మళ్లీ పెరిగిన సిమెంటు ధర

మళ్లీ పెరిగిన సిమెంటు ధర

సాక్షి, ఏలూరు: సిమెంటు ధర మళ్లీ ఆకాశాన్నంటింది. ఈనెల 1వ తేదీ నుంచి ఒకే దఫా రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై పెను ప్రభావం పడుతోంది. దీనికి జీఎస్టీ 28 శాతం కలుపుకుని బస్తాపై రూ.39 మేర ధర పెరిగింది. రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుని ఈ ధర మరో రూ.20 పెరగనుంది. పెరిగిన ధర ప్రభావం ఎన్టీఆర్‌ పక్కా గృహాల నిర్మాణంపై చూపనుందని తెలుస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్ధితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

రకరకాల కారణాలతో మందకొడిగా సాగుతున్న నిర్మాణ రంగం, కంపెనీల సిండికేట్‌ మాయాజాలంతో అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ధర పెరగనున్నట్లు విక్రయదార్లకు ఆగస్టు నెలాఖరులోనే సమాచారం ఇచ్చిన కంపెనీలు సెప్టెంబర్‌ 1 నుండి దానిని అమలు చేశాయి. కొన్ని ప్రధాన కంపెనీలు రెండు రోజులు సరఫరా నిలిపివేసి అనంతరం పెరిగిన ధరలతో పునః ప్రారంభించారు. నిర్మాణంలో సూపర్‌ 59 గ్రేడ్‌ సిమెంటుకు అధిక గిరాకీ ఉంది. అయితే దీనిపై ధర పెరిగిన ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ధరలు పెరగక ముందు సూపర్‌ సిమెంటు బస్తా రూ.288 ఉండగా ఇప్పుడు అది రూ.328 అయింది. 53 గ్రేడ్‌ ధర రూ.316 ఉండగా రూ.356కు పెరిగింది. దీనికి ఎగుమతి, దిగుమతి, రవాణా వ్యయం సుమారు రూ.15 నుండి రూ.20 వరకు కలుస్తుంది. 

 

వివిధ బ్రాండ్లను ఆనుసరించి ధర వ్యత్యాసం ఉంటుంది. పక్కా గృహాల నిర్మాణంలో ఉన్న పేదలపై ఈ ధరలు మోయలేని భారంగా మారాయని, సిమెంటు కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఎలా అన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా హౌసింగ్‌ పి.డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యూనిట్‌ ధరలో సిమెంటు బస్తాకు రూ.250 మాత్రమే చెల్లిస్తున్నాం.. పెరిగిన ధరలపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
Back to Top