కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత!

కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత! - Sakshi


6,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం

బెంగళూరు: వ్యాపార పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తడబడుతున్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 2.3 శాతం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్‌ పే అవుట్‌పైనా గణనీయమైన ప్రభావం పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏటా మార్చిలో ముగిసే వార్షిక పనితీరు మదింపు కార్యక్రమంలో భాగంగా పనితీరు ఆశాజనకంగా లేని దిగువ స్థాయిలో ఉన్న ఒక శాతం ఉద్యోగులను తొలగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని... ఈ ఏడాది ఇంతకంటే ఎక్కువ మందినే ఉద్యోగాల నుంచి తప్పించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


గతేడాది ఉద్యోగుల తొలగింపు 1–2 శాతం మధ్యలో ఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం కేవలం ఒక శాతంగానే ఉంది. కాగ్నిజెంట్‌కు 2016 డిసెంబర్‌ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 2,60,200. వీరిలో 72 శాతం అంటే 1,88,000 మంది బారత్‌లో పనిచేస్తున్న వారే. అయితే, దేశీయంగా ఎంత మంది ఉద్యోగులను తొలగించేదీ, ఏ ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత రాలేదు. అయితే, ఆటోమేషన్‌ కారణంగా అవసరం లేని దిగువ స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజెంట్‌ స్పష్టం చేసింది.


‘‘క్లయింట్ల అవసరాలకు, మా వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో సరైన నైపుణ్యాలు ఉండేలా చూసేందుకు క్రమం తప్పకుండా పనితీరును సమీక్షిస్తుంటాం. దీనివల్ల కొంత మంది ఉద్యోగులు కంపెనీని వీడాల్సి రావచ్చు’’ అని కాగ్నిజెంట్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగ్నిజెంట్‌ ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తుండగా, గతేడాది మాత్రం ఇది 8.6 శాతానికే పరిమితమైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top