బ్యాంకుల్లో డబ్బుకు భరోసా లేదా?

Do not get money in banks? - Sakshi

మోదీ సర్కారు కొత్త అస్త్రం ఎఫ్‌ఆర్‌డీఐ

ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదానికి కసరత్తు

ఇబ్బందుల్లో కూరుకునే బ్యాంకుల కోసం ‘బెయిల్‌ ఇన్‌’

తమ డిపాజిటర్ల సొమ్మును ఉంచేసుకునే హక్కు వాటికే

‘టర్మ్‌’ డిపాజిట్ల కాలాన్ని కూడా అవి మార్చేసుకోవచ్చు

డిపాజిట్లు, సేవింగ్స్‌ సొమ్ముకు బదులు షేర్లూ ఇవ్వొచ్చు

ఇదే జరిగితే సామాన్యుల సొమ్ముకు భద్రత లేనట్టే

డిపాజిట్లకు రూ.లక్ష వరకూ ఉన్న బీమానూ ఎత్తేసే యోచన

జనం ఆందోళన; ఆన్‌లైన్లో పిటిషన్‌కు భారీ మద్దతు

భయపడాల్సిన అవసరం లేదు: ఆర్థిక శాఖ  

తెలుగు రాష్ట్రాల్లో అదో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు. దక్షిణాదిన అదొక ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకు. గురువారం ఉదయం ఓ 65 ఏళ్ల పెద్దాయన కంగారుగా అక్కడికి వచ్చాడు. వృద్ధాప్యంలో వడ్డీ ఆదాయం కోసం బ్యాంకులో ఉంచిన రూ.3 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను క్యాన్సిల్‌ చేసి తన డబ్బులు వెనక్కిచ్చేయమని సిబ్బందిని కోరాడు. మెచ్యూరిటీకి ముందే ఎందుకు రద్దు చేసుకుంటున్నారని ఆ బ్యాంకు ఉద్యోగి అడగ్గా... ‘‘బ్యాంకు దివాలా తీస్తే నా డబ్బులు ఎవరు ఇస్తారు? అందుకే ఇంకో క్షణం కూడా నా డబ్బులు బ్యాంకులో ఉంచదలుచుకోలేదు’’ అని చెప్పారాయన. మోదీ సర్కారు బ్యాంకుల కోసం తీసుకొస్తున్న ఎఫ్‌ఆర్‌డీఐ చట్టమే దీనికి అసలు కారణమని అక్కడి సిబ్బందికి అర్థమైంది. చిత్రమేమిటంటే సదరు బ్యాంకు సిబ్బంది కూడా లోపాయకారీగా ఆ పెద్దాయన వద్ద అలాంటి ఆవేదనే వ్యక్తం చేశారు. నిజానికిది ఒక ఉదాహరణ మాత్రమే!!. సామాన్యుల్లో ఇపుడు దీని గురించి ఆందోళన మొదలైంది. బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయమే ఆసరాగా బతికే వృద్ధులకు నిద్ర దూరమవుతోంది. మోదీ సర్కారు బ్యాంకింగ్‌ సంస్కరణల్లో భాగంగా ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లులో ప్రవేశపెట్టిన ‘బెయిల్‌ ఇన్‌’ క్లాజ్‌... మున్ముందు బ్యాంకులపై సామాన్యుల్లో నమ్మకాన్ని ఆవిరి చేస్తుందన్న ఆందోళన ఉంది.

బ్యాంకులకు ఆ‘మోద’యోగ్యమే!!
ఎఫ్‌ఆర్‌డీఐ... బ్యాంకింగ్‌ సంస్కరణల్లో భాగంగా మోదీ సర్కారు తెస్తున్న ఈ బిల్లుకు జూన్‌లో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, ప్రస్తుతం పార్లమెంటు ఆమోదం కోసం వేచి చూస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలనే తలంపుతో కేంద్రం ఉంది. ఇదే కనక పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారితే... మునిగిపోయే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సామాన్యుల డిపాజిట్ల సొమ్ముతో ఒడ్డున పడేసే ప్రయత్నం చేస్తారన్న మాట. అంటే ఖాతాదారులు చేసిన డిపాజిట్లు వెనక్కిరావు. తిరిగి ఆ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే వరకూ సామాన్యులు ఆ డబ్బులపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎంత ప్రాణావసరం వచ్చినా ఆ బ్యాంకు ఆదుకోదు. దీన్నే ‘బెయిల్‌ ఇన్‌’ క్లాజ్‌గా పేర్కొంటున్నారు. దీనికి తోడు బ్యాంకులు దివాలా తీస్తే డిపాజిట్‌ దారులకు కనీసం రూ.లక్ష కాదు కదా రూపాయి కూడా రాదు! ప్రస్తుతం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ చట్టం కింద డిపాజిట్లపై రూ.లక్ష వరకు బీమా రక్షణ ఉంది. బ్యాంకులు చేతులెత్తేస్తే ఈ మేరకైనా దక్కేది. కానీ, మోదీ సర్కారు దీని స్థానంలో కొత్తగా ఎఫ్‌ఆర్‌డీఐని ప్రతిపాదిస్తోంది. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ ఇక చక్రం తిప్పుతుంది. ఓ బ్యాంకు ఆర్థిక సమస్యల్లో కూరుకుంటే దాన్ని చక్కదిద్దేందుకు రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ అవసరమైన అన్ని కఠిన నిర్ణయాలూ తీసుకుంటుంది.

బెయిల్‌ ఇన్‌ అంటే...!!
తాహతుకు మించి భారీగా అప్పులు తీసుకుని, దుబారా వల్లో, వ్యాపారం సరిగా చేయకో, పరిస్థితులు బాగులేకో పలు కంపెనీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. చివరికి వడ్డీ కట్టలేక దివాలా తీస్తున్నాయి. అలాంటి కంపెనీలకిచ్చిన అప్పులకు వడ్డీని మాఫీ చేసో... వారు చెల్లించాల్సిన రుణానికి బదులు వారి కంపెనీల్లో వాటాలు తీసుకునో బ్యాంకులు వారిని ఒడ్డున పడేస్తున్నాయి. అది బెయిలవుట్‌!! మరి ఇలాంటి వారికి అప్పులిచ్చినందుకు భారీగా ఎన్‌పీఏలు పేరుకుని బ్యాంకులు మునిగిపోతే..! అప్పుడు అవి తమను తాము రక్షించుకోవాలి. అదే బెయిల్‌ ఇన్‌.!! అలా రక్షించుకోవటానికి బ్యాంకులు తాము చెల్లించాల్సిన బకాయిలను చెల్లించవు. ఇందులో డిపాజిటర్లు, ఖాతాదారుల సొమ్ము కూడా భాగమే. ఈ సొమ్మును బ్యాంకులు తిరిగి చెల్లించకుండా వాటికి బదులు బాండ్లు, షేర్లు జారీ చేయొచ్చు. నిర్ణీత కాలం తర్వాతే (అది ఎంతన్నది రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ నిర్ణయిస్తుంది) దాన్ని నగదుగా మార్చుకునే వీలుంటుందని ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ సమీర్‌ ఘోష్‌ తెలిపారు. అంతేకాదు!! కొత్త చట్టంలోని నిబంధనల కింద ఏర్పాటైన రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ కష్టాల్లో ఉన్న ఓ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ ఆస్తులను మరో సంస్థలో విలీనం చేసే దిశగా ఆదేశాలు కూడా జారీ చేయగలదు.

విఫల ప్రయోగం అవుతుందా..?
సైప్రస్‌లో ఇప్పటికే ఈ ‘బెయిల్‌ ఇన్‌’ ప్రయోగం జరిగింది. 2012లో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) దీన్ని సూచించింది. అయితే 2013లో సైప్రస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలిపోయింది. అపుడు డిపాజిట్‌ దారులకు చిల్లిగవ్వ కూడా రాలేదు. చివరికి ఇదొక విపత్తుగా మారి 60 శాతం డిపాజిట్‌ దారుల సొమ్మును చట్టబద్ధంగా కొల్లగొట్టినట్టయింది. డెన్మార్క్‌లోనూ 2011లో బెయిల్‌ ఇన్‌ ప్రయోగం జరిగినా... అక్కడ డిపాజిటర్ల హక్కులను కాలరాయలేదు.

ఐఎంఎఫ్‌ ఏం చెబుతోందంటే...
డెన్మార్క్‌లో బెయిల్‌ ఇన్‌ అమలు జరిగినప్పటికీ అదో పద్ధతి ప్రకారం నడిచింది. బెయిలవుట్‌కు బదులు బెయిల్‌ ఇన్‌ ప్రతిపాదించిన ఐఎంఫ్‌... ‘‘దీనికి సమన్వయంతో కూడిన చట్టబద్ధమైన కార్యాచరణ అవసరం. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రజల ప్రయోజనాలు, ప్రైవేటు భాగస్వాముల హక్కుల మధ్య తగినంత సమతుల్యం ఉండాలి’’ అని చెబుతోంది. బెయిల్‌ ఇన్‌ కింద రీక్యాపిటలైజేషన్‌ అన్నది బ్యాంకుల బలోపేతానికేనంటూ ఇన్వెస్టర్లకు సర్ది చెప్పాల్సిన అవసరం ఉందని, లేదంటే బెయిల్‌ ఇన్‌ అనేది బ్యాంకులు అందుబాటులో లేకుండా పోవడంగా మారుతుందని పేర్కొంది.

మోదీ సర్కారు చిత్తశుద్ధికి పరీక్ష
ఈ బిల్లు పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ పరిశీలనలో ఉందని, డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెబుతున్నారు. అలాగే, పీఎస్‌యూ బ్యాంకు డిపాజిటర్లకు ప్రభుత్వం హామీగా ఉంటుందని, ఈ విషయంలో ఆందళన అవసరం లేదన్నది ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ మాట. అయితే, చట్టంలోని వివాదాస్పద నిబంధనలకు మంగళం పాడకుండా, డిపాజిటర్లకు ఏ రూపంలో గ్యారంటీ ఇస్తారన్నది చెప్పకుండా మాటల రూపంలో ఎంత మభ్యపెట్టినా అది సామాన్యులను మోసపుచ్చడమే అవుతుంది. అంతేకాదు... డిపాజిటర్ల హక్కులను రక్షించే విషయమై చట్టంలోనే తగు ఏర్పాట్లు చేయాలన్నది నిపుణుల మాట.

జనం నమ్మకంపై వేటు!
మన దేశంలో మెజారిటీ ప్రజలకు పొదుపు, మదుపు బ్యాంకులే. రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడి పెట్టేందుకు వారి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా సాహసం చేయలేరు. ఇప్పటికీ భారతీయులు దాచుకుంటున్న సొమ్ములో స్టాక్‌ మార్కెట్లలో పెడుతున్నది 5 శాతం కూడా దాటడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ దృష్ట్యా రూ.లక్ష డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ను మరింత పెంచాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి. దాన్ని పట్టించుకోవటం మాట అటుంచి... సంస్కరణల దృష్టితో ఉన్న రక్షణను కూడా తొలగించడానికి కేంద్రం కసరత్తు మొదలెట్టింది. బ్యాంకు  డిపాజిట్లకు రూ.10 లక్షల వరకూ బీమా రక్షణను పెంచాలని ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం స్వయంగా సంస్థ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను కోరడం ప్రస్తావనార్హం.

డిపాజిటర్లకు మరింత రక్షణ..!
‘‘ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు డిపాజిట్‌దారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత నిబంధనలకు మించి వారికి మరింత రక్షణ కల్పిస్తుంది. వారికి ప్రస్తుతమున్న రక్షణలను ఈ బిల్లులో ప్రతికూలంగా ఏమీ మార్చలేదు. బ్యాంకులకు ప్రభుత్వం చేసే ఆర్థిక సాయాన్ని ఇదేమీ పరిమితం చేయడం లేదు. సర్కారీ బ్యాంకులకు అంతర్గతంగా ఉండే ప్రభుత్వ గ్యారంటీకి వచ్చిన ఇబ్బందేమీ లేదు’’ అని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం స్పష్టం చేసింది. మీడియాలో ఎఫ్‌ఆర్‌డీఐపై వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ విధంగా స్పందించింది. దేశీయ బ్యాంకులు తగినంత నిధులతో, పటిష్ట నియంత్రణలు, పర్యవేక్షణ మధ్య కొనసాగుతున్నందున భద్రతకు వచ్చిన ముప్పు ఏమీ లేదని పేర్కొంది. బ్యాంకులు కుప్పకూలకుండా, డిపాజిట్‌ దారుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు అన్ని రకాల విధానపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌ పిటిషన్‌...24 గంటల్లో 40,000 మంది మద్దతు
ఎఫ్‌ఆర్‌డీఐ బల్లుకు వ్యతిరేకంగా దాఖలైన ఓ ఆన్‌లైన్‌ పిటిషన్‌కు భారీ మద్దతు లభిస్తోంది. ‘చేంజ్‌ డాట్‌ ఓఆర్‌జీ’లో ఈ పిటిషన్‌ దాఖలైన 24 గంటల్లోనే 40,000 మందికిపైగా మద్దతు తెలిపారు. 

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top