ఫలితాలు, గణాంకాలపై దృష్టి!

Earnings, rupee, global trend to drive stock markets this week - Sakshi

ఈవారంలోనే కీలక గణాంకాల వెల్లడి

బుధవారం.. సెప్టెంబర్‌ ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా

గురువారం... నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు 

శుక్రవారం అమెరికా నిరుద్యోగ గణాంకాలు

796 బీఎస్‌ఈ కంపెనీల క్యూ2 ఫలితాలు ఈవారంలోనే

రూపాయి కదలికలు కీలకం..!

ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, కొనసాగుతున్న జూలై–సెప్టెంబర్‌ (క్యూ2) ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదుడుకుల ప్రభావం కూడా మన మార్కెట్ల దిశను నిర్థేశించనున్నట్లు భావిస్తున్నారు.

గడిచిన రెండు నెలలుగా కరెక్షన్‌ చూస్తోన్న సూచీలు.. ఫలితాల సీజన్‌ కావడం చేత కొంత రిలీఫ్‌ను చూసే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. గ్లోబల్‌ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగితే మాత్రం ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలైన బంగారం, బాండ్ల వైపునకు మళ్లే అవకాశం సైతం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.    

దాదాపు 800 బీఎస్‌ఈ కంపెనీల క్యూ2 ఫలితాలు..
ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండగా, ఈ వారంలో వెలువడనున్న ఫలితాలు మాత్రం ఆశాజనకంగానే ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితాలను ప్రకటించనున్న కీలక కంపెనీల జాబితా విషయానికి వస్తే.. సోమవారం (29న) బీపీసీఎల్, కోల్గేట్‌–పామోలివ్‌ (ఇండియా), టాటా పవర్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు ఫలితాలను ప్రకటించనున్నాయి

. మంగళవారం (30న) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టెక్‌ మహీంద్ర.. బుధవారం (31న) అదానీ పవర్, డాబర్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్, వేదాంతాలు ఫలితాలను వెల్లడించనున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌పీసీఎల్,  ఎస్కార్ట్స్, సెయిల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, ఎన్‌టీపీసీ, హిందాల్కో, లుపిన్,  ఫలితాలు కూడా ఇదే వారంలో వెల్లడికానున్నాయి.  

ఆటో గణాంకాలు...
అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఆటో రంగ అమ్మకాల గణాంకాలు గురువారం వెల్లడికానున్నాయి. పెరిగిన ముడిచమురు ధరలు, కేరళ వరదల కారణంగా అంతకుముందు నెలలో నిరాశపరిచినప్పటికీ.. పండుగల సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో అక్టోబర్‌ అమ్మకాలు ఆశాజనకంగా ఉండేందుకు అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఇక ఇదే వారంలో అక్టోబర్‌ తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) సమాచారం, సెప్టెంబర్‌ మౌళిక సదుపాయాల నిర్మాణ డేటా, సెప్టెంబర్‌ ద్రవ్యలోటు సమాచారం వెల్లడికానున్నాయి. ఈ డేటా ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్‌ ఉండనుందని ఎపిక్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు ముస్తఫా నదీమ్‌ అన్నారు. శుక్రవారం వెల్లడికానున్న అమెరికా నిరుద్యోగ గణాంకాలు సైతం ప్రభావం చూపనున్నాయని ఎమ్కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ రీసెర్చ్‌ జోసెఫ్‌ థామస్‌ వ్యాఖ్యానించారు.

క్రూడ్‌ ధరలు కీలకం..!
గడిచిన వారంలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇదే ట్రెండ్‌ కొనసాగితే మాత్రం మార్కెట్లకు పాజిటివ్‌ కానుంద ని.. లేదంటే, రూపాయి విలువపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించి మార్కెట్‌ దిశపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  

ఎఫ్‌పీఐల అమ్మకాల వెల్లువ 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈనెలలో ఇప్పటివరకు రూ.35,593 కోట్లను భారత మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. అక్టోబర్‌ 1–26 కాలంలో రూ.24,186 కోట్లను ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్న వీరు.. రూ.11,407 కోట్లను డెట్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top