బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు షాకింగ్‌ న్యూస్‌

BSNL Okays Laying off 54K Staff but Will Wait Govt - Sakshi

కీలక ప్రతిపాదనలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు ఆమోదం

రిటైర్మెంట్‌ వయసు కుదింపు, స్వచ్ఛంద వీఆర్‌ఎస్‌, 4జీ స్పెక్ట్రం కేటాయింపు

సుమారు 54,451 మంది ఉద్యోగులకు ఉద్వాసన

ఎన్నికల  అనంతరం తుది ప్రకటన

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ టెలికాం రంగంలో ముకేశ్‌​ అంబానీ నేతృత్వంలోని జియో ఎంట్రీ పోటీ కంపెనీలను భారీగా దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  (బీఎస్‌ఎన్‌ఎల్‌) తీవ్ర నష్టాలతో కుదేలై పోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక బీఎస్‌ఎన్‌ఎల్‌ చరిత్రలో తొలిసారి ఇబ్బందులు పడింది. ఈ చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయలను అప్పు చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడింది. తాజా మరో షాకింగ్‌ న్యూస్‌ వెలుగు చూసింది. ఎన్నికల అనంతరం సంస్థలో వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఎన్నికల అనంతరం తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

దాదాపు 54వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించే ప్రతిపాదనకు బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మార్చి నెలలో నిర్వహించిన బోర్డు సమావేశంలోఈ మేరకు సంస్థ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు మొత్తం పది ప్రతిపాదనలను సూచించగా.. అందులో మూడింటికి బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు ఆమోదించింది. పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడం, అలాగే 50 సంవత్సరాల పైబడిన ఉద్యోగులందరినీ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) కింద ఇంటికి పంపించడం, మూడవ ప్రతిపాదన 4జీ స్పెక్ట్రం కేటాయించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం ఉద్యోగుల్లో 31శాతం అంటే సుమారు 54,451 మంది  ప్రభావితం కానున్నారు.

బీఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ ఉద్యోగులకు  వీఆర్‌ఎస్‌ పథకం అమలు ఆమోదానికి  టెలికాం విభాగం క్యాబినెట్‌ నోట్‌ను తయారు చేస్తోంది. అలాగే ఎలక్షన్‌ కమిషన్‌ ప్రత్యేక అనుమతిని కోరనుందని సీనియర్‌ అధికారి ఒకరుతెలిపారు  వీఆర్‌ఎస్‌ పథకానికి 10 సంవత్సరాల బాండ్లను జారీచేయనుంది. గుజరాత్ మోడల్ కింద,  వీఆర్‌ఎస్‌  తీసుకుంటున్న ఉద్యోగులకు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల జీతంతో సమానమైన  మొత్తం, అలాగే  ఇంకా మిగిలిన ఉన్నసర్వీసులో ప్రతి సంవత్సరానికి 25 రోజుల వేతనాన్ని చెల్లించాలని ఇరు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదించాయి.

కాగా, తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాల కోసం 5 వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థలో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

చదవండి : జియో ఎఫెక్ట్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ చరిత్రలో తొలిసారి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top