నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?

dhirendra Kumar Expert Advice On SIP - Sakshi

నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో సుందరమ్‌ రూరల్‌ అండ్‌ కంజప్షన్‌ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌–క్యాప్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్, ఎల్‌ అండ్‌ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్‌లు ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో 2017 నుంచి సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్‌ నష్టాలు చూపడంతో 2018లో సిప్‌లు ఆపేశాను. ఈ ఏడాది కూడా ఈ ఫండ్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? లేకుంటే నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌కు మళ్లించమంటారా ?  
–కళ్యాణి, విజయవాడ  
మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నవన్నీ మంచి ఫండ్సే, పైగా ఇది మంచి కాంబినేషన్‌ కూడా. ఒక్కొక్క ఫండ్‌ది ఒక్కొక్క ప్రత్యేకమైన థీమ్‌. సుందరమ్‌ రూరల్‌ అండ్‌ కంజప్షన్‌ ఫండ్‌.. ప్రామిసింగ్‌ సెక్టోరియల్‌ ఫండ్‌. సాధారణంగా సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవద్దని చెప్తుంటాను. కానీ  సుందరమ్‌ ఫండ్‌ దానికి మినహాయింపు. 2017లో మార్కెట్‌ మంచి స్థాయిలో ఉంది. ఇలాంటప్పుడు ఫండ్స్‌ పనితీరు బాగా ఉంటుంది. 2018లో మార్కెట్‌ అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా దాదాపు ఫండ్స్‌ అన్నీ ఆశించిన స్థాయి పనితీరు కనబరచలేకపోయాయి.

ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ  పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్‌ బాగా ఉన్నాయి. వీటన్నింటి పనితీరు పూర్తిగా మార్కెట్‌ పనితీరును బట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు నష్టాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్నా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిప్‌ల రూపంలో కొనసాగించండి. మార్కెట్లో పరిస్థితులు కుదుటపడితే, ఈ ఫండ్స్‌ మీకు లాభాలను చూపిస్తాయి. అసలు సిప్‌ల ద్వారా ఇన్వెస్ట్‌ చేయడానికి ఉన్న పరమార్థం కూడా ఇదే. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడే కాకుండా మార్కెట్‌ పతనబాటలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా ఇన్వెస్ట్‌ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు.

ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్, లిక్విడ్‌ ఫండ్స్‌కు మధ్య తేడా ఏమిటి? వేటిల్లో రాబడులు అధికంగా వస్తాయి.?     –దామోదర్, విశాఖపట్టణం  
ఆల్ట్రా షార్ట్‌ డ్యురేషన్, లిక్విడ్‌ ఫండ్స్‌లు రెండు వేర్వేరు రకాలు. వీటి మధ్య చాలా సన్నని విభజన రేఖ మాత్రమే ఉంటుంది. చట్ట ప్రకారం, లిక్విడ్‌ ఫండ్‌... 91 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది లిక్విడ్‌ ఫండ్‌ మేనేజర్లు 55 రోజుల నుంచి 60 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు మూడు నుంచి ఆరు వారాల మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా–షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఇక తాజా సెబీ నిబంధనల ప్రకారం, లిక్విడ్‌ ఫండ్స్‌ తమ నిధుల్లో కనీసం 20 శాతం వరకూ నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల వంటి లిక్విడ్‌ అసెట్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. డిజైన్‌ పరంగా చూస్తే, ఆల్ట్రా–షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌ కంటే లిక్విడ్‌ ఫండ్స్‌ ఒకింత సురక్షితమనైవని చెప్పవచ్చు. తాజా సెబీ నిబంధనల కారణంగా లిక్విడ్‌ ఫండ్స్‌ మరింత సురక్షితంగా మారాయి. ఆల్ట్రా–షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్స్‌తో పోల్చితే లిక్విడ్‌ ఫండ్స్‌ రాబడులు ఒకింత తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

మదుపు మొదలు పెట్టడానికి ముందుగా మ్యూచువల్‌ ఫండ్స్‌నే పరిగణించాలా? నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయకూడదా?  –అబ్దుల్లా, హైదరాబాద్‌  
మదుపు మొదలు పెట్టడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయాలి. దీర్ఘకాలంలో ఫండ్స్‌ మంచి రాబడులనే ఇస్తాయి. ఇక నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తే, ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. తగిన అనుభవం, అవగాహన లేకపోతే నష్టాలు వస్తాయి. ఇన్వెస్ట్‌ చేయడానికి ఏ షేర్‌ను ఎంచుకోవాలి ? ఆ కంపెనీ ఫండమెంటల్స్‌ ఎలా ఉన్నాయి ? తదితర అంశాలపై సాధారణ ఇన్వెస్టర్‌ కంటే కూడా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌కు అధిక అవగాహన ఉంటుంది. మార్కెట్‌ సంబంధిత సాధనాల్లో గతంలో ఇన్వెస్ట్‌ చేసిన అనుభవం లేకుంటే, ముందుగా మ్యూచువల్‌ ఫండ్స్‌నే ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం పరిగణించండి. మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, ముఖ్యంగా రెండు ప్రయోజనాలు లభిస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్‌ మేనేజర్లు ప్రొఫెషనల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి అనుభవం మంచి ఫలితాలనిస్తుంది.

ఇక రెండవది...మ్యూచువల్‌ ఫండ్స్‌లో చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్‌ చేసే వీలుంటుంది. మీరు కనీసం నెలకు రూ.1,000తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొదలు పెట్టవచ్చు. కనీసం ఐదు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మ్యూచువల్‌ ఫండ్స్‌కు మించిన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం మరొకటి లేదు. ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి. మీకు జీతం పెరిగినా, ఇంక్రిమెంట్‌ వచ్చినా  ఈ పెరిగిన మొత్తంలో కొంత మొత్తాన్ని సిప్‌లకు జత చేయండి. ఒకవేళ మీరు స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేస్తున్నట్లయితే, ఏడాదికి సిప్‌ మొత్తాన్ని కనీసం 5–10 శాతం చొప్పున పెంచండి. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్ల పనితీరును సమీక్షించి, వాటి పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top