జీఎస్‌టీతో నిర్మాణ వ్యయం తగ్గింది!

Construction cost with GST - Sakshi

రెరాతో రియల్టీలో పారదర్శకత;  విక్రయాల వృద్ధి 

2020 నాటికి 180 బిలియన్‌  డాలర్లకు పరిశ్రమ 

 క్రెడాయ్, జేఎల్‌ఎల్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)తో నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గిందని.. ఇది సుమారు 3–4 శాతం వరకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌), జోన్స్‌ లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) సంయుక్త నివేదిక తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో స్థిరాస్తి రంగంలో డెవలపర్లు, కొనుగోలుదారులకు మధ్య నమ్మకం, పారదర్శకత పెరిగిందని.. దీంతో విక్రయాలు వృద్ధి చెందాయని నివేదిక పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన క్రెడాయ్‌ కాన్‌క్లేవ్‌లో ఈ నివేదికను విడుదల చేశారు. 2015 నాటికి 126 బిలియన్‌ డాలర్లుగా దేశీయ రియల్టీ పరిశ్రమ 2020 నాటికి 180 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. వేగవంతమైన పట్టణీకరణ, ఆదాయాల వృద్ధి, అందుబాటు గృహాలకు డిమాండ్, నియంత్రణ సంస్కరణల వంటివి ఈ వృద్ధికి కారణమని తెలిపింది. 

గృహాల్లో రూ.59 వేల కోట్ల పెట్టుబడులు: 2014 నుంచి నివాస సముదాయంలో రూ.59 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రియల్టీ పెట్టుబడుల్లో 47 శాతం ఈ విభాగంలోనే ఉన్నాయి. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నివాస సముదాయం 5–6 శాతం వాటాను కలిగి ఉందని.. 2020 నాటికిది 11 శాతానికి చేరుతుందని రిపోర్ట్‌ అంచనా వేసింది. రియల్టీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనల సడలింపు పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఏడాది కాలంలో ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు, డెటిట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో 79 పీఈ లావాదేవీలు జరిగాయని జేఎల్‌ఎల్‌ ఇండియా హెడ్‌ రమేష్‌ నాయర్‌ తెలిపారు. సమీప భవిష్యత్తులో అందుబాటు గృహాలు, గిడ్డంగుల విభాగం మరిన్ని పెట్టుబడులు ఆకర్షిస్తాయని అంచనా వేశారు. దేశంలోని 8 ప్రధాన నగరాలతో పాటూ నాగ్‌పూర్, కోచి, చండీఘడ్, పాట్నా వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని తెలియజేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top