ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

Bharti Airtel posts net loss of Rs 2,866 crore in Q1 results - Sakshi

14 ఏళ్ల తర్వాత నష్టాలు

5 శాతం వృద్ధితో రూ.20,738 కోట్లకు మొత్తం ఆదాయం

రూ.129కు పెరిగిన ఏఆర్‌పీయూ  

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్‌ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్‌వర్క్‌ తరుగుదల వ్యయాలు,  భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో  ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది.  

94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్‌..
మొబైల్‌  కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ–యావరేజ్‌ రెవెన్యూ పర్‌ యూజర్‌) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్‌పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్‌ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ(ఇండియా అండ్‌ సౌత్‌ ఏషియా) గోపాల్‌ విట్టల్‌ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు.  

మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్‌ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.324 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top