మార్కెట్‌కు స్వల్ప నష్టాలు

250 stocks have hit 1-year price targets in a matter of weeks - Sakshi

ఇంట్రాడేలో రికార్డ్‌ స్థాయిలకు స్టాక్‌ సూచీలు

లాభాల స్వీకరణతో చివర్లో స్వల్ప నష్టాలు

27 పాయింట్ల నష్టంతో 33,573కు సెన్సెక్స్‌

17 పాయింట్ల పతనంతో 10,424కు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకినప్పటికీ, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌  27 పాయింట్ల నష్టంతో 33,573 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 10,424 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో కదిలాయి. పీఎస్‌యూ బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా షేర్ల లాభాలతో నష్టాలు ఒకింత తగ్గాయి.

ఆల్‌టైమ్‌ హైకి స్టాక్‌ సూచీలు !
స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి. సెన్సెక్స్‌ 33,658, నిఫ్టీ 10,453 పాయింట్లను తాకాయి. ఇవి రెండూ ఈ సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. సెన్సెక్స్‌ ఒక దశలో 57 పాయింట్లు లాభపడగా, మరో దశలో 73 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 130 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

స్టాక్‌ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన నేపథ్యంలో ఇటీవల బాగా లాభపడిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడం... అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచకపోయినా, డిసెంబర్‌లో రేట్లను పెంచే అవకాశాలున్నాయని సంకేతాలివ్వడం... అక్టోబర్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉండటం... తాజాగా వెల్లడైన కొన్ని బ్లూ చిప్‌ కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాల మేరకు లేకపోవడం... తయారీ రంగ గణాంకాలు ఉత్తేజాన్నిచ్చేలా లేకపోవడం.. తదితర అంశాలు  ప్రతికూల ప్రభావం చూపాయి.

హీరో 2 శాతం డౌన్‌...: హీరో మోటోకార్ప్‌ క్యూ2 ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ షేర్‌ 2 శాతం క్షీణించి రూ.3,733కు పడిపోయింది. ఐటీసీ 1.5 శాతం నష్టంతో రూ.266కు తగ్గింది.

దివీస్‌ 17 శాతం అప్‌..
దివీస్‌ ల్యాబ్స్‌కు చెందిన విశాఖపట్నంలోని రెండో యూనిట్‌పై ఇంపోర్ట్‌ అలర్ట్‌ను అమెరికా ఎఫ్‌డీఏ తొలగించనుందనే వార్తల నేపథ్యంలో దివీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 21 శాతం లాభపడింది. చివరకు 17 శాతం లాభంతో రూ.1,074 వద్ద ముగిసింది.  ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఒకేరోజు రూ.4,088 కోట్లు పెరిగి రూ. 28, 519 కోట్లకు ఎగసింది.

8 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన మహీంద్రా లాజిస్టిక్స్‌ ఐపీఓ: 10న లిస్టింగ్‌
మహీంద్రా లాజిస్టిక్స్‌ ఐపీఓ8 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. రూ.425–429 ప్రైస్‌బాండ్‌తో గత నెల 31న ప్రారంభమైన ఈ ఐపీఓ గురువారం ముగిసింది. క్విబ్స్‌కు కేటాయించిన వాటా 16 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 2 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 6 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.829 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నెల 10న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top