ఇప్పటికి దూరమే బెటర్‌!

Expert assessment on investment in the gold - Sakshi

పసిడిలో ఇన్వెస్ట్‌మెంట్‌పై నిపుణుల అంచనా

న్యూయార్క్‌/ముంబై: అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌  (నైమెక్స్‌)లో 13వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 14 డాలర్లు పడిపోయి 1,242 డాలర్లకు దిగింది.

ఈ ఏడాది జనవరి నుంచి 1,366 – 1,300 డాలర్ల  మధ్య తిరిగిన పసిడి, గడచిన నెలన్నరలో ప్రస్తుత స్థాయికి పడిపోవడం గమనార్హం. ఇదే కాలంలో డాలర్‌ ఇండెక్స్‌ దాదాపు 92 స్థాయి నుంచి 95.50 స్థాయికి లేచింది. 95.50 వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటోంది. 13వ తేదీతో ముగిసిన వారంలో డాలర్‌ ఇండెక్స్‌ 93.76 స్థాయి నుంచి 94.44 స్థాయికి ఎగయడం గమనార్హం.  

నిపుణులు ఏమంటున్నారంటే...
‘బంగారాన్ని ప్రభావితం చేసే తొలి అంశం అమెరికా డాలర్‌. ఇది మరింత బలపడితే, అది పసిడిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక్కడ బంగారాన్ని ప్రభావితం చేసే మరో అంశం కూడా ఉంది. అది అమెరికా ట్రెజరీ ఈల్డ్‌. ఇందులో ఏ కొంచెం పెరుగుదల కనిపించినా ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లవైపు ఆకర్షితులౌతారని అప్పుడు స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రానున్న నెలల్లో అమెరికా వడ్డీ రేటు అంశం బంగారం ధరను నిర్దేశించడంలో కీలకంగా మారనుంది’ అని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ ఆసిఫ్‌ హిరానీ తెలిపారు. ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
 ‘అమెరికా వడ్డీరేటు పెరుగుదల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు వద్దని చెబుతాను. ఒకవేళ కామెక్స్‌లో ఔన్స్‌ ధర 1,200 డాలర్ల సమీపంలోకి వస్తే ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చు. గత రెండేళ్లుగా బంగారం 1,200 డాలర్ల దిగువున ఎప్పుడూ కూడా స్థిరపడలేదు. తిరిగి మళ్లీ పెరుగుతూ వస్తోంది’ అని పేర్కొన్నారు.   
 ‘బంగారానికి 1,250 డాలర్లను గట్టి మద్దతుగా భావిస్తున్నాం.  ఈ స్థాయిని కోల్పోయింది కాబట్టి, 1,220 డాలర్లు మద్దతు స్థాయి’ అని  వెల్త్‌ డిస్కవరీ డైరెక్టర్‌ రాహుల్‌ అగరా>్వల్‌ పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తన వృద్ధిని కొనసాగించినా.. అమెరికా వడ్డీ రేట్లు పెరిగినా.. అప్పుడు బంగారం ధర తగ్గుతుందని తెలిపారు. స్వల్ప కాలంలో బంగారం ర్యాలీ ఉండకపోవచ్చన్నారు.  
 కాగా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని కమ్‌ట్రడ్జ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జ్ఞానశేఖర్‌ త్యాగరాజన్‌ పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం, చమురు ధరల పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపుతారని అభిప్రాయపడ్డారు.  

దేశీయంగా రూ.400కుపైగా నష్టం...
దేశీయంగా ప్రధాన ముంబై మార్కెట్లో 99.5, 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.480 చొప్పున నష్టపోయి రూ.30,200, రూ.30,050 వద్ద ముగిశాయి. ఇక వెండి ధర రూ.620 పడిపోయి రూ. 38,675కు దిగింది. దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– ఎంసీఎక్స్‌లో ధర రూ.455 నష్టపోయి, రూ. 30,105  వద్ద ముగిసింది.  ఇక డాలర్‌ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో శుక్రవారం 28 పైసలు లాభపడి రూ. 68.76 నుంచి రూ.68.49 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top