వృద్ధి పుంజుకుంటుంది...!

Deutsche Bank report on gdp - Sakshi

2018–19లో 7.5 శాతం వృద్ధి

డాయిష్‌ బ్యాంక్‌ నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌–2019 మార్చి) పుంజుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– డాయిష్‌ బ్యాంక్‌ అంచనావేస్తోంది. వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. సమీప భవిష్యత్తులో రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం  6 శాతం) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచుతుందన్న భయాలనూ డాయిష్‌బ్యాంక్‌ త్రోసిపుచ్చింది. 2018లో ఈ అవకాశాలు లేవని అభిప్రాయపడింది.

ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి పెరిగే అవకాశాలు లేకపోవడమే తన విశ్లేషణకు ఆధారమని వివరించింది. ఇది వృద్ధికి దోహదపడే అంశంగా పేర్కొంది. అయితే  రేటు పెంపు నిర్ణయంవైపు ఆర్‌బీఐ మొగ్గుచూపితే, వృద్ధి ఊహించినదానికన్నా తగ్గుతుందనీ హెచ్చరించింది. సోమవారంనాడు విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...

పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమల్లో ఇబ్బందులు తత్సబంధ అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సవాళ్లు తొలగిపోతాయన్నది ప్రస్తుత విశ్లేషణ.   
అయితే వృద్ధికి కొన్ని అవరోధాలూ ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణి, వర్షపాతం, కనీస మద్దతు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల తీవ్రత వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి.  
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌లో భారత్‌ వృద్ధి మూడేళ్ల కనిష్టస్థాయి 5.7 శాతానికి పడిపోయింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో కొంచెం మెరుగుపడి 6.3 శాతంగా ఉంది.  అయితే డిసెంబర్, మార్చి త్రైమాసికంలో వృద్ధి మరింత పుంజుకుంటుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top