పసిడికి కీలకం... ఈ వారం ఫెడ్‌ నిర్ణయం!

Fall of ten dollars a week - Sakshi

వారంలో పది డాలర్లు పతనం

1,314 డాలర్ల వద్ద ముగింపు

పెరుగుదలపై మిశ్రమ స్పందన...

అంతర్జాతీయ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌– నైమెక్స్‌లో  వారంలో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) 10 డాలర్లు తగ్గి 1,314 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే వారంలో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా ఎగసి 90.11 నుంచి 90.17కు చేరింది. 1,360 డాలర్లను తాకిన పసిడి నాలుగు వారాలుగా తగ్గుతూ వస్తోంది.  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటుకు సంబంధించి బుధవారం తీసుకునే నిర్ణయం పసిడి నడత దిశలో కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. రేటు పెంపు ఉంటుందని మెజారిటీ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పావుశాతం రేటు పెంచితే 1.50–1.75 శాతం శ్రేణికి ఫెడ్‌ ఫండ్‌ రేటు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ ఏడాది ఇది మొట్టమొదటి పెంపు అవుతుంది.  మొత్తం మీద ఆయా దిశలో నిర్ణయాలు పసిడిపై ప్రభావం చూపుతాయని విశ్లేషకుల అంచనా. ప్రస్తుత గృహ విక్రయాలు, డ్యూరబుల్‌ గూడ్స్‌ విక్రయాల వంటి కీలక అమెరికా గణాంకాలు కూడా వచ్చే వారం వెలువడనున్నాయి. 

మూడు కీలక అంశాలు...: రానున్న కొద్ది రోజుల్లో మూడు ప్రధాన అంశాలు పసిడిపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నది నిపుణుల విశ్లేషణ. ఫెడ్‌ ఫండ్‌రేటు పెంచితే, పసిడి ధర పడిపోతుందని అంత తేలిగ్గా చెప్పలేమన్నది వారి వాదన. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షేత్ర స్థాయిలో రేటు పెంపునకు సానుకూలంగా స్పందించకపోతే, పసిడి ధర ముందుకు దూసుకుపోవడం ఖాయమన్నది వారి అభిప్రాయం. ఇక అమెరికా ప్రారంభించిన అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం– అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం,  అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలూ పసిడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఆయా ప్రభావ అంశాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి 1,250 డాలర్లు – 1,400 డాలర్ల స్థాయిలోనే తిరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.  1,300, 1,270, 1,240 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎగువస్థాయిలో తక్షణ నిరోధం 1,365 డాలర్లు.  

దేశంలో స్వల్ప నష్టాలు...: అంతర్జాతీయంగా పసిడి 10 డాలర్లు తగ్గినప్పటికీ, అంత స్థాయిలో దేశీయంగా  పడలేదు.  డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత (వారం వారీగా 13 పైసలు నష్టంతో 65.07) దీనికి కారణం.  ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి 10 గ్రాముల ధర స్వల్పంగా  రూ.177 తగ్గి, రూ.30,224కి చేరింది.  ఇక దేశీయంగా ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో పసిడి వారం వారీగా  99.9 స్వచ్ఛత ధర రూ. 85 నష్టంతో రూ.30,460కు తగ్గింది. వెండి కేజీ ధర రూ. 110 నష్టంతో రూ.38,275కి దిగింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top