అంబానీ ఇంట మరో పెళ్లి జంట : వైరల్‌ ఫోటో

Did Anant Ambani - Radhika Merchant Confirm Their Relationship With This Viral Photo? - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మారు మోగుతున్నాయి. త్వరలో తమ పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ,  రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాకు వివాహం జరగబోతుంది. వీరి పెళ్లి తర్వాత, అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ కూడా పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను మనువాడబోతున్నారు. ఒకరి తర్వాత ఒకరి పెళ్లిళ్ల వార్తతో ముఖేష్‌ అంబానీ కుటుంబం ఆశ్చర్యపరిచింది. వెంటవెంటనే వీరి వివాహాలు కూడా నిశ్చయం చేసేసి, గ్రాండ్‌గా పార్టీలు కూడా ఇచ్చింది. తాజాగా ముఖేష్‌ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ ఫోటోతో కన్‌ఫామ్‌ చేసేశారు.

ఆకాశ్-శ్లోకా, ఇషా-ఆనంద్‌ పెళ్లిళ్ల వార్తల అనంతరమే అనంత్‌కు, తన స్నేహితురాలు రాధికా మెర్చంట్‌కు  నిశ్చితార్థమైనట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తలను అంబానీ కుటుంబం ఖండించింది. కానీ తాజాగా వైరల్‌ అవుతున్న ఓ ఫోటో అనంత్‌, రాధికా ఎప్పటి నుంచే డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పకనే చెప్పేస్తోంది. అనంత్‌-రాధికా క్లోజ్‌గా దిగిన ఈ ఫోటో, వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు కన్‌ఫామ్‌ చేసేసింది. ఈ ఫోటోను వారి రిలేషన్‌షిప్‌ను కన్‌ఫామ్‌ చేయడానికే షేర్‌ చేసినట్టు తెలుస్తోంది.
  
సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన పిక్చర్‌లో అనంత్‌, రాధికను పట్టుకుని ఉండగా.. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నవ్వుతున్న దృశ్యాలున్నాయి. అంతేకాక ఇద్దరూ కూడా ఆకుపచ్చ రంగు దుస్తులోనే ఉన్నారు. వెనుకాల అంతా పచ్చదనం పరిమళ్లిలుతోంది. వీరిద్దరూ హాలిడే స్పాట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నట్టు ఉంది. దీంతో సోషల్‌ మీడియా యూజర్లు అనంత్‌-రాధికాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనడానికి ఈ పిక్చర్‌ చాలు అంటున్నారు. వారికి తమ బెస్ట్‌ విషెష్‌ అంటూ శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. 

అంతకముందు ఆకాశ్‌, శ్లోకా ఎంగేజ్‌మెంట్‌ పార్టీలో కూడా కింగ్‌ ఖాన్‌ షారుఖ్‌, అనంత్‌ను తన గర్ల్‌ఫ్రెండ్‌ విషయంలో టీజ్‌ చేశారు. ఒకవేళ అనంత్‌ కూడా రిలేషన్‌షిప్‌లో ఉంటే, ఇంకేముంది ముఖేష్‌ అంబానీ ఇంట్లో ఆకాశ్‌-శ్లోకా, ఇషా-ఆనంద్‌ పెళ్లిళ్ల అనంతరం వెంటనే అనంత్‌ అంబానీ వివాహం కూడా జరుగనుంది. రాధికా మెర్చంట్‌.. యాంకర్‌ హెల్త్‌కేర్‌ సీఈవో, వైస్‌ చైర్మన్‌ విరైన్‌ మెర్చంట్‌ కూతురు. అనంత్‌-రాధికలు కూడా ఆకాశ్‌-‍శ్లోకా, ఇషా-ఆనంద్‌ల మాదిరి ఎప్పటి నుంచో స్నేహితులు. అయితే ఇప్పటికైతే అధికారికంగా వీరి నిశ్చితార్థం ఇంకా జరుగలేదు. త్వరలోనే వీరి వివాహాన్ని కూడా అంబానీ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top