‘పన్ను’కు టైమైంది..

Deadline for Income Tax Return filing extended to August 31 - Sakshi

ఈ నెలాఖరు వరకు ఐటీఆర్‌ దాఖలు గడువు

ఒక నెలపాటు పొడిగించిన కేంద్రం

గడువులోపు దాఖలుతో జరిమానాల భారం లేదు

ఆదాయంలో ఎన్నో భాగాలు

కొన్నింటిపైనే పన్ను

మినహాయింపులు పోను మిగతా ఆదాయంపై పన్ను

ఆన్‌లైన్‌లోనే సులభంగా రిటర్నులు దాఖలు

అందరికీ ఒకటే ఫామ్‌ కాదు

ఒక్కో వర్గానికి ఒక్కోరకమైన ఐటీఆర్‌

గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్‌ చివరి వరకు గడువును పొడిగించింది. దీంతో ఈ నెల చివరి వరకు అవకాశం లభించినట్టు అయింది. కనుక వెంటనే ఐటీఆర్‌ దాఖలును ప్రారంభించడం మంచిది. బేసిక్‌ పన్ను మినహాయింపు అయిన రూ.2.5 లక్షలు (60 ఏళ్లు దాటిన వారికి రూ.3 లక్షలు) దాటి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ నిబంధనల మేరకు ఐటీఆర్‌ తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్‌ దాఖలు చేయాలంటే, అందులో ఉండే పన్ను అంశాలు, వాటికి సంబంధించి ఇవ్వాల్సిన వివరాలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. అంతేకాదు అందరికీ ఒకటే ఐటీఆర్‌ వర్తించదు. వేతన జీవులు, వ్యాపారులు, ఉమ్మడి కుటుంబాల వారు... ఇలా వారి ఆదాయ మార్గాలను బట్టి ఐటీఆర్‌ కూడా మారిపోతుంది. కనుక ఐటీఆర్‌ ప్రక్రియ గురించి అవగాహన కలిగి ఉంటే, సులభంగా దాఖలు చేయవచ్చు. ఆ వివరాలే ఈవారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం...

గడువులోపు ఐటీఆర్‌ దాఖలు అన్నది మంచి చర్య అవుతుంది. లేదంటే పెనాల్టీలు, ఇతర వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐటీఆర్‌ దాఖలు కోసం ముందుగా మీరు మీ ఆదాయ వనరులు అన్నింటిపై అవగాహన కలిగి ఉండాలి. వేతనం, ఇంటి అద్దె, ఏవైనా రాయల్టీలు (ప్రతిఫలాలు) ఇలా అన్ని ఆదాయ వనరుల సమాచారం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయంలో దేనిపై పన్ను వర్తిస్తుందన్నది తెలుసుకోవాలి. ఆదాయపన్ను అన్నది బేసిక్‌ శాలరీ, కరువుభత్యం (డీఏ), బోనస్‌లపై అమలవుతుంది.

సొంతిల్లు ఉండి, అందులో మీరు నివసిస్తుంటే తప్ప ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పన్ను పరిధిలోకి రాదు. ఇక ఆదాయంలో పన్ను మినహాయింపులు వేటికన్నది గుర్తించాల్సి ఉంటుంది. సేవింగ్స్‌ పథకాలు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్‌ వంటివన్నీ సెక్షన్‌ 80సీ కింద మినహాయింపులోకి వస్తాయి. పన్ను వర్తించే ఆదాయం అన్నది స్థూల ఆదాయంలో ఒక భాగం కాగా, మిగిలినది మినహాయింపులకు అర్హమైనది. పన్ను వర్తించే ఆదాయంపై పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా పన్ను ఆదాయం ఉన్న వారి వేతనం నుంచి టీడీఎస్‌ను సంస్థలు మినహాయిస్తుంటాయి. ఈ వివరాలను ఫామ్‌–16 రూపంలో సంస్థ నుంచి పొందొచ్చు. ఐటీ చట్టం ప్రకారం పలు రకాల పన్ను శ్లాబులు ఉన్నాయి. మీకు పన్ను వర్తించే ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, అందులో వర్తించే రేటు మేరకు పన్ను చెల్లించాలి. ఐటీఆర్‌లో అన్ని వివరాలు పొందుపరిచి మినహాయింపుల ఆదాయం పోను మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించిన తర్వాత... ఏవైనా వ్యత్యాసం ఉంటే.. ఆ మేరకు పన్ను చెల్లింపుదారుడు రిఫండ్‌ కోరొచ్చు. తనే అదనంగా చెల్లించాల్సి ఉంటే పన్ను కట్టాల్సి ఉంటుంది.  

ఆదాయ వనరులు...
మీరు ఉద్యోగి అయితే, నెలవారీ ఆదాయం లేదా వార్షికాదాయంతోపాటు.. ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం (అంటే ఇంటిపై అద్దె, ఉన్న ఆస్తిని విక్రయించగా వచ్చిన ఆదాయం వంటివి). పన్ను పరంగా అన్ని రకాల ఆదాయం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం కిందకు వస్తుంది. బేసిక్‌ సాలరీ, బోనస్‌లు, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, ఇతర అలవెన్స్‌ను వేతనంలో భాగంగా పొందుతుంటే అది పన్ను వర్తించే ఆదాయమే. అలాగే, ఇంటిపై వచ్చే ఆదాయంపైనా పన్ను ఉంటుంది. ఏదైనా ఆస్తిని విక్రయించగా వచ్చిన మూలధన లాభం లేదా నష్టం. వ్యాపారంపై వచ్చే ఆదాయం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్, సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాపై వడ్డీ ఆదాయం, గిఫ్ట్, కుటుంబ పెన్షన్‌ను సైతం ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది.  

మినహాయింపులు...  
ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు ఆదాయంలో కొంత వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి. సెక్షన్‌ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. పెన్షన్‌ ప్లాన్లు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులు, పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజు చెల్లింపులు ఈ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అర్హమైనవి. అందుబాటులో ఉన్న సాధనాల్లో మీకు అనుకూలమైన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఈ మేరకు ఆదాయంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. కాకపోతే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ చేసుకోవడం సౌకర్యవంతం.
 
ఇవి కాకుండా ఇతర పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలు (ప్రిన్సిపల్‌) మొత్తంపై సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితి మేరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్‌ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఇక మొదటి సారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్‌ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాపై వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలకు (హెచ్‌యూఎఫ్‌) సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్‌ 80సీసీజీ ఈక్విటీ సేవింగ్‌ స్కీమ్‌లో పెట్టుబడులపై 50 శాతం, గరిష్టంగా 25,000కు... దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా బాండ్లలో రూ.20,000 పెట్టుబడులకు సెక్షన్‌ 80సీసీఎఫ్‌ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. సెక్షన్‌ 80డీ కింద వ్యక్తులు అయితే రూ.25,000 వరకు హెల్త్‌ ప్రీమియంపై, వృద్ధులకు రూ.30,000 ప్రీమియంకు పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్‌ 80ఈ కింద విద్యా రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు పరిమితి లేకుండా ప్రయోజనం పొందొచ్చు.

ఐటీఆర్‌ దాఖలు ఇలా...
అన్ని వివరాలపై అవగాహన తెచ్చుకున్న తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేయడం ద్వారా సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో స్వయంగా ఐటీఆర్‌ దాఖలు చేయడం లేదంటే నిపుణుల సాయం తీసుకోవచ్చు. మీ సమక్షంలో వారు ఐటీఆర్‌ దాఖలు చేస్తారు. ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం సహజ్‌ను పొందొచ్చు. ఆదాయపన్ను ఈఫైలింగ్‌ వెబ్‌పోర్టల్‌లో తమ పేరిట అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుంటే, ఆన్‌లైన్‌లోనే ఈ ఫామ్‌ను పూర్తి చేసి దాఖలు చేయవచ్చు. ఇలా రిటర్నులు దాఖలు చేసే ముందు ఆదాయం, పెట్టుబడుల వివరాలను, సంబంధిత డాక్యుమెంట్లను, ఫామ్‌ 16ను రెడీగా ఉంచుకోవాలి. రిటర్నుల సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ఐటీఆర్‌ దాఖలును సులభంగా పూర్తి చేయవచ్చు.

ఆన్‌లైన్‌ టూల్‌ను గతంలో వినియోగించినట్టయితే, లాగిన్‌ అయి ప్రీఫిల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా ఇతర వివరాలను నమోదు చేసి దాఖలు ప్రక్రియను పూర్తి చేయడం సులభం. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీపై పన్ను చెల్లింపు బాధ్యత ఎంతన్నది లెక్కించుకోవాలి. అంతిమంగా చెల్లించాల్సిన పన్ను, అప్పటికే టీడీఎస్‌ రూపంలో చెల్లించినది పోను మిగిలిన మేర చెల్లించాలి. ఐటీఆర్‌ను దాఖలు చేసిన తర్వాత ఐటీఆర్‌–వీ ఫామ్‌ అన్నది జనరేట్‌ అవుతుంది. దీనిపై డిజిటల్‌గా సంతకం చేసుకునే ఆప్షన్‌ను ఎంచుకుని ఐటీఆర్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. లేదంటే ఐటీఆర్‌–వీ పత్రాన్ని ప్రింట్‌ తీసుకుని, సంతకం చేసి, ఐటీ కార్యాలయానికి పోస్ట్‌ ద్వారా పంపుకోవచ్చు.

ఎవరు.. ఏ ఫారం దాఖలు చేయాలి..
ఒక వ్యక్తి ఏయే ఫారంల ద్వారా రిటర్నులు దాఖలు చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. గతంలో వేతన జీవులకొక ఫారం, ఇతరులకొక ఫారం అంటూ రెండే ఉండేవి. కాలక్రమంలో ఎన్నో మార్పు.. ఎన్నో ఫారాలు.. మొత్తం వాడుకలో ఉన్న ఏడు ఫారాలలో నాలుగు ఫారాలు వ్యక్తులకు వర్తిస్తాయి. వివరాల్లోకి వెళితే..  
ప్రస్తుతం ప్రీఫిల్డ్‌ ఫారాలు అమల్లో ఉన్నాయి. ఐటీ సైట్‌లోకి వెళ్లి  my account ఆప్షన్‌లోకి వెడితే.. Prefilled XML ఉంటుంది. ఫారం 26 A లోని వివరాలు కనిపిస్తాయి. జీతం, పెన్షన్, వడ్డీ.. తదితరసమాచారం ఇందులో ఉంటుంది. ఐటీ ట్యాక్స్‌ వివరాలు ఉంటాయి.

ఐటీఆర్‌1
వ్యక్తులు.. రెసిడెంట్‌ అయి ఉండి, నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటని వారు ఈ ఫారం వేయాల్సి ఉంటుంది. విదేశీ ఆదాయం ఉండకూడదు. ఏదేని సంస్థలో డైరెక్టర్‌ అయి ఉండకూడదు. వ్యాపారం, క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉండకూడదు. ఏ వనరు ద్వారా కూడా నష్టం ఉండకూడదు. ఒక ఇంటి నుంచే ఆదాయం ఉండాలి. మరో విధంగా చెప్పాలంటే.. కేవలం జీతం, వడ్డీ, ఒక ఇంటి మీద ఆదాయం (నష్టం కాదు) ఉన్న వారు ఈ ఫారం దాఖలు చేయాలి. వ్యవసాయం మీద ఆదాయం, డివిడెండ్లు రూ. 5,000 దాటకపోతే కూడా వేయొచ్చు.  

ఐటీఆర్‌ 2
వ్యక్తులు మరియు ఉమ్మడి కుటుంబాలు ఈ ఫారం దాఖలు చేయొచ్చు. జీతం, ఇంటి మీద ఆదాయం (నష్టం ఉన్నా ఫర్వాలేదు), ఇతర ఆదాయాలు, క్యాపిటల్‌ గెయిన్స్‌ ఉన్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. నాన్‌ రెసిడెంట్లు కూడా ఈ ఫారం వేయొచ్చు. అయితే, వారు తమ ట్యాక్స్‌ ఐడెంటిటీ నంబరు ఇవ్వాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటిన వారు దీన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వివరాలు, షేర్లు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, పెయింటింగ్, కళాత్మక వస్తువులు, బ్యాంకు డిపాజిట్లు, ఇన్సూరెన్స్‌ పాలసీలు, రావల్సిన అప్పులు, నగదు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చాలి. ఆస్తులను కొన్న ధర చూపాలే తప్ప ప్రస్తుత మార్కెట్‌ విలువ కాదు. నష్టం, సర్దుబాటు చూపొచ్చు.  

ఐటీఆర్‌ 3
ట్యాక్స్‌ క్రెడిట్‌ పరిధిలోకి రానివారు, పలు వనరుల నుంచి ఆదాయం ఉన్నవారు.. అంటే జీతం, ఇంటద్దె, క్యాపిటల్‌ గెయిన్స్, ఇతరత్రా వ్యాపారం.. వృత్తిగత ఆదాయాలు ఉన్నవారు దీన్ని దాఖలు చేయొచ్చు. ఇది పెద్ద ఫారం. చాలా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నాన్‌ రెసిడెంట్లు, వ్యక్తులు, ఉమ్మడి కుటుంబాలు దీన్ని వేయొచ్చు. ఆస్తులు.. అప్పుల పట్టీ, స్థూల ఆదాయం, ఖర్చుల వివరాలు, నగదు, బ్యాంకు నిల్వల వివరాలు ఇందులో పొందుపర్చాలి.  

ఐటీఆర్‌ 4
ఇది రెసిడెంట్లు మాత్రమే ఉపయోగించగలిగే ఫారం. వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు దీన్ని దాఖలు చేయొచ్చు. వ్యాపారం మీద స్థూల ఆదాయం/టర్నోవరు రూ. 2 కోట్లు దాటకూడదు. వృత్తి నిపుణుల స్థూల ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు. ఒక ఇంటి మీద మాత్రమే ఆదాయం ఉండాలి. నికర ఆదాయం రూ. 50 లక్షలు దాటకూడదు. ఊహాజనిత ఆదాయాలున్న వారు దీన్ని వేయొచ్చు. ఈ ఫారాన్ని ఒకసారి వేస్తే.. వరుసగా అయిదేళ్ల పాటు ఇదే ఫారం దాఖలు చేయడం కొనసాగించాల్సి ఉంటుంది. ఏదైనా కారణం వల్ల ఫారం 3 వేస్తే రాబోయే అయిదు సంవత్సరాలు కూడా ఫారం 3 మాత్రమే వేయాల్సి ఉంటుంది.

ఇంకా సందేహాలు ఉంటే వృత్తి నిపుణులను సంప్రతించండి. ఐటీ రిటర్నులను మీరే స్వయంగా దాఖలు చేసుకోవచ్చు. అయితే, ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తప్పులు చేయొద్దు. ఆదాయాన్ని చూపించడం మానొద్దు. లేకపోతే 50–200% దాకా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

ట్యాక్సేషన్‌ నిపుణులు

కె.సీహెచ్‌. ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి,  కె.వి.ఎన్‌ లావణ్య

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top