ర్యాలీకి రేట్ల దెబ్బ 

 BSE launches chatbot for faster access to stock market info - Sakshi

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి సూచీలు

రేట్లు పెంచిన ఆర్‌బీఐ

9 రోజుల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ 

వడ్డీరేట్ల ప్రభావిత  షేర్లకు నష్టాలు

85 పాయింట్లు తగ్గి 37,522కు సెన్సెక్స్‌

10 పాయింట్ల నష్టంతో 11,346కు నిఫ్టీ  

తొమ్మిది రోజుల సెన్సెక్స్‌ లాభాలకు బుధవారం బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన స్టాక్‌ సూచీల ర్యాలీని ఆర్‌బీఐ రేట్ల పెంపు దెబ్బతీసింది.  పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, పీఎమ్‌ఐ గణాంకాలు పేలవంగా ఉండటం, జూలై వాహన విక్రయాలు మిశ్రమంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఆద్యంతం  తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య ట్రేడైన స్టాక్‌ సూచీలు చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 85 పాయింట్లు నష్టపోయి 37,522 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,346 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,712 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,391 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. గత తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,255 పాయింట్లు లాభపడింది. గత ఏడు సెషన్లలో ప్రతీ సెషన్‌లోనూ ఆల్‌టైమ్‌ హైల వద్దే ముగిసింది.  
పాలసీ తర్వాత అమ్మకాలు...: ఆర్‌బీఐ రెపోను పావు శాతం మేర పెంచింది.  దీంతో వడ్డీరేట్ల ప్రభావిత వాహన, ఆర్థిక, బ్యాంక్, రియల్టీ షేర్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 105 పాయింట్ల లాభంతో 37,712 పాయింట్ల వద్ద ఆల్‌ టైమ్‌ హైని తాకింది.  పాలసీ వెలువడిన తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, బ్యాంక్, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారిపోయింది.174 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో 37,433 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. రోజంతా 279 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 

8 నుంచి క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీఓ 
సూక్ష్మ రుణ సంస్థ, క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఈ నెల 8న ఆరంభమై, 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.630 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల 1.49 కోట్ల షేర్లను జారీ చేస్తారు. ఈ ఐపీఓకు రూ.418–422 ధరలను ప్రైస్‌బ్యాండ్‌గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 35 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 23న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top