ఆరు రోజుల పతనం ఆగింది

Closing bell: Sensex, Nifty snap six-day losing streak - Sakshi

కొనసాగిన రూపాయి క్షీణత

వేల్యూ బయింగ్‌తో స్టాక్‌ సూచీలకు లాభాలు

225 పాయింట్లు పెరిగి 38,243కు సెన్సెక్స్‌

60 పాయింట్లు ఎగసి 11,537కు నిఫ్టీ

ఆరు రోజుల నష్టాలకు గురువారం బ్రేక్‌ పడింది. రూపాయితో డాలర్‌ మారకం ఇంట్రాడేలో మరో జీవిత కాల కనిష్ట స్థాయి, 72ను తాకినా స్టాక్‌ సూచీలు భారీ లాభాలు సాధించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,500 పాయింట్ల పైకి ఎగబాకింది. గత ఆరు రోజుల పతనం కారణంగా ధరలు తగ్గి, ఆకర్షణీయంగా ఉన్న ఇంధన, విద్యుత్తు, ఇతర రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం లాభాలు సాధించడం దీనికి ప్రధాన కారణాలు. ట్రేడింగ్‌ చివర్లో వేల్యూ బయింగ్‌ కొనుగోళ్లు జోరుగా జరిగాయి. బలహీనంగా ఆరంభమైన యూరప్‌ మార్కెట్లు ఆ తర్వాత పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 225 పాయింట్లు పెరిగి 38,243 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 11,537 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఫార్మా, ఎనర్జీ, మౌలిక, రియల్టీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడ్డాయి.   

సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రూపాయి పతనంతో ఈ లాభాలను కోల్పోయింది. 106 పాయింట్లు నష్టపోయి 37,913 పాయింట్ల వద్ద ఇంట్రాడే  కనిష్టాన్ని తాకింది. ఇంట్రాడేలో రూపాయి రివకరీ కావడం, ఇటీవల పతనమైన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మళ్లీ పుంజుకుంది. 303 పాయింట్ల లాభంతో 38,321 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మొత్తం మీద రోజంతా 409 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 41 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 85 పాయింట్లు పెరిగింది.  

మార్కెట్లో అప్రమత్త వాతావరణం... 
అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, కరెన్సీ పతనం కారణంగా గత ఆరు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లలో ర్యాలీ కారణంగా మార్కెట్‌ కోలుకుందని వివరించారు. రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయి, 72ను తాకడం, ముడి చమురు ధరలు మండుతుండటం, అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదురుతుండటం వంటి కారణాల వల్ల మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నదని వివరించారు.  

►రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.8 శాతం లాభంతో రూ.1,260 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌ మొత్తం 225 పాయింట్ల లాభంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ వాటా సగం(112 పాయింట్లు) వరకూ ఉండటం విశేషం. అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, సీఎల్‌ఎస్‌ఏ.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను కొనసాగించడం, టార్గెట్‌ ధరను రూ.1,500 కు పెంచడం సానుకూల ప్రభావం చూపించాయి.  
►అమెరికాలో శాండోజ్‌ జనరిక్స్‌ వ్యాపారా న్ని కొనుగోలు చేయడంతో అరబిందో ఫా ర్మా షేర్‌ 9 శాతం ఎగసి రూ.759 వద్ద ము గిసింది. రూపాయి పతనం కారణంగా ఇత ర ఫార్మా షేర్లు కూడా లాభపడ్డాయి. సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌ ఫార్మాలు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకగా, బయోకాన్, దివిస్‌ ల్యాబొరేటరీస్, క్యాడిలా హెల్త్‌కేర్, సిప్లా షేర్లు 2–4 శాతం రేంజ్‌లో పెరిగాయి.  

►స్టాక్‌ సూచీలు మంచి లాభాలు సాధించినప్పటికీ, పలు షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐడియా, ఇండిగో, భారతీ ఇన్‌ఫ్రాటెల్, సింఫనీ, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

►మహారాష్ట్ర, ఉత్తరఖండ్‌ల్లో నిర్మాణాలపై ఆంక్షలు సుప్రీం కోర్ట్‌ తొలగించడంతో సిమెంట్, రియల్టీ షేర్లు ర్యాలీ జరిపాయి.  

►రూ.1,500–2,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్తల కారణంగా అనిల్‌ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 9 శాతం వరకూ లాభపడింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top