పాత నోట్ల డిపాజిట్లపై కేంద్రం తాజా నిర్ణయం

పాత నోట్ల డిపాజిట్లపై కేంద్రం తాజా నిర్ణయం

న్యూఢిల్లీ : రద్దయిన నోట్లను డిపాజిట్‌ చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు సూచనలను కేంద్రం తోసిపుచ్చింది. చట్టబద్దత కానీ ఈ నోట్లను డిపాజిట్‌ చేసుకునేందుకు ఎలాంటి అవకాశం కల్పించమని సోమవారం తేల్చిచెప్పింది. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్‌ చేసుకోవడానికి ఆఖరి అవకాశంగా వెసులుబాటు కల్పిస్తే, డీమానిటైజేషన్ అసలైన ఉద్దేశ్యం, నల్లధనానికి వ్యతిరేంగా చేపట్టిన యుద్ధం విషయంలో ఓటమి పాలవుతామని‌ ప్రభుత్వం తెలిపింది. సహేతుక కారణాలు చూపించే వారికి ఫైనల్‌ విండో తెరవాలని ఈ నెల మొదట్లో సుప్రీంకోర్టు, కేంద్రానికి సూచించింది. తగిన కారణాలను చూపించే వ్యక్తులను ఇబ్బంది పెట్టవద్దని కూడా పేర్కొంది.  కానీ ఫైనల్‌ విండో తెరవడానికి కేంద్రం నిరాకరించింది. గతంలో పొడిగించిన గడువులు, పెట్రోల్‌ బంకులు, రైల్వే టిక్కెట్ల బుకింగ్స్‌లో పాత నోట్లకు అనుమతి ఇవ్వడం వంటి వాటిలోనే చాలా దుర్వినియోగాలు తలెత్తాయని, మరోసారి కొత్తగా అవకాశం కల్పిస్తే బినామి లావాదేవీలు పెరిగే అవకాశముందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బోగస్‌ కేసుల నుంచి సహేతుకమైన వాటిని గుర్తించడం కూడా కష్టతరమని పేర్కొంది.  

 

నవంబర్‌ 8న అర్థరాత్రి పెద్ద నోట్లను హఠాత్తుగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, ఈ నోట్ల డిపాజిట్లకు గడువులు కూడా విధించింది. అయితే ప్రభుత్వం కల్పించిన ఈ గడువులు చాలా తక్కువగా ఉన్నాయని, తక్కువ వ్యవధిలోనే దేశంలో కల్లా అత్యధిక మొత్తం కరెన్సీని డిపాజిట్‌ చేయడం కుదరలేదని వాదనలు వినిపించాయి. చాలామంది ఇంకా పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారని కూడా తెలిసింది. మరోవైపు పెద్ద నోట్లను కలిగి ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు రద్దయిన నోట్లను  డిపాజిట్‌ చేసుకునేందుకు ఫైనల్‌గా ఓ సారి ఛాన్స్‌ ఇవ్వాలని ఈ నెల మొదట్లో సూచించింది. 
Back to Top