మార్కెట్‌ అక్కడక్కడే

Benefits to bank shares with short covering - Sakshi

షార్ట్‌ కవరింగ్‌తో బ్యాంక్‌ షేర్లకు లాభాలు

దీంతో తగ్గిన నష్టాలు  

21 పాయింట్ల నష్టంతో 33,836కు సెన్సెక్స్‌ 

16 పాయింట్లు తగ్గి 10,411కు నిఫ్టీ

లోహ, వాహన, ఆయిల్, గ్యాస్‌ షేర్లు పతనం కావడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్ప నష్టాలతో ముగిసింది. వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ తలెత్తడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలైన కారణంగా ఇంట్రాడేలో స్టాక్‌ సూచీలు బాగానే నష్టపోయాయి. అయితే  షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్ల దన్నుతో బ్యాంక్‌ షేర్లు లాభపడడడం, టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గడంతో నష్టాలు తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21 పాయింట్ల నష్టంతో 33,836 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 10,411 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 10,400  పాయింట్ల దిగువకు పడిపోయింది. మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ఎల్‌ అండ్‌ టీ షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. ఆయిల్, గ్యాస్, రియల్టీ, లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్తు, క్యాపిటల్‌ గూడ్స్, వాహన, పీఎస్‌యూ షేర్లు నష్టపోయాయి.  

ప్రభావిత అంశాలు...
రాజీనామా చేసిన అమెరికా విదేశీ మంత్రి రెక్స్‌ టిల్లర్సన్‌ స్థానంలో చైనా, ఇరాన్‌ల మాట ఎత్తితేనే ఒంటికాలిపై లేచే సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను అమెరికా అధ్యక్షడు డొనాల్ట్‌ ట్రంప్‌ నియమించారు. దీంతో  సుంకాల విషయంలో డొనాల్ట్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గే అవకాశాల్లేవన్న అంచనాలతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఈ ప్రభావంతో బుధవారం ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావంతో గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌తో సెన్సెక్స్‌ 33,734 పాయింట్ల వద్ద  నష్టాల్లోనే ఆరంభమైంది. అమ్మకాలు జోరుగా ఉండటంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 276 పాయింట్ల నష్టంతో 33,581 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఫిబ్రవరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టానికి తగ్గడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం, బ్యాంక్‌ షేర్లలో రికవరీ కారణంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో ఇంట్రాడేలో 18 పాయింట్ల లాభంతో 33,875 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.  మొత్తం మీద సెన్సెక్స్‌ 294 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 91 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 6 పాయింట్లు లాభపడింది.  

లాభాల్లో బ్యాంక్‌ షేర్లు..
ఆరంభంలో నష్టాలు వచ్చినప్పటికీ, పలు బ్యాంక్‌ షేర్లు చివరకు లాభాల్లో ముగిశాయి. లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌(ఎల్‌ఓయూ) రూపంలో బ్యాంక్‌లు గ్యారంటీనివ్వడాన్ని నిషేధిస్తూ ఆర్‌బీఐ మంగళవారం నిర్ణయం తీసుకోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే బ్యాంక్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఈ షేర్లు 10 శాతం వరకూ లాభపడ్డాయి.  ఐడీబీఐ బ్యాంక్‌ 10 శాతం, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 6 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 4.7 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 4 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌3.5 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3 శాతం, కెనరా బ్యాంక్‌3 శాతం, ఎస్‌బీఐ 1 శాతం వరకూ పెరిగాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top