వ్యాపారం ఈజీ..!

Easier to do business in India than ever before, says Narendra Modi - Sakshi

ఇది చరిత్రలో ఎన్నడూలేనంత పురోగతి

నిబంధనల పాటింపు సులభమయ్యింది

కాలం చెల్లిన చట్టాలు కనుమరుగయ్యాయి

అనుమతుల ప్రక్రియ సరళతరమయింది

‘ఆహార సదస్సు’లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

భారీ పెట్టుబడులతో రావాలని పిలుపు

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వ్యాపారం ప్రారంభించడం ఎంతో సులభంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘‘విధానాలు చాలా సులభతరమయ్యాయి. పురాతన చట్టాలు రద్దయిపోయాయి. అనుమతుల ప్రక్రియ కూడా సులభంగా మారింది. గత మూడేళ్లలో చేపట్టిన సంస్కరణలు భారత్‌ను సులభతర వ్యాపార నిర్వహణ దేశాల్లో 30 స్థానాలు ఎగబాకేందుకు తోడ్పడ్డాయి’’అని మోదీ వ్యాఖ్యానించారు. 

శుక్రవారం ఢిల్లీలో ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా 2017’  3 రోజుల సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రధాని ప్రసంగించారు. వ్యాపార సులభతర నిర్వహణ సూచీలో 2014లో భారత్‌  142వ స్థానంలో ఉండగా ఇప్పుడు 100వ స్థానానికి చేరుకోవడం అన్నది ఎన్నడూ లేనంత పురోగతిగా ప్రధాని అభివర్ణించారు.

ఇతర సూచీల్లోనూ...
గ్రీన్‌ఫీల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లో 2016లో మన దేశం నంబర్‌–1 స్థానంలో నిలిచిందన్నారు మోదీ. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ, అంతర్జాతీయ లాజిస్టిక్స్‌ ఇండెక్స్, అంతర్జాతీయ పోటీతత్వ సూచీల్లోనూ వేగంగా ముందుకు వెళుతోందని ప్రధాని తెలిపారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం ఒకటని చెబుతూ... జీఎస్టీని జూలై 1 నుంచి అమలు చేయడం వల్ల బహుళ పన్నుల వ్యవస్థను నిర్మూలించామన్నారు.  ‘‘దేశంలో వ్యాపారం ప్రారంభించడం ఇపుడు ఇంతకుముందెన్నడూ లేనంత సులభం. పలు ఏజెన్సీల నుంచి అనుమతుల ప్రక్రియ కూడా సులభతరమైంది. నిబంధనల అమలు భారాన్ని తగ్గించాం’’ అని మోదీ వివరించారు.

ఆహార రంగంలో భారీ అవకాశాలు
ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరు కాగా, వారిని ఉద్దేశించి దేశ ఆహార ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘సాగు నుంచి ఆహారాన్ని నోటికి అందించే ఫోర్క్‌ వరకు ఇక్కడ అవకాశాలు అపరిమితం. ఉత్పత్తి నుంచి ప్రాసెస్‌ వరకు అవకాశాలకు అనువైన దేశమిది.

ఈ అవకాశాలున్నది భారత్‌ కోసం, ప్రపంచం కోసం’’ అని మోదీ పేర్కొన్నారు. ఆహార రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించిన విషయాన్ని గుర్తు చేశారు. భారీ సంఖ్యలో వినియోగదారులు, పెరుగుతున్న ఆదాయాలు, పెట్టుబడులకు సానుకూల వాతావరణం, వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండడం వంటి అనుకూలతల దృష్ట్యా ప్రపంచ ఆహార ప్రాసెసింగ్‌కు భారత్‌ కేంద్రంగా మారుతోందన్నారు.

పెట్టుబడులు పెట్టండి: జైట్లీ
ఆహార రంగంలో అంతర్జాతీయ కంపెనీలతో పాటు భారత కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాలని సదస్సులో పాల్గొన్న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోరారు. ఈ రంగం ప్రాధాన్య స్థాయిని సాధించేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.  వ్యవసాయ ఉత్పత్తిని పెంచాల్సి ఉందని, నిల్వ సదుపాయాలను, ప్రాసెస్‌ వసతులను కూడా మెరుగుపరచాల్సి ఉందని అంగీకరించారు. ప్రస్తుత వసతులు భవిష్యత్తు డిమాండ్‌ను తీర్చే స్థాయిలో లేవన్నారు. 2017లో భారత్‌ ఎక్కడుందన్నది కాకుండా, 2040, 2050లో ఎక్కడ ఉంటుందో చూసేవారే తెలివైన ఇన్వెస్టర్‌గా జైట్లీ  అభివర్ణించారు. ఆర్థికంగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top