అత్యుత్తమ పన్ను వ్యవస్థే లక్ష్యం

The best tax system is the goal : jaitly - Sakshi

ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 

ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నట్లు వివరణ  

న్యూఢిల్లీ: పన్నులకు సంబంధించి అత్యుత్తమ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గత రెండుమూడేళ్లుగా పలు చర్యలు తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పన్ను పాలనా వ్యవస్థలో సరళీకరణ, పారదర్శకత లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వశాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ రెండవ సమావేశంలో ‘ఆదాయపు పన్ను శాఖ వ్యవహారాలకు’ సంబంధించి జైట్లీ శుక్రవారం ప్రసంగించారు. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు చూస్తే...

రూ. 50 లక్షల వరకూ ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు సరళతరమైన, పారదర్శకమైన సింగిల్‌ ఐటీఆర్‌–1 (సహాజ్‌) ఫామ్‌ను ప్రవేశపెట్టడం సంస్కరణల దిశలో కీలకమైనది.
 రూ.2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ మధ్య ఆదాయం ఉన్న వారి ఆదాయపు పన్ను రేటును 10% నుంచి 5%కి తగ్గించాం. వ్యక్తిగత పన్నుకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అతితక్కువ రేటు.
 రూ.5 లక్షల వరకూ ఆదాయానికి సంబంధించి నాన్‌–బిజినెస్‌ పన్ను చెల్లింపుదారులకు ‘నో స్క్రూటినీ’ విధానం అమలు కీలకమైనది.  పన్నుల పరిధి విస్తృతి, ఐటీ రిటర్న్స్‌ దాఖలు, పన్ను బకాయిలు చెల్లింపులకు సంబంధించి ఆయా తరహా వ్యక్తులను ప్రోత్సహించే  దిశలో ఈ చర్య కీలకమైనది.
 ఈ ఏడాది 97 శాతం ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ఆన్‌లైన్‌ద్వారా దాఖలయ్యాయి. వీటిలో 92 శాతం 60 రోజుల్లో ప్రాసెస్‌ అయ్యాయి. అలాగే 90 శాతం రిఫండ్స్‌ 60 రోజుల్లో జరిగాయి.
 డీమోనిటైజేషన్‌ నేపథ్యంలో లభ్యమైన డేటా ప్రాతిపదికన, 1,100 ఆదాయపు పన్ను దాడులు జరిగాయి. రూ.513 కోట్ల నగదుసహా రూ.610 కోట్ల జప్తు జరిగింది. అలాగే రూ.5,400 కోట్ల వెల్లడించని సొమ్ము గుర్తించడం జరిగింది. 400 కేసులు తగిన చర్యల నిమిత్తం ఈడీ, సీబీఐలకు రిఫర్‌ అయ్యాయి.
 డీమోనిటైజేషన్‌ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సానుకూల చర్య. ఆదాయవసూళ్లు 2016–17లో గణనీయంగా పెరిగాయి. ప్రత్యక్ష పన్నులు రూ.14.5 శాతం వృద్ధితో రూ.8,49,818 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 18 వరకూ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.7 శాతం వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక 2012–13లో 4.72 కోట్లుగా ఉన్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2016–17లో 6.25 కోట్లకు పెరిగింది.

బ్యాంకింగ్‌ లావాదేవీల చార్జీలు తగ్గాలి: ఎంపీలు
డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా బ్యాంకింగ్‌ లావాదేవీల చార్జీలను తగ్గించాలని పార్లమెంటు సభ్యులు (ఎంపీ) సమావేశంలో సూచించారు. తరచూ విద్యుత్‌ కోతలు జరిగే ప్రాంతాల్లో, అలాగే ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని ప్రదేశాలకు చెందిన ప్రజలకు రిటర్న్స్‌ దాఖలు చేయడానికి సమయాన్ని కొంత పొడిగించాలని మరికొందరు పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తి చేశారు. నల్లధనాన్ని అరికట్టడానికి మరిన్ని దాడులు జరపాల్సిన అవసరం ఉందనీ వారు సూచించారు.  

చిన్న పొదుపుపై వడ్డీరేటు యథాతథం
పీపీఎఫ్, కిసాన్‌ వికాశ్‌ పత్ర, సుకన్య సంమృద్ధి యోజన వంటి చిన్న తరహా పొదుపు పథకాలపై మూడవ త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఆర్‌బీఐ పరపతి సమీక్ష నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2017–18 రెండవ త్రైమాసికంలో నోటిఫై అయిన రేట్లే మూడవ త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచీ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై త్రైమాసికంగా సమీక్షలు జరిపి, ఒక నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

జైట్లీతో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ భేటీ
ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ శుక్రవారం ఆర్థికమంత్రి  జైట్లీతో సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై ఈ సమావేశంలో ఇరువురు చర్చించినట్లు తెలిసింది. అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ నాల్గవ ద్వైమాసిక  విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

మొదటి త్రైమాసికంలో జీడీపీ మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7%కి పతనం కావటం,  పారిశ్రామిక ఉత్పత్తి మందగించటం, వృద్ధికి ఊపునివ్వడానికి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) ఆర్‌బీఐ మరింత తగ్గించాలన్న డిమాండ్‌ నేపథ్యంలో వచ్చే నెల మొదటివారంలో జరగనున్న పరపతి విధాన కమిటీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. పాలసీ సమావేశానికి ముందు ఆర్‌బీఐ గవర్నర్‌ ఆర్థికమంత్రితో సమావేశం కావడం సంప్రదాయంగా వస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top