ఎన్నికల ఫలితాలతో అటో.. ఇటో!

 election results effect on market - Sakshi

శీతాకాల సమావేశాలపై ఇన్వెస్టర్ల కన్ను  

ముడి చమురు ధరలపైనా దృష్టి

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనాలు  

గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో వెలువడే ఎన్నికల ఫలితాలే ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. సోమవారం మార్కెట్‌ మొదలయ్యే సమయానికే....ఆ రెండు రాష్ట్రాల ఫలితాల ట్రెండ్‌ వెల్లడికానున్నందున....అధికారపార్టీ గెలుపు ఓటములు, గెలుచుకోబోయే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సోమవారం మార్కెట్‌ గ్యాప్‌అప్‌ లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభంకావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అటుతర్వాత అమెరికా పన్నుల సంస్కరణలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు స్టాక్‌సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారు అంటున్నారు.  

పార్లమెంట్‌ పరిణామాలూ కీలకమే...
గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని వివరించారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా  ఫలితాలు వస్తే, సమీప కాలం నుంచి మధ్య కాలానికి మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మార్కెట్‌ అమెరికా పన్ను సంస్కరణలు, ఇతర అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెడుతుందని వివరించారు. నేడు(సోమవారం) వెలువడే ఫలితాల్లో గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో బీజీపీ విజయం ఖాయమని గత శుక్రవారం ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, అమెరికా పన్నుల సంస్కరణలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ అనితా గాంధీ చెప్పారు.  

వచ్చే వారం హాలిడే మూడ్‌...!: ఫలితాల ఆధార కదలికల అనంతరం మార్కెట్లో కరెక్షన్‌ చోటు చేసుకునే అవకాశాలున్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ అంచనా వేస్తున్నారు. షేర్ల వారీ కదలికలు ఈ వారం చోటు చేసుకుంటాయని, ఇన్వెసర్లు వేచి చూసే ధోరణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వారమే మార్కెట్‌ చురుకుగా ఉంటుందని, వచ్చే వారం నుంచి ప్రపంచమంతా క్రిస్మస్, కొత్త ఏడాది సెలవుల సంరంభం ప్రారంభమవుతుందని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, ఈ గురువారం(ఈ నెల 21న) అమెరికా క్యూ3 జీడీపీ గణాంకాలు వస్తాయి. బుధవారం(ఈ నెల 20న) జపాన్‌ కేంద్ర బ్యాంక్‌ పాలసీ వెలువడుతుంది.  

కొనసాగిన విదేశీ ఈక్విటీ విక్రయాలు..: గత వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.610 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.5,077 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.20,500 కోట్లుగా ఉన్నాయి.

ఒక ఐపీఓ, ఒక లిస్టింగ్‌
గత శుక్రవారం ప్రారంభమైన ఆస్ట్రన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్‌ మిల్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 20న(బుధవారం) ముగియనున్నది. రూ.45–50 ప్రైస్‌బాండ్‌తో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.70 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 280 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఈ నెల 28న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్‌ షేర్లు నేడు (సోమవారం) స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. రూ.664 ఇష్యూ ధరతో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.650 కోట్లు సమీకరించింది. ఈ నెల 6–8 మధ్య వచ్చిన ఈ ఐపీఓ 7.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.  

సెన్సెక్స్‌లో రెండు కొత్త షేర్లు..  
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో నేటి(సోమవారం) నుంచి రెండు కొత్త షేర్లను చేర్చనున్నారు. సిప్లా, లుపిన్‌ ఈ రెండు ఫార్మా షేర్ల స్థానంలో ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు–ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌లను చేరుస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top