యాపిల్‌.. ఎవరికి తీపి?

Apple's iPhone 7 outsold every other smartphone globally: Report - Sakshi

భారత మార్కెట్లో పాగాకు యాపిల్‌ ప్రణాళిక

తయారీ కోసం భారీ రాయితీలివ్వాలని అభ్యర్థన

ఇంకా ఎటూ తేల్చుకోని కేంద్ర ప్రభుత్వం

కొత్త ప్లాంటుతో ఒరిగేదేమీ లేదంటున్న పరిశ్రమ

స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే చాన్స్‌ ఎటూ ఉండదు

అసెంబ్లింగ్‌ కనక తక్కువ ఉద్యోగాలు; అవీ చిన్న స్థాయివే

ప్రభుత్వానికి ఆదాయ నష్టం; కంపెనీకే అధిక మార్జిన్లు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో : నిజమే!! ప్రపంచంలో యాపిల్‌ సంస్థకున్న విశేషణాలు అన్నీ ఇన్నీ కావు. అతిపెద్ద కంపెనీ మాత్రమే కాదు. అత్యంత విలువైన బ్రాండ్‌ ఇది. దీని మార్కెట్‌ విలువ మన కరెన్సీలో ఏకంగా రూ.50 లక్షల కోట్ల పైమాటే. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో యాపిల్‌ బ్రాండ్‌ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. అలాంటి టెక్నాలజీ దిగ్గజం వేగంగా విస్తరిస్తున్న భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై దృష్టి పెట్టింది.

ఫోన్ల తయారీని కూడా ఇక్కడే చేపడతామని, అందుకు పన్ను మినహాయింపులతో పాటు రకరకాల రాయితీలివ్వాలని కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని చాన్నాళ్లుగా పెండింగ్‌లో పెట్టటమే కాకుండా... అలాంటి మినహాయింపులిచ్చే అవకాశాల్లేవని తాజాగా సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు యాపిల్‌ ఇక్కడ తయారీ చేపడితే మనకేంటి లాభం? ఉద్యోగాలొస్తాయా? ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా? ఇతరత్రా ప్రయోజనాలున్నాయా? అనే విశ్లేషణే ఈ కథనం...

ఇండియాపై దృష్టి ఎందుకంటే..!
అమెరికా తర్వాత యాపిల్‌కు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ చైనాయే. అలాంటి చైనాలో యాపిల్‌ అమ్మకాలు ఈ మధ్య తగ్గటం మొదలెట్టాయి. ఆ తరువాతి స్థానాన్ని ఆక్రమించే అవకాశం భారత్‌కు మాత్రమే ఉంది. పైపెచ్చు ఇక్కడ యాపిల్‌ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతోంది. దీంతో సహజంగానే ఈ టెక్నాలజీ దిగ్గజం ఇటువైపు కన్నేసింది.

ఇండియా మార్కెట్లో పాగా వేయటానికి ఇక్కడ తయారీకి ముందుకొచ్చింది. తొలి దశలో భాగంగా ఇప్పటికే తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ విస్ట్రన్‌ కార్పొరేషన్‌తో కలిసి బెంగళూరు సమీపంలో ఐఫోన్‌–ఎస్‌ఈ మోడల్‌ను అసెంబుల్‌ చేస్తోంది. తాము కోరినట్టుగా ప్రభుత్వం మినహాయింపులిస్తే రెండో దశ కింద మరో ప్లాంటు ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది.

యాపిల్‌ ప్రతిపాదనలపై ఇప్పటి దాకా ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేదు. ఇతర కంపెనీలను కాదని ఒక్క యాపిల్‌కే భారీ రాయితీలిస్తే వివాదం రాజుకుంటుందనే భయాలు అధికార వర్గాల్లో ఉన్నాయి. పరిశ్రమ వర్గాల అభిప్రాయం మాత్రం.. ఒకవేళ ప్రభుత్వం ఈ రాయితీలన్నీ ఇస్తే అది యాపిల్‌కు తప్ప కస్టమర్లకు గానీ, ప్రభుత్వానికి గానీ ఒరిగేదేమీ లేదన్నట్టే ఉంది.

కంపెనీ ఏం కోరుతోందంటే...
యాపిల్‌ తన ఫోన్ల ఉత్పత్తి కోసం థర్డ్‌ పార్టీపైనే ఆధారపడుతుంది. ఆ థర్డ్‌ పార్టీ సంస్థలకు తయారీ, రిపేర్‌ యూనిట్లు, విడిభాగాలు, యంత్ర పరికరాలు, సర్వీసు, స్పేర్‌ పార్ట్స్‌పై 15 ఏళ్లపాటు పన్ను మినహాయింపులివ్వాలని కేంద్రాన్ని యాపిల్‌ కోరుతోంది. మరోవంక దేశంలో ఏ వస్తువు తయారు చేసినా దాన్లో వాడే భాగాల్లో కనీసం 30% దేశీయంగానే కొనుగోలు చేయాలన్న నిబంధన ప్రస్తుతం ఉంది. దీన్ని కూడా తమకు మినహాయించాలని యాపిల్‌ కోరుతోంది. అంటే 100 శాతం విడిభాగాలను విదేశాల నుంచే తెచ్చుకుంటుందన్న మాట.

భారత్‌లో అసెంబుల్‌ కోసం కంప్లీట్‌ నాక్‌ డౌన్‌ (సీకేడీ), సెమీ నాక్‌ డౌన్‌ (ఎస్‌కేడీ) యూనిట్లపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించాలని అడుగుతోంది. ఆశించిన ప్రయోజనాలివ్వకపోతే, అధిక పన్నులు చెల్లించి పలు దేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని భారత్‌లో అసెంబుల్‌ చేయాల్సిన అవసరమేంటన్నది కంపెనీ ప్రశ్న. ఇప్పటికే భారత్‌లో 90 కంపెనీలు తయారీని చేపడుతున్నాయి. పన్ను మినహాయింపులు, ప్రయోజనాలతో విడిభాగాల తయారీ కంపెనీలను ఆకట్టుకుంటే... ఇతర బ్రాండ్లకూ ప్రయోజనం కలుగుతుందని యాపిల్‌ చెబుతోంది.

తగ్గనున్న తయారీ వ్యయం..
ప్రస్తుతం దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్లపై 10 శాతం బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ ఉంది. చార్జర్, హెడ్‌సెట్స్, బ్యాటరీ, యూఎస్‌బీ కేబుల్స్‌పైనా ఈ డ్యూటీ ఉంది. అదే విడిభాగాలు దిగుమతి చేసుకుంటే కీలకమైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్, కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్స్, డిస్‌ప్లే అసెంబ్లీ, టచ్‌ ప్యానెల్, రింగర్‌కు కస్టమ్‌ డ్యూటీ మినహాయింపు ఉంది. కంపెనీ కోరినట్టు ప్రభుత్వం గనక భారీ రాయితీలిస్తే ఐఫోన్ల తయారీ వ్యయం కనీసం 10 శాతమైనా తగ్గవచ్చని ఓ భారతీయ బ్రాండ్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. దీంతో కంపెనీ మార్జిన్లు భారీగా పెరిగే అవకాశం ఉందన్నది ఆయన చెప్పారు.

భారత్‌ ఎందుకంటే..
దేశంలో నెలకు 1,40,000 పైచిలుకు యాపిల్‌ ఐఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాటా దాదాపు 8,000 యూనిట్లు. రూ.26,000 ధరతో ఉన్న ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ దేశంలో అధికంగా అమ్ముడవుతోంది. ఐఫోన్లలో తక్కువ ధర ఉన్న మోడల్‌ ఇదే. దేశంలో స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ఐఫోన్ల వాటా విలువ పరంగా 7–8 శాతం ఉంటుందని ప్రముఖ రిటైల్‌ కంపెనీ డైరెక్టర్‌ ఒకరు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

నిజానికి ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌కు థర్డ్‌ పార్టీ తయారీదార్లున్నారు. భారత్‌లో విస్ట్రన్‌ కార్పొరేషన్‌తో కలిసి పనిచేస్తోంది. ఇక్కడ అసెంబ్లింగ్‌తో పాటు దశలవారీగా విడిభాగాల తయారీని చేపట్టాలని... భారత్‌ను ఎక్స్‌పోర్ట్‌ హబ్‌గా మార్చుకోవాలన్నది తమ ఉద్దేశమని గతేడాది భారత్‌కు వచ్చిన సందర్భంగా యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ చెప్పారు కూడా.

ధరల్లో మార్పు ఉండదు..
మరి తయారీ వ్యయం తగ్గినపుడు యాపిల్‌ తన విక్రయ ధరను కూడా తగ్గిస్తుందా? దీనిపై పలువురు విక్రేతలతో మాట్లాడగా... యాపిల్‌ ఉత్పత్తుల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయని వారు చెప్పారు. వివిధ దేశాల్లో పన్ను వ్యత్యాసాల వల్లే ధర మారుతుందన్నారు. ఇలా చూస్తే ఇక్కడ చౌకగా తయారు చేసినా కంపెనీ తన ఉత్పత్తుల ధర తగ్గిస్తుందన్న నమ్మకం లేదు. ‘‘ కంపెనీకి లాభాలు పెరిగినా అవి కస్టమర్లకు బదిలీ చేస్తుందని చెప్పలేం’’ అని ఓ విక్రేత వ్యాఖ్యానించారు.

ఆ లాభాన్ని మార్కెటింగ్‌పై వెచ్చించి, తద్వారా అమ్మకాలను పెంచుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రభుత్వానికి 15 ఏళ్లపాటు పన్ను ఆదాయం రాదు. యాపిల్‌ ఇక్కడ చేసిన వ్యాపారమంతా విదేశీ పరమవుతుంది.  ప్రీమియం ఫోన్లు కనక ఇక్కడి సగటు కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు’’ అని వివరించారు.

పోనీ కొత్త ఉద్యోగాలేమైనా వస్తాయా? అని ఇప్పటికే తయారీ రంగంలో ఉన్న దక్షిణాది కంపెనీ అధిపతినొకరిని అడగ్గా... ‘‘ఫోన్ల రీసెర్చ్‌– డెవలప్‌మెంట్‌గానీ, విడి భాగాల తయారీ గానీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌గానీ ఇక్కడ ఉండదు కనక అసెంబ్లింగ్‌లో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలేమీ ఉండవు. కొత్త ప్లాంట్‌ వచ్చినా 2,000 మందికి మించి కొత్తగా ఉద్యోగాలు రాకపోవచ్చు. ఖరీదైన ఫోన్లు కనక మామూలు డిగ్రీ చదివినవారినే ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది’’ అని ఆయన వివరించారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top