మద్దతిస్తాం.. ఆదుకుంటాం

Central government is ensuring 11 government banks - Sakshi

11 ప్రభుత్వ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం భరోసా 

బ్యాంకుల చీఫ్‌లతో ఆర్థిక మంత్రి గోయెల్‌ భేటీ 

దిద్దుబాటు చర్యలపై సమీక్ష 

న్యూఢిల్లీ: కుంభకోణాలు, మొండిబాకీల సమస్యతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీసీబీ) పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్రం పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన ఆంక్షల నుంచి వీలైనంత త్వరగా బైటపడేందుకు కావాల్సిన తోడ్పాటు అందిస్తామని భరోసానిచ్చింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి హోదాలో పియుష్‌ గోయెల్‌ గురువారం ..  సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) కింద ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 పీసీబీల చీఫ్‌లతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు హామీ ఇచ్చారు. పీసీఏ నుంచి బైటపడేందుకు ఆయా బ్యాంకులు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మూత్రపిండాల మార్పిడి చికిత్స నుంచి కోలుకునేదాకా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖ మంత్రి గోయెల్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ‘పీసీఏ ఆంక్షల నుంచి సాధ్యమైనంత త్వరగా బైటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన తోడ్పాటును అందిస్తుంది‘ అని సమావేశం అనంతరం విలేకరులకు ఆయన చెప్పారు. గడిచిన 12–13 ఏళ్లలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలుసుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడిందని అని గోయెల్‌ పేర్కొన్నారు.  

బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దుతాం.. 
ఆర్‌బీఐ విధించిన పీసీఏ ఆంక్షల కారణంగా ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న నికర నిరర్థక రుణాల (ఎన్‌పీఏ) నిష్పత్తి, ప్రొవిజనింగ్‌ భారం మరింత పెరిగి కొంత కాలం పాటు బ్యాంకుల లాభదాయకత దెబ్బతింటుంది కానీ.. దీర్ఘకాలికంగా మాత్రం బాకీల ప్రక్షాళనతో బ్యాంకింగ్‌ రంగానికి మేలు జరుగుతుందని గోయెల్‌ చెప్పారు. గతంలో విచక్షణారహితంగా ఇచ్చిన రుణాలు బ్యాంకింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి కారణమయ్యాయన్నారు. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యలు సరిదిద్ది, బ్యాంకింగ్‌ వ్యవస్థను గాడిలో పెడతామని మంత్రి చెప్పారు. బ్యాంకింగ్‌ రంగం ఒక క్రమపద్ధతిలో వృద్ధి చెందేలా చూస్తామని, ప్రజలు ఆశించేటువంటి రీతిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యంత జవాబుదారీతనంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  

పీసీఏ ఆంక్షలున్న బ్యాంకులివీ.. 
పీసీఏ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల జాబితాలో.. దేనా బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేషన్‌ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. పీసీఏ పరిధిలో ఉన్న బ్యాంకులు.. కొత్తగా శాఖలను విస్తరించకుండా, కొత్తగా సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, మొండిబాకీలకు మరింత అధికంగా కేటాయింపులు జరపాల్సి వచ్చేలా పలు ఆంక్షలు ఉంటాయి. మేనేజ్‌మెంట్, డైరెక్టర్ల జీతభత్యాలపైనా పరిమితులు ఉంటాయి. నాలుగో త్రైమాసికానికి సంబంధించి ఇప్పటిదాకా ఆర్థిక ఫలితాలు వెల్లడించిన పది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎనిమిది బ్యాంకులు ఏకంగా రూ. 40 వేల కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. వీటిని గట్టెక్కించడానికి గత ఆర్థిక సంవత్సరం ఆఖర్లో ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంలో ఇది దాదాపు సగం కావడం గమనార్హం. ప్రధానంగా ఇన్‌ఫ్రా, విద్యుత్, టెలికం తదితర రంగాలకు ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారడం, వాటికి అధిక ప్రొవిజనింగ్‌ చేయాల్సి రావడం, కుంభకోణాలు తదితర సమస్యలే ఈ నష్టాలకు కారణం. 

పీఎన్‌బీకి సెబీ హెచ్చరిక 
ముంబై: నీరవ్‌ మోదీ కుంభకోణం వివరాలు  వెల్లడించడంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) జాప్యం చేయడాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీవ్రంగా పరిగణించింది. ఇ లాంటి ఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించింది. సెబీ ఈ మేరకు వార్నింగ్‌ లెటర్‌ పంపినట్లు పీఎన్‌బీ తెలిపింది. ‘నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలాం టివి మళ్లీ జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ, ఇకపైనైనా లిస్టింగ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నాం‘ అని సెబీ పేర్కొంది. స్కామ్‌పై  ఆర్‌బీఐ, సీబీఐకి ఫిర్యాదులు, నివేదికలు ఇచ్చిన 1–6 రోజుల తర్వాత గానీ  ఆ వివరాలను స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేయలేదని సెబీ పేర్కొంది. ఈ విషయంలో పీఎన్‌బీ వివిధ నిబంధనలు ఉల్లంఘించిందని ఆక్షేపించింది. పీఎన్‌బీ నుంచి తీసుకున్న లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ ద్వారా మోదీ సంస్థలు దాదాపు రూ. 14 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడటం, ఇటీవలి ఆర్థిక ఫలితాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రికార్డు స్థాయిలో నష్టాలు ప్రకటించడం తెలిసిందే. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top