380 పాయింట్లవరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్

380 పాయింట్లవరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ - Sakshi


- గ్రేడింగ్ ప్రారంభంలో 380 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

- ఎఫ్‌ఎంసీజీ, టెలికాం షేర్ల ఆసరాతో చివర్లో రికవరీ

- 75 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ



ఆర్‌బీఐ హఠాత్తుగా బ్యాంకు రేటు పెంచడంతో మంగళవారం బ్యాంకింగ్, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లు కుప్పకూలాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 380 పాయింట్లవరకూ పతనమై 19,649 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అయితే ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, సిమెంటు, ఆయిల్ షేర్లలో క్రమేపీ కొనుగోళ్లు జరగడంతో సూచీ కనిష్టస్థాయి నుంచి 200 పాయింట్లకుపైగా కోలుకుంది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 183 పాయింట్ల నష్టంతో 19,851 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 5,910 పాయింట్ల వద్దకు పతనమైన తర్వాత, 50 పాయింట్ల వరకూ రికవరీ అయ్యింది.



చివరకు 75 పాయింట్ల నష్టంతో 5,955 పాయింట్ల వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 357 కోట్ల మేర నికర విక్రయాలు జరపగా, దేశీయ సంస్థలు రూ. 210 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించాయి. బ్యాంక్ రేటు పెంపు ప్రభావంతో నిధుల వ్యయం పెరిగి, మార్జిన్లు తగ్గే అవకాశం వున్నందున పలు బ్యాంకింగ్ కౌంటర్లలో భారీ విక్రయాలు జరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పీఎన్‌బీ, ఎస్‌బీఐ షేర్లు 4-7 శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీలోని టాప్‌టెన్ లూజర్స్‌లో 7 షేర్లు బ్యాంకింగ్ రంగానికే చెందినవి కావడం గమనార్హం. రియల్టీ, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ తదితక షేర్లు కూడా 7 శాతంపైగా పడిపోయాయి.



నిఫ్టీలో షార్ట్ కవరింగ్....

ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా స్టాక్ సూచీలు కుప్పకూలగానే, కనిష్టస్థాయి వద్ద నిఫ్టీ ఫ్యూచర్స్‌లో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగింది. సోమవారం నిఫ్టీ స్పాట్ , ఫ్యూచర్ మధ్య ఒక్క పాయింట్ మాత్రమే ప్రీమియం వుండగా, మంగళవారం షార్ట్ కవరింగ్‌ను ప్రతిబింబిస్తూ ప్రీమియం 15 పాయింట్లకు పెరిగిపోయింది. దాంతో నిఫ్టీ జూలై కాంట్రాక్టులో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 7 శాతంపైగా కట్ అయ్యింది. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 100 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చనే సూచన వెలువడింది.



ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కూడా...

పతనం నుంచి స్టాక్ సూచీలు కోలుకోవడానికి ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఐటీసీ, హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) సహకరించాయి. వీటి కాంట్రాక్టుల్లో కూడా ట్రేడర్లు షార్ట్స్ కవర్ చేసుకున్నారు. ఆల్‌టైమ్ రికార్డుస్థాయి రూ.362కు పెరిగిన ఐటీసీ ఫ్యూచర్లో ఓఐ నుంచి 1.33 లక్షల షేర్లు కట్ అయ్యాయి. హెచ్‌యూఎల్ ఫ్యూచర్ ఓఐ నుంచి 1.98 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ఈ రెండు షేర్లకూ తగ్గుదలలో కొనుగోలు మద్దతు లభించవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.



బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో షార్ట్ బిల్డప్....

పతనమైన షేర్లలో తాజా షార్ట్ బిల్డప్, పెరిగిన షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం మంగళవారం నాటి డెరివేటివ్ ట్రేడింగ్ విశేషం. పలు బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ బిల్డప్‌ను సూచిస్తూ ఓపెన్ ఇంట్రస్ట్ పెరిగిపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ ఫ్యూచర్ కాంట్రాక్టులో ఓఐ 5 శాతం చొప్పున పెరిగింది. డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ కాంట్రాక్టులో ఓఐ 10 శాతం, 5 శాతం చొప్పున పెరిగింది. ఈ రెండు షేర్లలోనూ సమీప స్ట్రయిక్స్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top