ద్రవ్యలోటు భయాలతో నష్టాలు

60% rally in 7 days, 1500% in 3 years; will this stock continue - Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

137 పాయింట్ల పతనంతో 34,047కు సెన్సెక్స్‌

35 పాయింట్ల నష్టంతో 10,458కు నిఫ్టీ 

జీడీపీ, కోర్‌ సెక్టార్‌ గణాంకాలు అంచనాలను మించినప్పటికీ, ద్రవ్యలోటు భయాలు గురువారం స్టాక్‌ మార్కెట్‌ను పడగొట్టాయి. స్టాక్‌ సూచీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు భయాలు కొనసాగడంతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 137 పాయింట్లు నష్టపోయి 34,047 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో 10,458 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక ఈ వారంలో సెన్సెక్స్‌ 95 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల చొప్పున నష్టపోయాయి.  బ్యాంక్‌ రుణ మోసాల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫిబ్రవరి నెల వాహన విక్రయాలు బాగా ఉండటంతో కొన్ని వాహన కంపెనీ షేర్లు దూసుకుపోవడంతో నష్టాలు కొంత తగ్గాయి. బుధవారం మార్కెట్‌ ముగిశాక వెలువడిన జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటంతో సెన్సెక్స్‌ 34,279 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో జీడీపీ ఐదు క్వార్టర్ల గరిష్ట స్థాయికి,  7.2 శాతం వృద్ధి చెందింది. జనవరిలో కోర్‌ సెక్టార్‌ 6.2 శాతం వృద్ధి చెందడం కూడా కలసిరావడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 95 పాయింట్ల లాభంతో 34,279 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, ఈ ఏడాది జనవరి చివరినాటికి ద్రవ్యలోటు రూ.6.77 లక్షల కోట్లు(ఇది బడ్జెట్‌ లక్ష్యంలో 13.7 శాతం అధికమై మొత్తం 113.7 శాతానికి ఎగసింది) పెరగడం, సుదీర్ఘ సెలవుల కారణంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సెన్సెక్స్‌ 168 పాయింట్లు క్షీణించి 34,016 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో కనిష్ట స్థాయిని తాకింది. 

పెరిగినప్పుడల్లా అమ్మకాలు...
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మార్కెట్‌ పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారని నిపుణులు అంటున్నారు. జీడీపీ, కీలక పరిశ్రమల గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ, ఆరంభంలో  మార్కెట్లో లాభాలు వచ్చాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ చెప్పారు. 

ఓఎన్‌జీసీ: గత ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌గా ఒక్కో షేర్‌కు రూ.2.25ను (45%)చెల్లించనున్నది. ఈ షేర్‌కు రికార్డ్‌ డేట్‌గా ఈ నెల 14ను నిర్ణయించింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నది. ఇక ఒక్కో షేర్‌కు రూ.3 చొప్పున తొలి మధ్యంతర డివిడెండ్‌ను గత ఏడాది నవంబర్‌లో చెల్లించింది.   
నాట్కో ఫార్మా: హెపటైటిస్‌–సి చికిత్సలో వాడే సోఫోస్బువిర్‌–400 ఎంజీ ట్యాబ్లెట్ల విక్రయానికై ఏఎన్‌డీఏను యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద దాఖలు చేసింది.
పిట్టి ల్యామినేషన్స్‌: పిట్టి ల్యామినేషన్స్‌ లిమిటెడ్‌ పేరును పిట్టి ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌గా మార్చేందుకై మార్చి 9న బోర్డు సమావేశం కానుంది.

నేడు  సెలవు
హోలీ సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో  ట్రేడింగ్‌ తిరిగి ఈ నెల 5న సోమవారం ప్రారంభమవుతుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top