్రైమాసికంలో కూడా వృద్ధి గతంతో పోలిస్తే కొంత మందగించే అవకాశం ఉంది. అయితే, రెండో త్రైమాసికం నుంచి క్రమంగా మళ్లీ పుంజుకోగలదు‘ అని గర్గ్‌ చెప్పారు. ప్రైవేట్‌ పెట్టుబడులతో పాటు ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్స్‌ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించారు.  

ప్రధాన రంగాలు నేలచూపు
క్యూ4లో వ్యవసాయ రంగం వృద్ధి (–1 శాతం)గా ఉంది. క్యూ3లో ఇది 2.7 శాతం.
మైనింగ్‌ రంగ వృద్ధి క్యూ3లో 1.8 శాతం కాగా.. క్యూ4లో 4.2 శాతం.
తయారీ రంగం క్యూ3లో 6.7 శాతం, క్యూ4లో 3.1 శాతం.
విద్యుదుత్పత్తి క్యూ3లో 8.2 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.3 శాతం.
క్యూ3లో 9.6 శాతంగా ఉన్న నిర్మాణ రంగం వృద్ధి క్యూ4లో7.1 శాతానికి మందగించింది.
వాణిజ్యం, ఆతిథ్యం, రవాణా, కమ్యూనికేషన్‌ విభాగం వృద్ధి క్యూ3లో 6.9 శాతంగా ఉండ గా, క్యూ4లో 6 శాతానికి పరిమితమైంది.
ఆర్థిక సేవల విభాగం వృద్ధి 7.3 శాతం నుంచి 9.5 శాతానికి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top