చివర్లో అమ్మకాలు- మార్కెట్లు పతనం

fag end selling hits market badly - Sakshi

సెన్సెక్స్‌ 414 పాయింట్లు డౌన్‌

34,000 పాయింట్ల దిగువకు

ఇంట్రాడేలో భారీ ఆటుపోట్లు

930 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్‌

నిఫ్టీ 121 పాయింట్లు మైనస్‌

పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌

అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి గంటన్నరలో పెరిగిన అమ్మకాలతో ఖంగుతిన్నాయి. సెన్సెక్స్‌ 414 పాయింట్లు పతనమై 33,957కు చేరింది. వెరసి 34,000 పాయింట్ల మార్క్‌ దిగువన ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 121 పాయింట్లు క్షీణించి 10,047 వద్ద నిలిచింది. కేంద్ర బ్యాంకుల భారీ ప్యాకేజీలు, ప్రభుత్వ చర్యలు, లాక్‌డవున్‌ ఎత్తివేత తదితర సానుకూల అంశాల కారణంగా ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్న విషయం విదితమే. దీంతో తొలుత సెన్సెక్స్‌ 450 పాయింట్ల వరకూ ఎగసి 34,811 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్‌సెషన్‌ సమయంలో ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు 1.5 శాతం స్థాయిలో నష్టపోవడంతో సెంటిమెంటు బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభావం చూపినట్లు తెలియజేశారు. ఫలితంగా ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ 930 పాయింట్లు పతనమై 33,881కు జారింది. ఇక నిఫ్టీ సైతం ఇం‍ట్రాడేలో 10,291- 10,021 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది.

ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 3.3-1.7 శాతం మధ్య క్షీణించగా.. మెటల్‌, ఆటో 1-0.5 శాతం నీరసించాయి. ఫార్మా 2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, విప్రో, గెయిల్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, టైటన్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాం‍క్‌, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌, సన్‌ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్‌, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఐషర్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ 4-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.

ఐడియా పతనం
డెరివేటివ్స్‌లో వొడాఫోన్‌ ఐడియా 17 శాతం కుప్పకూలగా.. పీవీఆర్‌, జస్ట్‌డయల్‌, ఆర్‌ఈసీ, అశోక్‌ లేలాండ్‌, ఎన్‌సీసీ, ఐబీ హౌసింగ్‌, ఇండిగో 7-4 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. భెల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, జీఎంఆర్‌, అరబిందో, ముత్తూట్‌ ఫైనాన్స్‌, చోళమండలం, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, నౌకరీ 11-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2-1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1458 నష్టపోగా.. 1118 లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. కాగా.. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 98 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 47 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top