ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి

ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి


ఖాదీ ద్వారా కల్పిస్తాం: కేంద్ర మంత్రి గిరిరాజ్‌

ముంబై: ఖాదీ పరిశ్రమ ద్వారా రానున్న ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రి గిరిరాజ్‌సింగ్‌ తెలిపారు. ‘‘ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌(కేవీఐసీ)లో సోలార్‌ ఆధారిత స్పిన్నింగ్‌ వీల్స్‌ను ప్రవేశపెట్టేందుకు  ప్రణాళికను రూపొందించాం. ఇది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఐదేళ్ల కాలంలో ఉపాధి కల్పించగలదు’’ అని మంత్రి వివరించారు.


ముంబైలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమలో ఖాదీ ఉత్పత్తుల వాటా ఒక శాతంలోపే ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కృషితో ఖాదీ విక్రయాలు 2014లో రూ.35,000 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం రూ.52,000 కోట్లకు పెరిగినట్టు వివరించారు. వడ్డీ రేట్లలో రాయితీలు, ఆర్థిక సాయం, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలు తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు గిరిరాజ్‌ చెప్పారు. ఖాదీ ఉత్పత్తుల వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు గాను అరవింద్, రేమండ్‌ తదితర కంపెనీలతో కేవీఐసీ భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది.

Back to Top